పట్టుదలతో చేస్తే సమరం, తప్పకుండ నీదే విజయం అన్నట్లు.. అంకిత భావంతో చేసే ఏ పనికైనా మంచి ఫలితం ఉంటుందనేది అక్షర సత్యం. ఇలాంటి కోవకు చెందినవారిలో ఒకరు ఫోక్ సాంగ్ సింగర్ రమణ. రమణ అంటే బహుశా ఎవరికీ గుర్తుకు రాకపోవచ్చు.. కానీ పల్సర్ బైక్ పాట గుర్తొస్తే మాత్రం ఈతని పేరు తప్పకుండా గుర్తొస్తుంది. ఇంతకీ ఈ పాట నుంచి ఎంత డబ్బు వచ్చిందో తెలుసా?
పల్సర్ బైక్ పాటకు వచ్చిన డబ్బు
ఒక్క పాటతో.. సెన్సేషన్ క్రియేట్ చేసిన పల్సర్ బైక్ సింగర్ రమణ.. ఈ పాట ఆడియో రికార్డ్ కోసం రూ. 5 వేలు నుంచి రూ. 10 వేలు ఖర్చు అయిందని, వీడియో సాంగ్ కోసం మొత్తం ఒక రూ. 5 లక్షలు ఖర్చు అయిందని.. ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కాగా ఈ ఒక్క పాట నాకు రూ. 40 లక్షల నుంచి రూ. 50 లక్షల డబ్బు తెచ్చిపెట్టిందని చెప్పుకొచ్చారు.
2022లోనే గుర్తింపు వచ్చింది!
నిజానికి 2018లో ఈ ఫీల్డ్‌లోకి వచ్చాను, కానీ 2022లోనే నాకంటూ ఒక గుర్తింపు వచ్చింది. అంతకు ముందు ఒక ఈవెంట్‌కు వెళ్తే రెండు వేలరూపాయల నుంచి ఐదు వేలరూపాయలు మిగిలేదు. ప్రారంభంలో ఒక పాట రికార్డ్ చేయాలంటే సుమారు రూ. 15 వేలు ఖర్చు అయ్యేది. ఈ డబ్బు కూడబెట్టాలంటే చాలా కష్టమయ్యేది. పల్సర్ బైక్ పాట కోసం సుమారు 20 వేలరూపాయలు కూడబెట్టాను. మొత్తం మీద పల్సర్ బైక్ పాత జీవితాన్నే మార్చేసిందని సింగర్ రమణ పేర్కొన్నారు.
రవితేజ సినిమాలో..
పల్సర్ బైక్ సాంగ్ వచ్చిన కొత్తలో.. ఎక్కడ చూసినా ఇదే పాట వినిపించేది. పెళ్లిళ్లు, పేరంటాలు.. ఇతర ఫంక్షన్లలో కూడా ఈ పాట తప్పకుండా ఉండేది. ఈ పాటతో ఫేమస్ అయిన వాళ్లలో కేవలం సింగర్ రమణ మాత్రమే కాకుండా.. కండెక్టర్ జాన్సీ కూడా ఉన్నారు. రమణ పాటపాడి పాపులర్ అయితే.. ఈమె (జాన్సీ) డ్యాన్స్ వేసి పాపులర్ అయింది. అప్పటినుంచి ఈమెను అందరూ పల్సర్ బైక్ జాన్సీ అని పిలుస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా రవితేజ ధమాకా సినిమాలో కూడా ఈ పాటను ఉపయోగించుకున్నారు. దీంతో ఈ పాటకు మరింత క్రేజ్ వచ్చేసింది.
ఫోక్ సాంగ్స్‌తో ఫేమస్ అయినవాళ్లు
ఇప్పుడు సినిమా పాటలకంటే కూడా ఫోక్ సాంగ్స్ వినేవాళ్ల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఈ కారణంగానే.. చాలా మంది ఫోక్ సాంగ్స్‌తో కూడా పాపులర్ అవుతున్నారు. ఇందులో రాము రాథోడ్, స్వర్ణ, కనకవ్వ, దుర్గవ్వ మొదలైనవారు కూడా ఉన్నారు. ఇప్పుడు చాలా సినిమాల్లో పాటలు పాడుతున్న మంగ్లీ (సత్యవతి రాథోడ్) కూడా ఒకప్పటి ఫోక్ సింగర్ కావడం గమనార్హం. కాగా ఇప్పుడు నెట్టింట్లో సంచలనం సృష్టించిన పాటలలో రాను బొంబాయికి రాను మాత్రమే కాకుండా.. సొలపురం పోయినను సోలదొడ్లు తెచ్చినాను, సారంగ దరియా, బుల్లెట్టు బడి, ఆడ నెమలి.. ఇలాంటివి చాలానే ఉన్నాయి. ప్రస్తుతం ఇవి కూడా మంచి ప్రజాదరణ పొందుతున్నాయి.