దశాబ్దాల క్రితం భారతదేశంలో.. సంచలనం సృష్టించిన హిందుస్తాన్ అంబాసిడర్ గురించి చాలామంది వినే ఉంటారు. అప్పట్లో అంబాసిడర్ కారుకు విపరీతమైన క్రేజ్ ఉండేది. అయితే కాలక్రమంలో దీనికున్న ఆదరణ క్రమంగా తగ్గిపోవడంతో.. కంపెనీ దీని ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేసింది. అయినప్పటికీ.. ఇప్పటికి కూడా ఈ కార్లు రోడ్డుపై కనిపిస్తూనే ఉంటాయి. కొంతమంది ఈ కారును మధురమైన జ్ఞాపకంగా గుర్తుంచుకుంటారు. అలా జ్ఞాపకంగా ఉంచుకున్న వారి జాబితాలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఉన్నారు.
చంద్రబాబు ట్వీట్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి.. నారా చంద్రబాబు నాయుడు సుమారు 30 ఏళ్ల క్రితం అంబాసిడర్ కారును ఉపయోగించారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా పనిచేసిన రోజుల్లో.. ఈ కారులోనే పర్యటనలు సాగించేవారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ప్రభుత్వం ఇప్పుడు కార్లను మార్చేసింది. ప్రస్తుతం ఆయన.. తనకు కేటాయించిన కార్లలోనే ప్రయాణిస్తున్నారు. కానీ.. తాజాగా తన పాత అంబాసిడర్ కారుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ.. విత్ మై ఓల్డ్ ఫ్రెండ్ అని ట్వీట్ చేశారు.
సీఎం చంద్రబాబు షేర్ చేసిన ఫోటోలలో.. తెలుపు రంగు అంబాసిడర్ కారును చూడవచ్చు. మొన్నటి వరకు హైదరాబాద్‌లో ఉన్న ఈ కారును మంగళగిరికి తీసుకొచ్చారు. అంతే కాకుండా ఈ కారులోనే చంద్రబాబు.. టీడీపీ కార్యాలయం చుట్టూ తిరిగారు. దీన్ని బట్టి చూస్తే.. తన పాత అంబాసిడర్ కారుపై ఆయనకు ఎంత మమకారం ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఫొటోలో కనిపించే కారు బాగా పాతదైనట్లు స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి కారణం బహుశా దీనిని చాలా రోజులుగా ఉపయోగించలేదని స్పష్టమవుతోంది.
అంబాసిడర్ కారును కలిగిన ప్రముఖులు
కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే కాకుండా.. చాలామంది రాజకీయ నాయకులు, సినిమా ప్రముఖులు కూడా హిందూస్తాన్ అంబాసిడర్ కారును కలిగి ఉన్నారు. ఇందులో రజినీ కాంత్, మోహన్ లాల్, రాజ్ కపూర్ మొదలైనవారు ఉన్నారు. ఒకప్పుడు జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, అటల్ బిహారీ వాజపేయి, మమతా బెనర్జీ మొదలైన రాజకీయ ప్రముఖులు ఉపయోగించారు. అయితే ఇప్పుడు కూడా కొన్ని ప్రభుత్వ శాఖలలో ఈ కార్లను విరివిగా ఉపయోగిస్తున్నారు. ఒకప్పుడు అంబాసిడర్ అంటే.. ప్రభుత్వ అధికారుల వాహనంగా గుర్తింపు పొందింది. కానీ నేడు ఈ కారు స్థానంలో కొత్త కార్లు చేరాయని తెలుస్తోంది.
హిందుస్తాన్ అంబాసిడర్
1958లో మొదలైన హిందుస్తాన్ అంబాసిడర్ ప్రస్థానం.. 2014వరకు సాగింది. సుమారు ఐదు దశాబ్దాలు భారతదేశంలో గొప్ప అమ్మకాలను పొందిన ఈ కారు.. కాలక్రమంలో ప్రత్యర్థుల పోటీని తట్టుకోలేకపోయింది. కొత్త కార్లు మార్కెట్లో అడుగుపెట్టిన సమయంలో అంబాసిడర్ కారును కొనుగోలు చేసేవారి సంఖ్య బాగా తగ్గింది. దీంతో కంపెనీ ఈ కారు ఉత్పత్తిని నిలిపివేయాల్సి వచ్చింది. అయితే కంపెనీ కూడా కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఎప్పటికప్పుడు కారుకు కొత్త హంగులను ప్రవేశపెట్టినప్పటికీ.. ఆశించిన స్థాయిలో అమ్మకాలను సాధించలేకపోయింది. దీంతో ఉత్పత్తి నిలిచిపోయింది. కానీ అప్పట్లో అంబాసిడర్ కార్లను కొనుగోలు చేసిన చాలామంది.. ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు. అప్పుడప్పుడు ఈ కార్లు ప్రజా రహాదారులపై కనిపిస్తూ ఉంటాయి కూడా.