రోల్స్ రాయిస్ ధరలు ఎందుకు ఎక్కువ?: ఆశ్చర్యపరిచే విషయాలు!

గ్లోబల్ మార్కెట్లో ఎన్నెన్ని కార్ల తయారీ సంస్థలు ఉన్నా.. రోల్స్ రాయికి కంపెనీకి ఉన్న ప్రత్యేకత వేరు. దీనికి ప్రధాన కారణం కేవలం ఘనమైన చరిత్ర మాత్రమే కాదు. బ్రాండ్ ఖ్యాతి, అద్భుతమైన లగ్జరీ, పర్ఫామెన్స్, డిజైన్, ఫీచర్స్ వంటివన్నీ పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. ధర ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఏ మాత్రం కాంప్రమైజ్ ఉండదు. ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ బ్రాండ్స్.. అమ్మకాల కోసం తమ ప్రత్యేకతను కోల్పోతున్నప్పటికీ.. రోల్స్ రాయిస్ మాత్రం తన ప్రత్యేకతను కొనసాగిస్తూనే ఉంది.

మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యు, ఆడి, పోర్స్చే, వోల్వో వంటి కంపెనీలు.. ఎప్పటికప్పుడు మార్కెట్లకు అనుగుణంగా, కస్టమర్లను ఆకట్టుకోవడానికి మారుతూనే ఉన్నాయి. కానీ 1906లో ప్రారంభమైన రోల్స్ రాయిస్ మాత్రం తన ఉనికిని.. ప్రత్యేకతను అలాగే నిలుపుకుంది. ఈ కంపెనీ కార్ల ధరలు కొంత ఎక్కువగా ఉండటానికి కొన్ని ప్రధాన కారణాలు కూడా ఉన్నాయి.

నిర్మాణం లేదా డిజైన్

రోల్స్ రాయిస్ అంటేనే.. ఎవరికైనా గుర్తొచ్చేది, దాని ప్రత్యేకమైన డిజైన్. ఇది ప్రత్యేకించి కస్టమర్లను ఆకట్టుకునేలా ఉంటుంది. కాగా ధరలు ఎక్కువగా ఉండడానికి మరో కారణం.. ఉత్పత్తి కూడా పరిమిత సంఖ్యలో ఉండటమే. ఒక రోల్స్ రాయిస్ కారు.. పూర్తిగా తయారవ్వడానికి కనీసం ఆరు నెలల సమయం.. వందలాది పనిగంటలు అవసరం అవుతుంది. వీటిని కొనుగోలు చేసేవారు కూడా తప్పకుండా సంపన్నులై ఉంటారు. ఎందుకంటే.. రోల్స్ రాయిస్ కారు కొనాలంటే కోట్ల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది.

ఇతర లగ్జరీ కార్ల తయారీ సంస్థలు.. ఒక కారును తయారు చేయడానికి మిషన్స్ ఉపయోగిస్తుంటారు. కానీ రోల్స్ రాయిస్ విషయంలో ఇది పూర్తిగా వేరుగా ఉంటుంది. ఇందులో లెదర్ అపోల్స్ట్రేపై కనిపించే కుట్టు దగ్గర నుంచి.. పాలిష్ చేసిన వుడ్ ట్రిమ్ వరకు కూడా అత్యంత నైపుణ్యం కలిగిన కళాకారులే చేతితో డిజైన్ చేస్తారు. ఇది రోల్స్ కంపెనీ మాత్రమే దక్కించుకున్న ప్రత్యేకత. ఈ కార్లలో కనిపించే 1600 ఫైబర్ ఆప్టిక్ లైట్లను కూడా చేతితోనే నేయడం జరుగుతుంది.

పెయింట్ స్కీమ్స్

ఇక రోల్స్ రాయిస్ అంటేనే గుర్తొచ్చేది.. దాని పెయింట్ స్కీమ్. కంపెనీ సుమారు 44000 కంటే ఎక్కువ పెయింట్ ఎంపికలతో తమ కస్టమర్లను కార్లను డిజైన్ చేస్తుంది. అంటే అన్ని రంగులలో రోల్స్ రాయిస్ కార్లు అందుబాటులో ఉంటాయన్నమాట. అయితే ఎంచుకునే రంగును బట్టి కూడా ధర ఉంటుందనే విషయాన్ని కూడా కస్టమర్లు తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఒక కారుకు పెయింట్ వేయడానికి 10 వారాల సమయం అవసరం అవుతుంది. సుమారు 22 దశల్లో పెయింటింగ్ ప్రక్రియ జరుగుతుందని సమాచారం. దీని కోసం ప్రత్యేకమైన పరికరాలను ఉపయోగిస్తారు.

వేగం కాదు.. లగ్జరీపై దృష్టి

రోల్స్ రాయిస్ కంపెనీ తన కార్లను అద్భుతమైన సౌందర్యంతో మాత్రమే కాకుండా.. టెక్నాలజీతో కూడా అందిస్తుంది. అయితే సంస్థ ఇతర లగ్జరీ కార్ల మాదిరిగా వేగంపై దృష్టి సారించదు. విలాసవంతంగా ఉండేలా కారును తీర్చిదిద్దుతారు. అంటే దీనిని ఉపయోగించే వ్యక్తి విలాసవంతమైన రైడింగ్ అనుభూతిని పొందుతాడు. ఈ బ్రాండ్ కార్లలో.. సౌండ్ ఫ్రూఫింగ్, డబుల్ గ్లేజ్డ్ విండోలు ఉంటాయి. కాబట్టి క్యాబిన్ చాలా నిశ్శబ్దంగా ఉంటుంది.

ప్రతిష్ఠత ముఖ్యం!

రోల్స్ రాయిస్ ఒక స్టేటస్. అంటే వినియోగించే వ్యక్తి హోదా, ప్రతిష్టతను తెలియజేస్తుంది. ఈ బ్రాండ్ కార్లను ఉపయోగించే వ్యక్తి మెయినెంట్స్ గురించి ఆలోచించే ప్రసక్తి ఉండదు. ఇక్కడ ధర కూడా బ్రాండ్ గుర్తింపును చూచిస్తుంది. మొత్తం మీద కంపెనీ.. తన కస్టమర్లకు లగ్జరీ అందించడమే ప్రధాన ఉద్దేశ్యంగా నడుచుకుంటుంది. దీనికి తగిన విధంగానే కార్లను ఉత్పత్తి చేస్తుంది.