మారి సెల్వరాజ్ దర్శకత్వంలో పా. రంజిత్ నిర్మించిన బైసన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం తమిళనాడులో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఆ కార్యక్రమంలో పా. రంజిత్ మాట్లాడుతూ.. చాలా ఎమోషనల్ అయ్యాడు. తమిళ ప్రేక్షకులు, దర్శకులు, రిపోర్టర్స్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్, ట్రోలర్స్, నెటిజన్స్ ఇలా అందిరిపైనా ఆయన తీవ్రంగా ఆవేదనతో స్పందించారు. అసలు ఎందుకు ఇలా మాట్లాడాల్సివచ్చిందంటే..
మేము కారణం అనడం సరికాదు!
తమిళ సినిమా ఇండస్ట్రీని నాశనం చేశామని, కోట్ల రూపాయలు సంపాందించే స్థాయి చిత్రాలు తమిళంలో రావడం లేదని తెలుగు, కన్నడ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా వేలకోట్ల రూపాయలు సాధించేటటువంటి రూటెడ్ సినిమాలు తీస్తున్నారని అవి బిగ్ సక్సెస్ అవుతున్నాయని (డబ్బులు పరంగా) తమిళంలో మాత్రం అటువంటి సినిమాలు రావడం లేదని అందుకు కారణం మేమే అంటూ కొంతమంది అదేపనిగా మాట్లాడటం సరికాదని ఆయన అన్నారు.
ఈ సందర్బంగా కాంతారా సినిమాను ఉదహరిస్తూ.. కాంతారా లాంటి సినిమాలు సక్సెస్ అయినప్పుడు కేవలం నన్ను, వెట్రిమారన్, మారి సెల్వరాజ్ మా ముగ్గురినే టార్గెట్ చేస్తూ కొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని మండిపడ్డారు. మేము తీసే కులం ఆధారిత, అణచివేతకి సంబందించిన సినిమాల వల్లే తమిళ ఇండస్ట్రీ చెడిపోయింది అనడం సరికాదన్నారు.
రెండేళ్లలో వందల సినిమాలు
ఇప్పటి వరకు నేను కేవలం ఏడు సినిమాలు మాత్రమే చేశాను, మారి సెల్వరాజ్ ఐదు సినిమాలు తీశాడు, వెట్రి మారన్ కూడా మా మాదిరిగానే తీశారు. ఇంకా చెప్పాలంటే నేను రెండు సంవత్సరాలకు ఒక సినిమా తీస్తా, వెట్రిమారన్ మూడు ఏళ్లకు ఒక సినిమా తీస్తారు. మరి తమిళ చలనచిత్ర పరిశ్రమలో ఒక సంవత్సరానికి దాదాపు 200 నుంచి 300 సినిమాలు విడుదల అవుతాయి, రెండు ఏళ్ళల్లో 600 సినిమాలు ఇండస్ట్రీ నుంచి వచ్చాయి. అయితే తమిళ ప్రేక్షకులు ఎందుకు మిగిలిన ఆ సినిమాలన్నింటిని సక్సెస్ చేయలేకపోయారని, ఎవరు కూడా తమిళ సినిమా స్థాయిని పెంచలేకపోయారు ఎందుకని ఆయన ఈ సంధర్బంగా ప్రశ్నించారు.
కాలా మూవీ విడుదలకు ముందే వందకోట్ల రూపాయలు కలెక్షన్స్ రాబట్టిందని.. కొంతమంది అదే పనికట్టుకొని ప్రేక్షకులు సినిమా చూడకముందే వాళ్లలో మా సినిమాలపట్ల ఒక చెడు అభిప్రాయాన్ని కలిగిస్తున్నారని ఆవేదన చెందారు. ప్రేకక్షకులు ఎప్పుడూ ప్రేమతో సినిమా చూస్తారని దాన్ని చెడగొట్టొద్దని పా. రంజిత్ అన్నారు.
నెటిజన్ల మద్దతు
పా. రంజిత్ మాట్లాడిన వ్యాఖ్యలకు అభిమానులు, ప్రేక్షకుల నుంచి భారీ ఎత్తున మద్దతు లభిస్తోంది. ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం ఉందని, సంవత్సరానికి కొన్ని వందల సినిమాలు కేవలం వినోదం కోసం మాత్రమే రిలీజ్ అవుతున్నాయి. పా. రంజిత్, మారి సెల్వరాజ్, వెట్రి మారన్ వీళ్ళు తీసే సామాజిక వ్యవస్థను ఆలోచింపజేసే మంచి కంటెంట్ ఉన్న సినిమాలు ఒకటి రెండు సినిమాలు మాత్రమే రిలీజ్ అవుతున్నాయని.. వాటి వల్లే తమిళ సినిమా చెడిపోతుంది అనడం హాస్యాస్పదం అని అభిమానులు అంటున్నారు.
సినిమాలో ఉన్న సామాజిక అంశాన్ని అర్థం చేసుకోవాలని దాన్ని కుల ఆధారితంగా చూడకూడదని పా. రంజిత్ హితవు పలికాడు. ఇక్కడ ఇంకో విషయం గమనించాలి. పా. రంజిత్ సినిమాల ఇండస్ట్రీకి వచ్చి కేవలం ఒక పది.. పదిహేనేళ్ళు అవుతుంది అంతే. మరి అంతకు ముందు ఆ తరువాత మిగిలిన డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, యాక్టర్స్, ప్రేక్షకులు ఏమి చేసినట్టు అనే ప్రశ్న ఇక్కడ కొంతమంది లేవనేత్తుతున్నారు.