కార్తీక ఎక్స్‌ప్రెస్.. ఇది ఏ ట్రైన్ పేరు అనుకుంటే మీరు పొరబడినట్టే!. ఆటలో కార్తీక వేగానికి, బలానికి, ఆట తీరుకి పెట్టిన పేరే ఈ కార్తీక ఎక్స్‌ప్రెస్. యావత్ భారతదేశం అంతటా ఇప్పుడు ఈ నేషనల్ కబడ్డీ ప్లేయర్ ఆర్. కార్తీక పేరే వినబడుతున్నది. ముఖ్యంగా తమిళనాడులో మారుమోగుతోంది. రాజకీయంగా (అధికార, ప్రతిపక్ష వర్గాలు) సామాజికంగా, క్రీడా పరంగా, చలన చిత్ర ఇలా అన్నీ రంగాల నుంచి కార్తీక ఎనలేని ప్రశంసలు అందుకుంటోంది. కబడ్డీ అందరూ ఆడుతారు కానీ కొంతమంది మాత్రమే అందులో తమ ప్రత్యేకతను చాటుకుంటారు. ఇది అతి కొద్దిమందికి మాత్రమే సాధ్యమయ్యే విషయం. ఇంతకీ ఈమె ఎవరు.? ఎక్కడ నుండి వచ్చింది..? ఎందుకు కోసం కబడ్డీ ఆడుతోంది..? ఇవన్నీ తెలుసుకుంటే కార్తీక ఎందుకు అంత స్పెషల్ అనేది తెలుస్తుంది.
కబడ్డీలో గోల్డ్ మెడల్
ఆర్. కార్తీక ప్రస్తుతం భారత జాతీయ కబడ్డీ జట్టులో ఆడుతున్నారు. అంతే కాకుండా అండర్-18 కబడ్డీ మహిళల జట్టుకు ఆమె వైస్ కెప్టెన్ కూడా. ఇండియా వర్సెస్ ఇరాన్ అంతర్జాతీయ కబడ్డీ ఫైనల్లో బహ్రెయిన్‌లో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించారు. 75-21తో ఓడించడం విశేషం. ఇందుకుగాను ఆమె బంగారు పతకం సాధించింది. ఈ విజయం ఒక్క తమిళనాడుకే కాదు.. ఇది ఇండియన్ హిస్టరీలోనే ఒక అద్భుతమైన గట్టం. ఆసియా యూత్ గేమ్స్ 2025 పేరుతో ఈ కబడ్డీ ఈవెంట్స్ జరిగాయి.
కార్తీక తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో ఉన్న కన్నగి నగర్ అనే ప్రాంతానికి చెందినవారు. తల్లి శరణ్య ఆటో రిక్షా వర్క్ చేస్తుంది. ఆమెకు వచ్చే డబ్బులతోనే కబడ్డీకి సంబంధించిన ఖర్చులన్ని బరిస్తూ వచ్చింది. ఈమెకి ఒక చెల్లి కూడా ఉంది. ఆమె కూడా కబడ్డీ ఆడుతుంది. నాన్న కన్స్ట్రక్షన్ కూలీ పనులకు వెళ్తారు. కార్తీక చెన్నై కార్పొరేషన్ స్కూల్లో పన్నెండో తరగతి చదువుతోంది.
ఘన స్వాగతం పలికిన తమిళనాడు
అంతర్జాతీయ కబడ్డీ ఫైనల్ గెలిచిన తరువాత తమిళనాడులో ఆమెకి ఘనస్వాగతం లభించింది. పూల మాలలతో స్వాగతం పలుకుతూ.. టపాసాలు పెల్చుతూ, దారిపొడుగునా పూలు చల్లుతూ ఇండియన్ కబడ్డీ క్వీన్‌కు స్వాగతం పలికారు. తరువాత తమిళనాడు సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయానిధి స్టాలిన్, ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళని స్వామి, సినిమా డైరెక్టర్ పా. రంజిత్ తదితరులు ఆమెను ప్రశంసించారు.
కార్తీక పదకొండు సార్లు జాతీయ స్థాయిలో తమిళనాడు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. అనేక చోట్ల మెడల్స్, ఖేలో ఇండియా మెడల్స్, జూనియర్ నేషనల్ 2024లో సిల్వర్ కూడా గెలిచింది. 2025లో జాతీయ కబడ్డీకి సెలెక్ట్ అయింది. జూనియర్స్ స్థాయిలో మంచి పేరు తెచ్చుకునింది.
గర్వాంగా చెప్పుకుంటున్నా.. నాది కన్నగి నగర్
కన్నగి నగర్ అనే ప్రాంతం ఒక స్లమ్ ఏరియా.. అందులోనూ ఆ ప్రాంతాన్ని అందరూ పేదరికం, గ్యాంగ్ వార్స్ ఎక్కువ ఉండే ప్రాంతంగా చూసేవారని చెబుతారు. ఇక్కడ అతి పెద్ద స్లమ్ ప్రాజెక్టును కూడా చెప్పట్టినట్టు సమాచారం. చాలామంది ఈ ప్రాంతంలో నివసించేవారు కూడా.. కన్నగి నగర్ పేరు చెప్పుకునేవారు కాదు. కానీ కార్తిక సాధించిన విజయం.. ఈ ప్రాంతవాసులకు గౌరవాన్ని తెచ్చిపెట్టింది. అంతే కాకుండా.. ఇప్పుడు నేను కన్నగి నగర్ అమ్మాయి అని గర్వంగా చెప్పుకుంటాను అంటూ కార్తీక సంతోషం వెలబుచ్చింది. ఆ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆమె ఎంతో తపనపడుతోంది. ఇప్పుడిప్పుడే కార్తీక వల్ల మార్పు వస్తోంది.