మాస్ మహారాజ రవితేజ, శ్రీలీల జంటగా నటిస్తున్న సినిమా మాస్ జాతర.. ఈ నెల 31న థియేటర్లలో ప్రేక్షకుల ముందకు వస్తోంది. ఈ సందర్బంగా సితార ఎంటర్టైన్మెంట్ & ఫార్చున్ ఫోర్ సినిమాస్ సంస్థల ప్రొడ్యూసర్స్ హైదరాబాద్‌లో ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ చిత్రంలో నటించిన సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్.. ఈ ఫంక్షన్‌లో సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు.. హీరో రవితేజకు సంబంధించిన అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు.
సినిమా చూసి షాకవ్వకపోతే..
రాజేంద్ర ప్రసాద్ మైక్ పట్టుకోగానే ప్రేక్షకులు, అభిమానులు ఈలలు, కేరింతలతో కాసేపు ఆయనను మాట్లాడనివ్వలేదు. ఇదే జోష్ మనకు కావాలని ఆయన కూడా విజిల్ వేసి ఫుల్ ఖుషి అయ్యారు. లేడీస్ టైలర్ సినిమా నుంచి ఈ సాండ్ నేర్పింది నేనే అంటూ చెప్పాడు. ఈ మధ్య కాలంలో అన్ని మసాలాలు కలిపిన సినిమా రాలేదని తన అభిప్రాయం తెలిపారు.
నా జీవితంలో.. నేను ఎప్పుడు ఇలాంటి పాత్ర చేయలేదని, ఇది కచ్చితంగా మిమ్మల్ని అందరినీ అలరిస్తుందని అన్నారు. ఈ సినిమాలో కామెడీ, సెంటిమెంట్, యాక్షన్ అన్నీ కూడా పుష్కలంగా ఉన్నాయి. నా గుండెల మీద చెయ్యేసి చెబుతున్నా ఈ సినిమా చూస్తే మనల్ని తప్పకుండా అభినందిస్తారు అని రాజేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. ఈ సినిమా చూసి మీరు షాక్ అవ్వకపోతే నేను సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతాను అని ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు.
ఫస్ట్ టైమ్ నాకు కిక్ ఇచ్చారు!
జులాయి సినిమా దగ్గర నుంచి నాన్నకి ప్రేమతో వరకు వరుసగా హిట్ సినిమాలు తీస్తూ వస్తున్నాను. కానీ రవి ఏమైపోయాడు అంటూ ఒక ఆశ్చర్యం కలిగించే మాట అన్నాడు. అయితే వెయిట్ చేసి చేసి ఈ సినిమాతో మంచి ‘మాస్ జాతర’ చూపించబోతున్నాడు. రవి నాకోసం కొన్ని సీన్లు రచయిత, దర్శకులతో ప్రత్యేకంగా రాయించి మరి షూట్ చేయించాడని పొగిడారు.మాస్ మహారాజ్ కిక్ మామూలే.. కాకపొతే ఫస్ట్ టైమ్ నాకు మాస్ కిక్ ఇచ్చారు అంటూ ప్రేక్షకులతో పంచుకున్నారు.
సూర్య గురించి.. రాజేంద్ర ప్రసాద్
ఈ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా తమిళ యాక్టర్ హీరో సూర్య హాజరయ్యారు. ఆయన గురించి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. సూర్య పేరు చెప్పగానే ఫ్యాన్స్ ఈలలు వేసి గోల చేశారు.. దాంతో ఇదే మన సంస్కారం అని అంటూ సూర్య అడాప్టెడ్ తెలుగు నటుడు అయ్యారని పొగుడుతూ.. నువ్వు అంటే నాకు ఎంతో ప్రేమని అన్నారు. సూర్య ఎంతో మంచి యాక్టర్ అని దాంతో పాటు మంచి మానవత్వం ఉన్న మనిషి, ఆయన చాలా మంది పిల్లల్ని చదివిస్తున్నారని కొనియాడారు. అందుకుగాను సూర్య లేచి నిలబడి మరి రాజేంద్ర ప్రసాద్‌కు నమస్కారం చేశారు. నేను కూడా ఒక యాక్టర్.. నా సినిమాలు ఏదైనా చూసారా అని సరదాగా రాజేంద్ర ప్రసాద్ అడిగారు.
నేను ఇంకా మీ ముందు ఇలా బతుకుతున్నాను అంటే కారణం భాను లాంటి దర్శకులు, రచయితలు అన్నారు. వాళ్ళు నాకు రాసే క్యారెక్టర్స్ వల్ల నేను ఇప్పటికి ఉన్నానని చెప్పుకొచ్చారు. యాక్టర్స్ నవీన్, శ్రీలీలకు.. చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెబుతూ ఈ సినిమాని అందరూ థియేటర్లలోనే చూడాలని ప్రేక్షకులకి చెబుతూ సక్సెస్ మీట్‌లో మళ్ళీ కలుసుకుందామని రాజేంద్ర ప్రసాద్ ఫుల్ మాస్ జాతర స్పీచ్ ఇచ్చారు.