జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్: అంచనాలు పెంచేస్తున్న రామ్ చరణ్ పెద్ది

అతిలోక సుందరి కుమార్తె జాన్వీ కపూర్.. తెలుగు సినిమాల్లో కూడా తనదైన ముద్ర వేస్తోంది. దేవర సినిమాతో టాలీవుడ్ అరంగేట్రం చేసిన ఈ అమ్మడు.. ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన పెద్ది సినిమాలో నటిస్తోంది. ఇప్పటి వరకు రామ్ చరణ్ ఫోటోలను మాత్రమే రిలీజ్ చేసిన చిత్ర బృందం.. తాజాగా జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ విడుదల చేసింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.

జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్

డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ చాలానే విడుదలయ్యాయి. ఇప్పుడు తాజాగా రిలీజ్ అయిన జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్.. అటు రామ్ చరణ్ అభిమానులను, ఇటు జాన్వీ కపూర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. జాన్వీ.. పెద్ది సినిమాలో ఒక పల్లెటూరి అమ్మాయిగా.. అచ్చియ్యమ్మ అనే పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఫోటో చూడగానే దేనికి భయపడని ఒక ఫైర్ బ్రాండ్ కనిపిస్తుంది. పోస్టర్‌లో జాన్వీ జీపులో నిలబడి.. రెండు చేతులు పైకెత్తి నమస్కారం పెట్టినట్లు అనిపిస్తోంది. మరో పోస్టర్‌లో మైకు ముందు నిలబడి ఉన్నట్లు కనిపిస్తోంది. దీన్నిబట్టి చూస్తే.. గ్రామీణ వాతావరణం పెద్ది సినిమాలో పుష్కలంగా కనిపిస్తుందని తెలుస్తోంది.

రిలీజ్ ఎప్పుడంటే?

బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న పెద్ది సినిమాకు.. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట్ సతీష్ కిలారు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దీనిని మైత్రీ మూవీ మేకర్స్ & సుకుమార్ రైటింగ్స్ ప్రతిష్టాత్మకంగా సమర్పిస్తున్నారు. కొరియోగ్రాఫర్ బాధ్యతలను జానీ మాస్టర్ తీసుకున్నారు. కాగా ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తయింది. అయితే 2026 మార్చి 27న థియేటర్లలో రిలీజ్ అవుతుందని సమాచారం. అంటే నటుడు రామ్ చరణ్ పుట్టినరోజు (మార్చి 27) సందర్భంగా ఈ సినిమాలు రిలీజ్ చేయడానికి చిత్రబృందం కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది.

వేగంగా సాగుతున్న షూటింగ్!

పెద్ది సినిమా షూటింగుకు సంబంధించిన కొన్ని విశేషాలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శ్రీలంకలో జరుగుతోంది. ఈ సినిమా కోసం రామ్ చరణ్ చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో సినిమాపై అంచనాలు చాలా పెరిగిపోయాయి. కొన్ని రోజులకు ముందు ఏకంగా 1000 మందితో కూడిన ఒక సాంగ్ కూడా చిత్రీకరించడం జరిగింది. గత వినాయకచవితి సందర్భంగా దీనిని చిత్రీకరించినట్లు చిత్రబృందం వెల్లడించింది.

అత్యుత్తమ స్థాయి బృందాలతో..

రామ్ చరణ్ పెద్ది సినిమా కోసం పూర్తి గెటప్ మార్చేశారు. కాగా ఈ సినిమాలో జాన్వీ కపూర్ మాత్రమే కాకుండా.. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. జగపతి బాబు, దివ్యేందు శర్మ కూడా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. అత్యున్నత స్థాయి సాంకేతిక బృందంతో.. పెద్దిని నిర్మిస్తున్నారు. ఆర్ రత్నవేలు సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. నేషనల్ అవార్డు గ్రహీత ఎడిటర్ నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పెద్ది సినిమా కోసం రూ. 300 కోట్లు వెచ్చిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ సినిమాను కేవలం తెలుగులో మాత్రమే కాకుండా.. తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా తెరకెక్కించనున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు పెట్టుకున్నారు.