దీపికా పదుకొనే వివాదం: స్పందించిన స్మృతి ఇరానీ

గతంలో పనిగంటలపై ఇన్ఫోసిస్ నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలో సోషల్ మీడియాలో సంచనలం సృష్టించాయి. కొందరు దీనిని సమర్థిస్తే.. మరికొందరు విమర్శించారు. అయితే ఇది ఉద్యోగ రంగానికి చెందినది. కాబట్టి దీనిని పక్కన పెడితే.. ఇప్పుడు సినిమా రంగంలో కూడా పనిగంటలపై వివాదం తలెత్తింది. దీనికి కారణం దీపికా పదుకొనే రెండు పెద్ద సినిమా ప్రాజెక్టులను కోల్పోవడమే అని తెలుస్తోంది. దీనిపై తాజాగా మాజీ కేంద్రమంత్రి ‘స్మృతి ఇరానీ‘ స్పందించారు.

అది వ్యక్తిగత సమస్య

ఒకప్పుడు తెరపై కనిపించిన స్మృతి ఇరానీ చాలా రోజుల తరువాత క్యుంకీ సాస్ భీ కభీ బహు థి 2లో కనిపించనున్నారు. చాలాకాలం రాజకీయ నాయకురాలుగా పనిచేసిన తరువాత.. మళ్ళీ తులసి పాత్రలో తెరమీద కనిపించనున్నట్లు పేర్కొన్నారు. అయితే పనిగంటలపై వస్తున్న విమర్శలు, దీపికా పదుకొనే కోల్పోయిన రెండు భారీ ప్రాజెక్టులు ఆమె వ్యక్తిగత సమస్య అని పేర్కొన్నారు. దీనిపై ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

అప్పుడు నాకు ఇద్దరు పిల్లలు

నా వరకు.. నేను మాత్రం సీరియల్స్ లేదా సినిమాల్లో నటించేటప్పుడు నిర్మాత కోణంలోనే ఆలోచిస్తాను. నిర్మాత లాభం పొందాలనే ఉద్దేశ్యంతో.. అంకిత భావంతో పనిచేస్తానని స్మృతి ఇరానీ పేర్కొన్నారు. అంతే కాకుండా.. నేను సీరియల్లో నటించే సమయంలో నాకు ఇద్దరు పిల్లలు. అయినా నిర్మాతలకు నష్టం కలిగించకూడదనే ఉద్దేశ్యంతో కష్టపని పనిచేశాను. సినిమాల్లో నటించడం, రాజకీయాల్లోకి వెళ్లడం, పిల్లల ఆలనా.. పాలన అన్నీ కూడా నా ఎంపికలు మాత్రమే. కాబట్టి వీటన్నింటిమీద ఒకేవిధమైన బాధ్యత చూపించాలి. అది నా బాధ్యత కూడా అని స్మృతి ఇరానీ వెల్లడించారు.

ఒక సినిమా లేదా సీరియల్ తెరకెక్కించడానికి ఎంతోమంది కష్టపడతారు. నిర్మాతలు ఎంతో డబ్బును వెచ్చిస్తారు. నటీ, నటులు కూడా వారికి తప్పకుండా సహకరించాలి. నేను ఒక రోజు షూటింగ్ క్యాన్సిల్ చేసుకుంటే.. నా కారణంగా ఆ రోజు ఎంతోమంది కార్మికులకు పనిలేకుండా పోతుంది. ఇది నిర్మాతకు మాత్రమే కాకుండా.. సినీ కార్మికులకు కూడా నష్టాన్ని కలిగిస్తుందని స్మృతి ఇరానీ పేర్కొన్నారు.

దీపికా పదుకొనే కోల్పోయిన ప్రాజెక్టులు

సినిమా రంగంలో అగ్రతారలలో ఒకరైన దీపికా పదుకొనే.. సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమా, వైజయంతీ మూవీస్ వారి కల్కి 2898 ఏడీ పార్ట్ 2 మూవీలలో అవకాశాలను కోల్పోయారు. దీనికి కారణం ఆమె పెట్టిన కండిషన్స్ అని తెలుస్తోంది. ఇందులో పనిగంటలు ప్రధాన సమస్య అని దర్శక, నిర్మాతలు చెబుతున్నారు.

చర్చించుకుంటే సరిపోయేదేమో!

ఒకరకంగా చూస్తే.. ఒక సినిమాపై భారీ మొత్తంలో డబ్బుపెట్టే నిర్మాతలు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత తప్పకుండా చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరి బాధ్యత. కొన్నిసార్లు షూటింగ్ ముందుగా అయిపోవచ్చు, కొన్నిసార్లు ఆలస్యం కూడా అవ్వొచ్చు. ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు.. చిత్ర బృందాలకు చర్చించుకుంటే సరిపోతుంది. ఆలా కాకుండా నేను రోజుకు ఇన్ని గంటలు మాత్రమే పనిచేస్తాను, అని చెప్పడం మాత్రం సమంజసం కాదేమో అనిపిస్తుంది.

ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే.. మహిళ అనగానే తప్పకుండా కొన్ని సమస్యలు ఉంటాయి. వాటిని ఎవరైనా అర్థం చేసుకోవాల్సిందే. ఒక స్త్రీ రోజుకు ఇన్ని గంటలు మాత్రమే పనిచేస్తాను అని చెప్పిందంటే.. దాని వెనుక ఉన్న కారణాన్ని గుర్తించాలి. కొన్నేళ్లుగా సినిమా రంగం కోసం పనిచేసిన దీపికా పదుకొనే.. అంతటి కథానాయకిని కేవలం కొన్ని కండిషన్స్ చూపించి పెద్ద ప్రాజెక్టులకు దూరం చేయడం మంచిది కాదేమో అనేది కొందరి అభిప్రాయం.