శ్రీలీలతో.. రవితేజ మాస్ జాతర: హిట్ పడాల్సిందేనా?

మాస్ మహారాజ.. హీరో రవితేజ & హీరోయిన్ శ్రీలీల జంటగా నటించిన సినిమా మాస్ జాతర.. మనదే ఇదంతా అనే ట్యాగ్‌లైన్‌తో ఈ నెల చివర థియేటర్లలో బ్రహ్మాండంగా విడుదల కానుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్ & ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై.. నిర్మాతలు ఎస్ నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. భీమ్స్ సేసిరోలియో మూవీకి సంగీతం అందిస్తుండగా.. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

హిట్ పడాల్సిందే!

రవితేజను వరుసగా ప్లాప్స్ వెంటాడుతున్న వేళ.. ఇప్పుడు ఈయనకు ఒక హిట్ మూవీ పడాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం రవితేజ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 2020 నుంచి క్రాక్, ధమాకా.. ఆ తరువాత చిరంజీవితో కలిసి నటించిన వాళ్తేరు వీరయ్య లాంటి ఏదో ఒకటి రెండు విజయాలు తప్పా చెప్పుకోదగ్గ సినిమాలు రాలేదు. టైగర్ నాగేశ్వరావు, ఈగల్, ఖిలాడి, డిస్కో రాజా, రామారావు ఆన్ డ్యూటీ ఇటువంటి సినిమాలు అన్నీ కూడా రవితేజను నిరాశపరిచాయి.

గత ఐదారు సంవత్సరాల నుంచి రవితేజ ఎంచుకుంటున్న సినిమాల.. కథలన్నీ కూడా ఒకే విధమైన నటనా శైలి మరియు యాక్షన్ సీన్స్, డైలాగ్ మాడ్యూలేషన్ అన్నీ కూడా ఒకేలా ఉండటం, అన్నీ కమర్షియల్ రొటీన్ ఎంటర్‌టైన్‌మెంట్ మాదిరిగా అనిపిస్తుండటం, కథలో పెద్దగా బలం లేకపోవడంతో పాటు కేవలం ఏదో కావాలనే కామెడీ, యాక్షన్, సాంగ్స్ అన్నీ కూడా బలవంతంగా చొప్పించినట్టు అనిపించేలాగా ఉండటం వల్ల పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేదు.

రిలీజ్ ఎప్పుడంటే?

చాన్నాళ్లుగా పెద్ద హిట్ రవితేజ ఖాతాలో పడలేదు. ఇప్పుడు రవితేజకి ఇండస్ట్రీలో ఒక బిగ్ హిట్ తప్పకుండా కావాల్సి ఉంది. ఇందులో భాగంగా మళ్ళీ ఒక్కసారి ధమాకా హిట్ కాంబినేషన్ శ్రీలీలతో కలిసి ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలతో ఉన్నారు. పలుమార్లు రిలీజ్ తేదీలు వాయిదాలు పడుతూ వచ్చాయి. అయితే మొత్తంగా సినిమాను అక్టోబర్ 31న విడుదల చేయడానికి పెద్ద ఎత్తున సన్నాహాలు జరిగాయి. కాగా ఈ రోజు (అక్టోబర్ 27) రిలీజ్ అయినా ట్రైలర్ కూడా రిలీజ్ డేట్ అక్టోబర్ 31 అని ఫిక్స్ చేసింది. దీంతో రవితేజ అభిమానులు రాబోయే సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

ఇప్పటి వరకు రిలీజ్ అయిన పాటలు, ట్రైలర్, పోస్టర్స్ అన్నీ కూడా సినిమాకి మంచి స్పందన తీసుకొచ్చాయి. మాస్, యాక్షన్, కామెడీ, లవ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వనున్నట్టు అర్థమవుతోంది. ఈ చిత్రంలో రవితేజ పోలీస్ గెటప్‌లో కనిపిస్తున్నాడు. ఇది వరకే చాలా సినిమాల్లో రవితేజ పోలీస్ డ్రెస్ వేసుకుని కనిపించాడు. అందులో కొన్ని బిగ్ సక్సెస్ అయ్యాయి. కొన్ని ప్లాప్ అయ్యాయి. మరి ఇది ఎలా ఉండనుందో చూడాలి.

ప్రీ-రిలీజ్ ఈవెంట్ కోసం సూర్య

“మాస్ జాతర మూవీ టీమ్.. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ కోసం తమిళ యాక్టర్ సూర్యను ఆహ్వానించారు. అక్టోబర్ 28న హైదరాబాద్, జేఆర్‌సీ కన్వెన్షన్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. సాయంత్రం 5:30 గంటలకు ఈ కార్యక్రమం మొదలవుతుంది. సూర్య మరియు రవితేజ ఇద్దరిని ఒకే వేదిక మీద చూడటం అనేది.. నిజంగా ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆనందించే అంశంగా చెప్పుకోవాలి. మిగిలిన తారగనం అంతా కూడా వేడుకలో పాల్గొని సందడి చేయనున్నారు. రవితేజ కెరియర్‌లో మాస్ జాతర బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలవాలని కోరుకుందాం. రవితేజ మాస్ జాతరతో విజయం సాధిస్తాడా.. లేదా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.