జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు: ఓటర్ లిస్టులో సమంత, తమన్నా, రకుల్ ఫోటోలు

తెలంగాణలోని (హైదరాబాద్) జూబిలీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల వేడి రోజురోజుకి పెరుగుతోంది. ఇలాంటి సమయంలో సెలబ్రిటీల పేరుతో ఫేక్ ఓటర్ ఐడీలు వెలుగులోకి రావడం సంచలనం రేపుతోంది. అందులోనూ ప్రముఖ నటీమణులు సమంత రూత్ ప్రభు, తమన్నా భాటియా, రకుల్ ప్రీత్ సింగ్ ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఓటర్ లిస్టులో నకిలీ ఐడీలు

ఓటర్ లిస్టులో సమంత, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్ ఫొటోలు.. వివరాలు వంటివి రావడంతో, ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. నకిలీ ఫోటోలను ఉపయోగించి వీటిని రూపొందించినట్లు.. ఎన్నికల అధికారులు నిర్దారించడంతో మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అసిస్టెంట్ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ సయ్యద్ యాహియా కమల్ ప్రకారం.. నటీమణుల చిరునామా హైదరాబాద్‌లోని ఒకే ప్రాంతానికి చెందినట్లు ఐడీలను క్రియేట్ చేసారని తెలుస్తోంది. అంతే కాకుండా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫోటోల ప్రకారం.. ముగ్గురి హీరోయిన్స్ హౌస్ నెంబర్ ఒకేవిధంగా ఉంది.

వివిధ సెక్షన్స్ కింద కేసు నమోదు

ప్రజలను తప్పుదారి పట్టించడానికి.. అధికారిక ఎన్నికల సమాచారాన్ని దుర్వినియోగం చేయడానికి, ఉద్దేశ్యపూర్వకంగానే ఇలాంటి నకిలీ ఐడీలు సృష్టిస్తున్నారని ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. దీంతో పోలీసులు ఈ సంఘటనపై.. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 336(4) (ఇతరుల ప్రతిష్టకు భంగం కలిగించే ఉద్దేశ్యం), 353 (1) (C) (దుష్ప్రవర్తన) కింద కేసు నమోదు చేశారు. దీనికి కారణమైనవారిని గుర్తించి పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమై ఉన్నారు.

జీహెచ్ఎంసీ హెచ్చరిక

ఇదిలా ఉండగా.. అధికారిక ధృవీకరణ లేని సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తే.. చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) హెచ్చరించింది. కొందరు తప్పుడు ప్రచారాలను వ్యాప్తి చేసి, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. అంతే కాకుండా చెల్లని నెంబర్లను ఉపయోగించి.. ప్రభుత్వాన్ని కించపరిచే ఉద్దేశ్యంతో ఇలాంటి నకిలీ ఐడీలు సృష్టిస్తున్నారని పేర్కొంది. అయితే దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు

2025 నవంబర్ 11న జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలు జరగనున్నాయి. అంతకంటే ముందే ఈ సంఘటన జరగడం ఒకింత అధికారులను కూడా ఆందోళనకు గురిచేసింది. ఎన్నికలు నిజాయితీగా జరగాలని చూస్తున్న తరుణంలో ఇలాంటి ఘటనలు వెలుగులోకి రావడం చాలా బాధాకరం. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జాగకుండా చూస్తామని సంబంధిత అధికారులు హామీ ఇచ్చారు. అంతే కాకుండా ఎన్నికల సంఘం ధృవీకరించిన సమాచారాన్ని మాత్రమే ప్రజలు విశ్వసించాలని కోరారు. కాగా ఎన్నికల ఓట్ల లెక్కింపు 2025 నవంబర్ 14న జరుగుతుంది.

సమస్యకు పరిష్కారం కనుగొనాలి

నిజానికి నకిలీ ఓటర్ ఐడీలు వెలుగులోకి రావడం అనే సమస్య.. ఒక్క హైదరాబాద్‌లో మాత్రమే కాకుండా భారతదేశం మొత్తం ఉంది. ఇప్పటికే బీహార్‌లో కూడా ఈ వివాదం తలెత్తింది. కాబట్టి ఎన్నికల కమిషన్ జారీచేసిన వాటిని మాత్రమే.. అధికారిక ఐడీలుగా గుర్తించాలి. అంతేకాకుండా ఇలాంటి ఫేక్ ఐడీలు వెలుగులోకి రాకుండా చూడటానికి ఎన్నికల కమిషన్ కూడా టెక్నాలజీని ఉపయోగించి సమస్యలను పరిష్కించి దిశగా ఆలోచించడం మంచిదని పలువురు అభిప్రాయపడుతున్నారు.