బైసన్ రివ్యూ: కిట్టయ్య ఎదుగుదలకు అడ్డొచ్చిన కులం.. మరి అధిగమించాడా..!?

తమిళ ఇండస్ట్రీలో ఈనెల అక్టోబర్ 17న థియేటర్లలో విడుదలై.. బాక్సాఫీస్ బద్దలు కొట్టి, ఇప్పటికీ ఏమాత్రం కలెక్షన్స్ తగ్గకుండా అదే ఊపుతో విజయవంతంగా దూసుకుపోతున్న బైసన్ సినిమా ఇవ్వాళ (అక్టోబర్ 24న) రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో రిలీజ్ అయింది. అందులోని నటినటులు మరియు సినిమాకు సంబంధించిన విశేషాలు ఎలా ఉన్నాయంటే..

నటినటులు: ధృవ్ విక్రమ్, అనుపమ పరమేశ్వరన్, పశుపతి, రజిష విజయన్, లాల్, అమీర్ సుల్తాన్ తదితరులు
దర్శకుడు: మారి సెల్వరాజ్
రచయిత: మారి సెల్వరాజ్
నిర్మాతలు: పా. రంజిత్, అధితి ఆనంద్, దీపక్ సెగల్, సమీర్ నాయిర్
సంగీతం: నివాస్ కే. ప్రసన్న
సినిమాటోగ్రాఫర్ : ఎయిల్ అరసు కే
ఎడిటర్: శక్తి తిరు
ఆర్ట్ డైరెక్టర్: కుమార్ గంగప్పన్
లిరిక్స్: మారి సెల్వరాజ్

కథ ఏంటంటే?

ఒక సాధారణ గ్రామీణ ప్రాంతానికి చెందిన ఒక స్కూల్ స్టూడెంట్ కిట్టయ్య (ధృవ్) అతనికి కబడ్డీ ఆట ఆడటం అంటే అమితమైన ప్రేమ, ఇష్టం. కానీ అక్కడ కోచ్ (అనురాగ్ అరోరా) అతన్ని కేవలం బెంచికి మాత్రమే పరిమితం చేస్తాడు. ఎన్నో ఒడిదుడుకులను, అడ్డంకులను దాటి ఇండియా తరపున జపాన్‌లో.. పాకిస్తాన్‌తో ఆడటానికి ఎంపిక అవుతాడు. అంతకు ముందు సెలక్షన్ కమిటీ రిజెక్ట్ చేసి కిట్టయ్యని ఇంటికి పంపుతుంది. తన తండ్రి(పశుపతి)కి కూడా.. తన కొడుకు కబడ్డీ ఆడటం ఏ మాత్రం ఇష్టం ఉండదు. కబడ్డీ ఆడకూడదు అని ఒట్టుకూడా వేయించుకుంటాడు. వాళ్ళ ఊరిలోనే ఉన్న ఒక అమ్మాయి (అనుపమ పరమేశ్వరన్) హీరోని ఇష్టపడుతుంది. తను కూడా ఆ అమ్మాయిని ప్రేమిస్తాడు కానీ వాళ్ళ నాన్నకు అస్సలు ఇష్టం ఉండదు. ఆ అమ్మాయికి ఇష్టం లేని పెళ్ళికి ఏర్పాట్లు చేస్తారు. హీరో అక్క (రజిష విజయన్) తమ్ముడికి ఎంతో సపోర్ట్‌గా ఉంటుంది. తనకి ఒక లవ్ స్టోరీ ఉంటుంది.

వీటన్నిటి మధ్యలో వీళ్ళ ఊరి వాళ్ళకి చెందిన పాండిరాజ్(అమీర్ సుల్తాన్)కి & వేరే ఊరికి చెందిన కందస్వామి(లాల్)కి ఎప్పుడు ఆధిపథ్య పోరు, దీనికోసం వారి మధ్య జరిగే గొడవలు కొట్లాటలు. ఎప్పుడు చూసినా కులం పేరుతో.. ఎక్కడ చూసిన హీరోకు అవమానం ఎదురవుతూనే ఉంటాయి. బెంచికి పరిమితమైన హీరో చివరికి పాకిస్తాన్‌తో ఫైనల్ మ్యాచ్ ఆడుతాడా? లేదా?.. ఆ మ్యాచ్‌లో గెలుస్తారా గెలవరా..? కొడుకు కబడ్డీ ఆడకూడదని ఒట్టు వేయించుకున్న తండ్రి చివరి వరకు అలాగే ఉంటాడా తన కొడుక్కి సపోర్ట్ చేస్తాడా..? చేయడా..? తను ప్రేమించిన అమ్మాయి తనకి దక్కుతుందా..? దక్కదా..? తన అక్క ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది..? లవ్ స్టోరీ లో ట్విస్ట్ ఏంటి..? కిట్టయ్యను సెలక్షన్ కమిటీ ఎందుకు రిజెక్ట్ చేసింది..? పాండిరాజ్, కందస్వామిల మధ్య గొడవలు కిట్టయ్య(హీరో)ను ఏ విధంగా ప్రభావితం చేశాయి..? వారి గొడవలు చివరికి ఆ ఊరిని ఏ స్థాయికి తీసుకెళ్తాయి..? కులపరమైనా అవమానాలను ఏ విధంగా భరించాడు..? బెంచ్ కి పరిమితం చేసిన కోచ్, కబడ్డీ వద్దన్నా తండ్రి, విఫలమైన ప్రేమ, ఊరిలో గొడవలు, కులపరంగా అవమానం వీటన్నిటి అధిగమించి కిట్టయ్య.. ఏ విధంగా కబడ్డీ ఆడగలిగాడు, తన ఊరికి, కుటుంబానికి ఎటువంటి పేరు తీసుకొచ్చాడు. తనకి “బైసన్”అని ఎవరు పేరు పెట్టారు. తన చుట్టూ జరిగే అన్ని పరిస్థితులను ఎదిరించి ఏ రకంగా పోరాడాడు అనేదే “బైసన్” కథ.

ఎవరెవరు ఎలా నటించారంటే?

ధృవ్ పూర్తిగా కబడ్డీ ప్లేయర్‌గా మారిపోయాడు. ఇందులో మనం మన స్నేహితున్నో.. పక్కింటి కుర్రాడినో చూసినట్టు పాత్రలో అట్టే ఒదిగిపోయాడు. తనకు ఇచ్చిన క్యారెక్టర్‌కు వందశాతం న్యాయం చేశాడు. కబడ్డీ ఆటగాడిగా, కొడుకుగా, ప్రేమికుడిగా, తమ్ముడిగా, ఒక పల్లెటూరు కుర్రాడిగా అన్ని రకాలుగా మనల్ని అందరినీ కూడా బాగా ఆకట్టుకుంటాడు.

అనుపమ పరమేశ్వరన్ గత సినిమాలన్నిటికంటే ఈ సినిమాలో చాలా సహజంగా నటించింది. ఆమె నటన ప్రేక్షకుల కళ్ళు తిప్పుకొనీకుండా చేసింది. ఒక ప్రేయసిగా అద్భుతంగా చేసింది. తండ్రిగా పశుపతి అల్టిమేట్ యాక్టింగ్ చేశాడు. ప్రతి సీనుకు అదరగోట్టేసాడనే చెప్పొచ్చు. అతన్ని చూస్తే అతని స్థానంలో.. మన నాన్న మనల్ని ప్రోత్సహించినట్టే ఉంటుంది. తండ్రి అంటే ఇలానే ఉండాలి రా అని అనిపిస్తుంది. పశుపతి ఒక్కరే ఆ పాత్ర చేయగలరు. ఇంక లాల్, అమీర్ ఇద్దరు ఇద్దరే.. యాక్టింగ్ విషయంలో ఎవరికి ఎవరు కూడా తీసిపోరు. అక్కగా రజిష విజయన్ బాగా సరిపోయింది. ఆమె తప్పా ఇంకెవరు ఆ పాత్ర చేసిన అంత బాగుండేది కాదేమో అనిపిస్తుంది. ఈ విధంగా ప్రతి పాత్ర కూడా వారి వారి స్థాయికి తగినట్టు వారు జీవించారు అని చెప్పొచ్చు.

అక్కడక్కడా కొంచం స్లో అయినట్టు అనిపించినా.. ఎక్కడా కూడా సినిమా మనల్ని బోర్ కొట్టించదు. ఇది ఓటీటీలోకి వచ్చినాక చూద్దాం అనుకునే సినిమా కాదు, పక్కా థియేటర్లకు వెళ్లి చూడాల్సిన సినిమా.

మరో మెట్టు ఎక్కిన డైరెక్టర్

దర్శకుడు మారి సెల్వరాజ్ ప్రతి పాత్రను చాలా వాస్తవంగా తీర్చిదిద్దారు. తను చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా సుత్తిలేకుండా చెప్పగలిగారు. డైరెక్టర్ రాసుకున్న ప్రతి పాత్రని ఎంతమేరకు వాడుకోవాలో అంత బాగా వాడుకున్నారు. గత సినిమాలకు.. దీనికి చాలా వ్యాత్యాసం కనిపిస్తుంది. ఈ సినిమాతో డైరెక్టర్ మరో మెట్టు పైకి ఎక్కాడు అని చెప్పొచ్చు. దర్శకుడిగా తన విజయ పరంపరని కొనసాగించారు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు అతి పెద్ద ప్లస్ పాయింట్. సినిమా చూస్తున్నంతసేపు మనల్ని మ్యూజిక్ అలాగే కట్టిపడేస్తుంది. ఏ సీనుకు ఎంత సంగీతం అందివ్వాలో ఎలాంటి మ్యూజిక్ ఇవ్వాలో అలాగే ఇచ్చాడు. ప్రేక్షకులను నివాస్ కే ప్రసన్న తన సంగీతంతో మంత్రముగ్దల్ని చేసేశాడు.

పల్లెటూరి మనుషుల్లా..

పాటలు కూడా అద్భుతంగా ఉన్నాయి. తెలుగు నేటివిటీ అలాగే ఉట్టిపడిందని చెప్పొచ్చు. ప్రతి పాట ఒక ఆణిముత్యం. సినిమాని ముందుకు తీసుకెళ్లడంలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. పాటలు ఎంతగానో తోడ్పాటుని అందించాయి. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే చాలా బాగా తీశారు. ప్రతి ఒక్క ప్రేమ్ మనల్ని మన వాస్తవ జీవితంలోనికి తీసుకెలుతుంది అంత అద్భుతమైన కెమెరా వర్కింగ్ జరిగింది. చూడటానికి చాలా కొత్తగా ఉంది. ఆర్ట్ డైరెక్షన్, కాస్ట్యూమ్ డిజైనింగ్ మన పల్లెటూరు ఇదే అన్నట్టుగా వారంతా మన ఊరి మనుషులే అన్నంత గొప్పగా తీర్చిదిద్దారు.

ఇది 1990లకు సంబంధించిన కొన్ని వాస్తవ సంఘటనలు ఆధారంగా తీసిన చిత్రం. ముఖ్యంగా తమిళనాడుకు చెందిన అర్జున అవార్డు గ్రహీత మనతి గణేశన్ అనే కబడ్డీ ఆటగాడి ఆట మరియు ఆయన నిజ జీవితంలో చుట్టూ జరిగిన పరిస్థితులను సినిమాగా తీశారు.