గెలవడం కాదు, చివరి వరకు పోరాడటం గొప్ప: శర్వానంద్ బైకర్

శర్వానంద్, మాళవిక నాయర్ జంటగా నటించిన సినిమా బైకర్. ఈ సినిమా గ్లింప్స్ నవంబర్ ఒకటో తేదీ సాయంత్రం విడుదల చేశారు. ఇందులో రాజశేఖర్, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి, దయానంద్ రెడ్డి ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తుండగా.. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ జే. యువరాజ్ చేస్తుండగా.. జీబ్రాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

గ్లింప్స్ వీడియో.. 

బైకర్ గ్లింప్స్ వీడియో నిడివి.. ఒక నిమిషము ఇరవై ఒక్క సెకన్స్ మాత్రమే ఉంది. ఆ కొన్ని సెకండ్లలోనే మొత్తం సినిమా చూసిన ఫీలింగ్ అయితే కలిగిందని అనిపిస్తోంది. తెలుగు ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతి కలుగుతుంది. “ఇక్కడ ప్రతి బైకర్‌కు ఒక కథ ఉంటుంది. సమయంతో పోరాడే కథ, చావుకు ఎదురెళ్లే కథ” ఇవి బ్యాక్‌గ్రౌండ్‌లో వీడియో ప్రారంభంలో వచ్చే మాటలు. ఈ డైలాగ్స్ బట్టే అర్థం చేసుకోవచ్చు సినిమా ఏ స్థాయిలో ఉండబోతున్నదనేది.

బైక్ రేసింగ్ అయితే మామూలుగా లేదు. శర్వానంద్ చెప్పినట్టు భారతదేశ చలన చిత్ర చరిత్రలోనే ఇప్పటి వరకు ఎవరు చేయని సినిమా ఇది అని కచ్చితంగా చెప్పొచ్చు. ఒక్కో బైక్ అలా పైకి గాల్లో ఎగురుతుంటే వొళ్ళంతా రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. ఇదివరకే మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్, శర్వా కలిసి పనిచేసిన కారణంగా తనకి ఎలాంటి సంగీతం ఇవ్వాలో బాగా తెలుసు కాబట్టి బిజీఎం బాగుంది.

రేసర్‌గా శర్వానంద్

ఒక బైక్ రేస్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. శర్వానంద్ రేసర్‌గా వంద శాతం న్యాయం చేశాడని గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమా కోసం నిజమైన బైక్ రేసర్లని వాడారు. కోయంబత్తూరు, ఇండోనేషియాలకు వెళ్లి మరీ అక్కడ ఒరిజినల్ బైక్ రేసర్లతో మాట్లాడి ఈ సినిమా చేశారు. శర్వానంద్ బైకర్ కోసం.. ఒక నిజమైన రేసర్ మాదిరిగా తయారయ్యాడు. వాళ్లు ఎంత కష్టం చేశారు అనేది చెప్పడానికి ఒక్క గ్లింప్స్ చాలు అనిపిస్తుంది. హీరో లుక్ అయితే పూర్తిగా మారిపోయింది. బైక్ రేసింగ్ ఇష్టపడే యువత అయితే మాత్రం తప్పకుండా లైక్ చేస్తారు. శర్వానంద్ ఈ సినిమా కోసం కోసం చాలా గ్యాప్ తీసుకొని అన్నీ పూర్తిగా నేర్చుకుని రంగంలోకి దిగినట్టే ఉంది.

గ్లింప్స్ లాంచ్ ఈవెంట్

బైకర్ సినిమా డిసెంబర్ 06వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానున్నది. అయితే నవంబర్ 01న బైకర్ ది ఫస్ట్ లాప్ – ది గ్లింప్స్ పేరుతో ఒక కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని పీవీఆర్ ఆర్కే సినీప్లెక్స్‌లో విలేకరుల మధ్యలో జరిగింది. ఈ ఈవెంట్‌కు హీరో రాజశేఖర్, జీవిత, మూవీ ప్రొడ్యూసర్ వంశీ, డైరెక్టర్ అభిలాష్ తదితరులు పాల్గొన్నారు. సినిమాకు సంబంధించిన మిగిలిన విశేషాలు ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తం మీద శర్వానంద్ ఇప్పటి వరకు చేసిన సినిమాలన్ని ఒకెత్తు, ఈ బైకర్ సినిమా ఒకెత్తు. కాబట్టే ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను మాత్రం భారీగానే ప్లాన్ చేశారు.