టోక్యో వేదికగా జరుగుతున్న 2025 జపాన్ మొబిలిటీ షోలో లెక్కకు మించిన వాహనాలు ప్రదర్శించబడ్డాయి. ఇందులో కనిపించిన కొన్ని కార్లను భారతదేశంలో కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దేశీయ విఫణిలో అడుగుపెట్టనున్న.. జపాన్ మొబిలిటీ షో 2025లో కనిపించిన కార్లను గురించి ఈ కథనంలో వివరంగా.. తెలుసుకుందాం.
హోండా 0 సిరీస్
ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా.. జపాన్ మొబిలిటీ షోలో 0 సిరీస్ కారును ఆవిష్కరించింది. దీనిని కంపెనీ 2026లో భారతదేశంలో లాంచ్ చేయనుంది. ఈ ఎలక్ట్రిక్ కారు సాఫ్ట్‌వేర్ డిఫైన్డ్ వెహికల్. కాబట్టి ఇది ఏఎస్ఐఎంఓ ఓఎస్ మరియు లెవల్ 3 ఏడీఏఎస్ అనే వెహికల్ వైడ్ ఆపరేటింగ్ సిస్టం పొందుతుంది. ఈ కారు 80 కిలోవాట్ మరియు 100 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఎంపికలలో అందుబాటులో ఉండనుంది. కాగా దీనిని సంస్థ సీబీయూ మార్గం ద్వారా.. దేశీయ విఫణికి తీసుకురానుంది. దీని ధర రూ. 80 లక్షల కంటే ఎక్కువ ఉండొచ్చని అంచనా.
మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఫ్లెక్స్ ఫ్యూయెల్
భారతదేశంలో అధిక ప్రజాదరణ పొందిన కార్ల మారుతి ఫ్రాంక్స్.. 2026 నాటికి ఫ్లెక్స్ ఫ్యూయెల్ రూపంలో లాంచ్ అవ్వడానికి సిద్ధమవుతోంది. ఈ20 పెట్రోల్ తప్పనిసరి చేసిన తరువాత.. కంపెనీ ఈ ఫ్లెక్స్ ఫ్యూయెల్ వెర్షన్ లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఈ కారు ఈ85 (85 శాతం ఇథనాల్, 15 శాతం పెట్రోల్) మిశ్రమాలకు సపోర్ట్ చేస్తుంది. అయితే కంపెనీ ఈ కారుకు సంబంధించిన స్పెసిఫికేషన్లను అధికారికంగా విడుదల చేయలేదు. ఈ ఫ్లెక్స్ ఫ్యూయెల్ కారు చూడటానికి సాధారణ పెట్రోల్ కారు మాదిరిగా ఉంటుంది. అయితే అక్కడక్కడా ఆకుపచ్చ స్కిక్కర్స్ కనిపిస్తాయి.
హోండా 0 ఏ (ఆల్ఫా)
0 సిరీస్ మోడల్ కాకుండా.. హోండా కంపెనీ 0 ఏ (ఆల్ఫా) పేరుతో మరో కారును భారతదేశంలో లాంచ్ చేయనుంది. దీనిని సంస్థ 2027లో మన దేశంలో అధికారికంగా విడుదల చేయనున్నట్లు సమాచారం. దీనిని సీబీయూ మార్గం ద్వారా దిగుమతి చేసుకుంటారు. కాబట్టి.. ఈ కారు ధర రూ. 25 లక్షల నుంచి రూ. 30 లక్షల మధ్య ఉంటుంది. ఇది ఎలక్ట్రిక్ కారు కావడంతో.. రెండు బ్యాటరీ ఆప్షన్స్ పొందుతుందని సమాచారం. కాగా రేంజ్, ఇతర వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.
టయోటా ఎఫ్‌జే క్రూయిజర్
2028 చివరలో టయోటా కంపెనీ తన ఎఫ్‌జే క్రూయిజర్ కారును భారతదేశంలో లాంచ్ చేయనుంది. కంపెనీ కొన్ని వారాల క్రితమే.. గ్లోబల్ మార్కెట్లో దీనిని లాంచ్ చేసింది. ఇది టయోటా ల్యాండ్ క్రూయిజర్ లైనప్‌కు ఎంట్రీ లెవల్ మోడల్ అని తెలుస్తోంది. అంతే కాకుండా ఎఫ్‌జే క్రూయిజర్.. ఫార్చ్యూనర్, హైలక్స్, ఇన్నోవా క్రిస్టా వంటి వాటికి మద్దతు ఇచ్చే.. ఐఎంవీ బాడీ ఆన్ ఫ్రేమ్ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంది.
జపాన్ మొబిలిటీ షో 2025 కార్యక్రమంలో కనిపించిన టయోటా ఎఫ్‌జే క్రూయిజర్ కారును కంపెనీ.. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ ప్లాంట్‌లో తయారు చేయనున్నట్లు సమాచారం. దీని ధర రూ. 30 లక్షల నుంచి ప్రారంభమవుతుందని సమాచారం. ఈ కారు 2.7 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ద్వారా 163 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుందని తెలుస్తోంది. అంతే కాకుండా ఇది హైబ్రిడ్ లేదా ప్లగ్ ఇన్ హైబ్రిడ్ సెటప్‌తో రానుంది. 4 వీల్ డ్రైవ్ ఎంపికను కూడా పొందనున్నట్లు సమాచారం. ఈ కారుకు సంబంధించిన మరింత సమాచారం వెల్లడికావాల్సి ఉంది.