ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్ఆర్‌బీ).. 2,570 జూనియర్ ఇంజినీర్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అయితే ఈ ఉద్యోగానికి కావలసిన అర్హతలు, ఎలా అప్లై చేసుకోవాలి, లాస్ట్ డేట్ ఎప్పుడు, జీతం వివరాలు మొదలైన విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ & వయోపరిమితి
ఆర్ఆర్‌బీ విడుదల చేసిన.. జూనియర్ ఇంజినీర్ పోస్టులకు ఈ నెల 31 నుంచి (2025 అక్టోబర్ 31) నుంచి అప్లై చేసుకోవచ్చు. అయితే అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 2025 నవంబర్ 30 అని తెలుస్తోంది. అంటే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి.. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ఏకంగా నెల రోజుల సమయం కల్పించిందన్నమాట.
వయోపరిమితి విషయానికి వస్తే.. కనిష్ట వయసు 18 సంవత్సరాలు, గరిష్టంగా 33 సంవత్సరాలు అన్నట్లు ఆర్ఆర్‌బీ స్పష్టం చేసింది. 2026 జనవరి 1 నాటికి 33 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉండకూడదు. ఈ విషయాన్ని దరఖాస్తుదారులు తప్పకుండా గుర్తుంచుకోవాలి.
విద్యార్హత వివరాలు & ఎంపిక విధానం
సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో బీఈ లేదా బీటెక్, డిప్లొమో వంటివి పూర్తి చేసి ఉండాలి. ఆర్ఆర్‌బీ జూనియర్ ఇంజినీర్స్ ఉద్యోగాల భర్తీ నాలుగు దశలలో జరుగుతుంది. అవి ఫస్ట్ స్టేజి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (స్క్రీనింగ్ టెస్ట్), సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (మెరిట్ టెస్ట్), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ చెకింగ్. ఇలా నాలుగు దశల్లో పరీక్షలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది.
పరీక్ష విధానం
ఆర్ఆర్‌బీ జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలకు రెండు దశల్లో (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) పరీక్షలు జరుగుతాయి. నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పుకు 1/3 నెగెటివ్ మార్కులు ఉంటాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులు ఖచ్చితంగా సమాధానం తెలిసిన ప్రశ్నలకు మాత్రమే ఆన్సర్ ఇవ్వడం మంచిది.
ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ స్క్రీనింగ్ టెస్ట్: ఈ పరీక్షకు 90 నిమిషాల వ్యవధి ఉంటుంది. 100 ప్రశ్నలు 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో గణితం నుంచి 30 ప్రశ్నలు (30 మార్కులు), జనరల్ సైన్స్ నుంచి 30 ప్రశ్నలు (30 మార్కులు), జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ నుంచి 25 ప్రశ్నలు (25 మార్కులు), జనరల్ అవేర్నెస్ నుంచి 15 ప్రశ్నలు (15 మార్కులు) ఇలా మొత్తం 100 ప్రశ్నలు.. 100 మార్కులకు పరీక్ష ఉంటుంది.
సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్: రెండో దశలో పరీక్ష 150 మార్కులకు ఉంటుంది. వ్యవధి 120 నిమిషాలు. దివ్యాంగులకు 160 నిమిషాల వ్యవధి కల్పిస్తారు. ఇందులో టెక్నికల్ ఎబిలిటీస్ నుంచి 100 ప్రశ్నలు, బేసిక్ కంప్యూటర్ అప్లికేషన్ నుంచి 10 ప్రశ్నలు, జనరల్ అవేర్నెస్ నుంచి 15 ప్రశ్నలు, భౌతిక & రసాయన శాస్త్రాల నుంచి 15 ప్రశ్నలు, బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ నుంచి 10 ప్రశ్నలు.. ఇలా మొత్తం 150 ప్రశ్నలు (150 మార్కులు) ఉంటాయి.
ఇలా సిద్ధమవ్వండి
ఆర్ఆర్‌బీ ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుందా.. అని ఎదురు చూసేవారికి ఇది ఒక మంచి శుభవార్త. ఈసారి 2570 పోస్టులు ఉన్నాయి, కాబట్టి కొంచెం పట్టుదలతో ప్రిపేర్ అయితే.. తప్పకుండా ఉద్యోగం మీ సొంతం అవుతుంది. అయితే సిలబస్ చూసుకుంటూ.. ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయి, దీనికి ఎక్కువ సమయం కేటాయించాలి అనే విషయం తెలుసుకుని పరీక్షకు సిద్ధమవ్వాలి. అభ్యర్థులు ఈ విషయాన్ని తప్పకుండా గమనించాలి. అప్పుడే ఉద్యోగం సంపాదించుకోగలరు.