ఉపాసన సీమంతం వేడుక: సందడి చేసిన సెలబ్రిటీలు

చిరంజీవి తనయుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్.. మరోమారు తండ్రి కాబోతున్నారు. ఈయన భార్య ఉపాసన మళ్లీ గర్భం ధరించారు. సీమంతం వేడుక కూడా వైభవంగా జరిపారు. ఈ కార్యక్రమానికి.. మెగాస్టార్ బంధువులు, ఉపాసన బంధువులు అందరూ హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

డబుల్ సెలబ్రేషన్స్!

”ఈ దీపావళి డబుల్ సెలబ్రేషన్స్ తీసుకురావడంతో పాటు.. రెట్టింపు ప్రేమ, ఆశీర్వాదాలను తీసుకొచ్చింది” అని ఉపాసన కొణిదెల తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పేర్కొన్నారు. దీంతో సినీ తారలు, అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా ఉపాసన ఈసారి కవలలకు జన్మనివ్వనున్నట్లు సమాచారం.

2023లో మొదటి బిడ్డ

నటుడు రామ్ చరణ్.. ఉపాసన 2012లో పెళ్లి చేసుకున్నారు. కాగా ఈ దంపతులు 2023 జూన్ 20న హైదరాబాద్‌లో తమ మొదటి బిడ్డకు జన్మనిచ్చారు. ఈ బిడ్డ నామకరణం వేడుకలను ఘనంగా జరిపారు. ఆ సమయంలో పాపకు ‘క్లిన్ కారా కొణిదెల’ అని నామకరణం చేశారు. ఈ పేరును లలితా సహస్రనామం నుంచి తీసుకున్నట్లు ఆ సమయంలోనే వెల్లడించారు.

క్లిన్ కారా.. పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ చిన్న పాప ముఖాన్ని, తల్లిదండ్రులు & కుటుంబ సభ్యులు కూడా రివీల్ చేయలేదు. అయితే క్లిన్ కారా కోసం రామ్ చరణ్ దంపతులు ప్రత్యేక కేరింగ్ తీసుకుంటున్నట్లు సమాచారం. తనను నాన్న అని పిలిచినప్పుడే.. క్లిన్ కారా ముఖాన్ని చూపిస్తా అని ఒక కార్యక్రంలో కూడా వెల్లడించారు. అయితే ఇప్పటికే క్లిన్ కారాకు సంబంధించిన వీడియోలు చాలానే సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చినప్పటికీ.. ఎక్కడ పాప ముఖం కనిపించకుండా ఉపాసన దంపతులు జాగ్రత్త పడ్డారు.

కవలలకు జన్మనివ్వనున్న ఉపాసన

ఇప్పటికే క్లిన్ కారాకు జన్మనిచ్చిన.. ఉపాసన ఇప్పుడు రెండోసారి గర్భం దాల్చారు. అయితే ఇప్పుడు కవలలకు జన్మనివ్వనున్నట్లు సమాచారం. ఉపాసన కవలలకు జన్మనివ్వనున్నట్లు వార్త తెలియడంతో అటు మెగా అభిమానులలో సందడి నెలకొంది. బుల్లి స్టార్స్ రాబోతున్నట్లు కామెంట్స్ పెడుతున్నారు.

సీమంతం వేడుకకు ప్రముఖు

ఉపాసన సీమంతం వేడుకకు.. మెగాస్టార్ చిరంజీవి దంపతులు మాత్రమే కాకుండా, ఉపాసన తల్లిదండ్రులు, నాగబాబు దంపతులు, వరుణ్ తేజ్ దంపతులు, నిహారిక కొణిదెల మొదలైనవారు హాజరయ్యారు. వీరంతా ఉపాసన, రామ్ చరణ్ దంపతులకు శుభాకాంక్షలు చెప్పారు. అంతే కాకుండా.. ఉపాసనకు పండ్లు వంటివి గిఫ్ట్‌గా ఇచ్చారు. మొత్తం మీద అందరూ ఉపాసనను ఆశీర్వదించారు. ప్రత్యేకించి చిరంజీవి తల్లి.. ఆమెను దీవించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

రామ్ చరణ్ & ఉపాసన కొణిదెల గురించి

రామ్ చరణ్ గురించి అందరికి తెలుసు. అయితే ఉపాసన గురించి బహుశా కొంతమందికే తెలిసి ఉంటుంది. నిజానికి ఈమె అపోలో హాస్పిటల్ ఫౌండర్ సీ. ప్రతాప్ రెడ్డి మనువరాలు. ఈమె తల్లి శోభన కామినేని (అపోలో హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్ పర్సన్). లండన్ యూనివర్సిటీలో చదువుకున్న ఉపాసన.. అపోలో హాస్పిటల్స్‌లో కీలక బాధ్యతలు చేపడుతోంది. కాగా ఈమె త్వరలోనే కవలలకు జన్మనివ్వనుంది.