జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక… వీసీకే అభ్యర్థిగా తెలంగాణ శ్యామ్

జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కన్నుమూశాక, ఆయన శాసనసభ స్థానానికి ఖాళీ ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషన్ ఆ సీటుని భర్తీ చేసే ప్రక్రియలో భాగంగా నోటిఫికేషన్ జారిచేసింది. నవంబర్ పదకొండో తేదీ రోజున పోలింగ్ జరుగనున్నది. 21న అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేస్తారు. 24న నామినేషన్ ఉపసంహారణ ఉంటుంది. 14న కౌంటింగ్ పనులను ప్రారంభిస్తారు. 16వ తేదీన ఎన్నికలు ప్రక్రియ మొత్తం పూర్తి అవుతుందని కమిషన్ ఇదివరకే ప్రకటన విడుదల చేసిన విషయం అందరికి తెలిసిందే.

బరిలోకి అభ్యర్థులు

ఈ ఎన్నికకు సంబంధించి ఆయా రాజకీయ పార్టీలు తమ తమ అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత, బీజేపీ లంకల దీపక్ రెడ్డిని ఖరారు చేశారు.  ఇప్పటి వరకు త్రిముఖ పోరు అనుకుంటున్న తరుణంలో ప్రస్తుతం ఈ స్థానానికి అనూహ్యంగా విముక్త చిరుతల కక్షి (వీసీకే) తమ అభ్యర్థిని బరిలోకి దింపింది. వీసీకే పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జిలుకర శ్రీనివాస్ తమ అభ్యర్థిగా తెలంగాణ శ్యామ్ పేరును ప్రకటించారు.

శ్యామ్‌కు ఎమ్మెల్యే టికెట్

తెలంగాణ శ్యామ్ వీసీకే పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. రాజకీయంగా మరియు సామాజికంగా తెలంగాణలోనే కాకుండా దేశంలో జరిగే ప్రతి సమస్య మీద ఆయన త్వరితగతిన స్పందిస్తూ ఉంటారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా గానీ శ్యామ్ ఎప్పుడూ బాధితుల తరుపున పోరాడుతుంటారు. వారికి అన్ని వేళల అందుబాటులో ఉంటూ అండగా నిలబడటం ఆయన యొక్క సహజ లక్షణంగా చెబుతుంటారు. నిరంతరం ప్రజల పక్షం వహించే సామాజిక ఉద్యమకారుడు మరియు నిత్యం జనం పడే బాధలపట్ల సరైన అవగాహన, మంచి జ్ఞానం ఉన్న రాజకీయ నాయకుడు అయిన తెలంగాణ శ్యామ్‌కు జూబ్లీహిల్స్ టికెట్ కేటాయించడం నిజంగా హర్షించదగినదిగా అందరూ భావిస్తున్నారు. ఇంతకు ముందు వీసీకె నుంచి ఎంపీగా పోటీచేశారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఏ మేరకు ఫలితాలు సాధిస్తారో చూడాలంటే నవంబర్ 14 వరకు వేచిచూడాలి.

మార్వాడీ గోబ్యాక్ ఉద్యమానికి రూపకర్త

తెలంగాణలో ఉన్న స్థానిక వ్యాపారాలు దెబ్బతింటున్నాయని, తరతరాలుగా చేతివృత్తి చేసుకుని బతికే పేద చిన్న చిన్న వ్యాపారస్థులు తీవ్రంగా నష్టపోతున్నారని.. వాళ్ల అందరి తరపున ఆయన మార్వాడీ గోబ్యాక్ ఉద్యమానికి శ్యామ్ శ్రీకారం చుట్టారు. తెలంగాణ వాసుల కట్టు, బొట్టు, తిండి, పండగలు, ఆచారాలు, సాంప్రదాయాలు, మాట్లాడే బాష, సంస్కృతి మొత్తం గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలనుంచి వచ్చిన మార్వాడిల కారణంగా నాశనం అవుతున్నదని, స్థానికంగా ఉన్న ప్రజలపైన దాడులకు పాల్పడుతున్నారని, వాళ్ళు చేసే ఇల్లీగల్ దందా వల్ల స్థానిక వ్యాపారులు దుకాణాలు ముసివేసే పరిస్థితులు వచ్చాయని వీటి నుంచి మాకు విముక్తి కావాలని ఆయన పోరాటం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన్ని పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తరువాత ఏ కేసు లేకుండా పూచికత్తుపై విడుదల చేశారు. అయితే ఇప్పటికి శ్యామ్ ఆ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు.

అంబేద్కర్ భావజాలం

బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మ జ్యోతిరావు పూలే, గౌతమ బుద్ధుడు, అశోకుడు లాంటి వారి భావజాలంతో పనిచేసే వ్యక్తి శ్యామ్. అతనికి తగినట్టుగానే ఆయన ఎంచుకున్న పార్టీ కూడా.. తోల్ తిరుమావళవన్ (చిదంబరం ఎంపీ, తమిళనాడు) అంబేద్కర్, పెరియార్, కమ్యూనిస్ట్ భావజాలంతో వీసీకే పార్టీని స్థాపించారు. దళిత్ పాంతర్ మూమెంట్ నుంచి ఈ పార్టీ పుట్టింది. దానికి తగిన విధంగానే ఆ పార్టీ పనిచేస్తోంది.