మరో ఎలక్ట్రిక్ కారు లాంచ్‌కు సిద్ధమైన మహీంద్రా: నవంబర్ 27న ముహూర్తం!

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా.. మరో ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయడానికి సిద్ధమైంది. కంపెనీ లాంచ్ చేయనున్న కారుకు ‘ఎక్స్ఈవీ 9ఎస్‘ అని కూడా నామకరణం చేసింది. కారు పేరును సూచించే ఒక చిన్న వీడియోను సైతం సంస్థ అధికారికంగా లాంచ్ చేసింది. ఇది నవంబర్ 27న దేశీయ విఫణిలో అడుగుపెడుతుందని కూడా ప్రకటించింది.

మరో ఎలక్ట్రిక్ కారు – ఎక్స్ఈవీ 9ఎస్

మహీంద్రా కంపెనీ 2024 నవంబర్ నెలలో బీఈ 6, ఎక్స్ఈవీ 9ఈ అనే రెండు ఎలక్ట్రిక్ కార్లను ఆవిష్కరించింది. కాగా ఈ నవంబర్ నెలలో ఎక్స్ఈవీ 9ఎస్ కారును లాంచ్ చేయడానికి సిద్ధమైంది. సంస్థ నవంబర్ 27న బెంగళూరులో జరిగే స్క్రీమ్ ఎలక్ట్రిక్ కార్యక్రమంలో ఈ కొత్త కారును ఆవిష్కరించనుంది. ఇది 7 సీటర్ ఎలక్ట్రిక్ కారు అని స్పష్టంగా వెల్లడించింది.

ఎక్స్ఈవీ 9ఎస్ అనే ఎలక్ట్రిక్ కారు.. ఇప్పుడు మార్కెట్లో అమ్ముడవుతున్న బీఈ 6, ఎక్స్ఈవీ 9ఈ యొక్క ఐఎన్‌జీఎల్‌ఓ ఆర్కిటెక్చర్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఈ ఆర్కిటెక్చర్ మీద నిర్మితమవుతున్న మూడవ మోడల్ ఎక్స్ఈవీ అని తెలుస్తోంది. ఇది భారతదేశంలో మాత్రమే కాకుండా.. ప్రపంచ మార్కెట్లో కూడా అందుబాటులో ఉంటుంది. అంటే.. ఇతర దేశాల్లో కూడా ఇది అమ్ముడవుతుందన్నమాట.

లాంచ్ ఎప్పుడంటే?

మహీంద్రా అండ్ మహీంద్రా తన ఎక్స్ఈవీ 9ఎస్ ఎలక్ట్రిక్ కారును ఈ నెలలో ఆవిష్కరించినప్పటికీ.. లాంచ్ ఎప్పుడు చేస్తుందనే విషయాన్ని వెల్లడించలేదు. బహుశా 2025 చివరి నాటికి లాంచ్ అవుతుందని భావిస్తున్నాము. ధరలు కూడా లాంచ్ సమయంలోనే వెల్లడవుతాయి.

బీఈ 6, ఎక్స్ఈవీ 9ఈ పేర్లు మాదిరిగానే.. ఎక్స్ఈవీ 9ఎస్ పేరు ఉంది కాబట్టి. అందులోనూ అదే ఐఎన్‌జీఎల్‌ఓ ఆర్కిటెక్చర్ ఆధారంగా రూపుదిద్దుకుంటోంది కాబట్టి.. రాబోయే ఎలక్ట్రిక్ కారు, ఇప్పుడు ఎలక్ట్రిక్ కారు మాదిరిగానే ఉంటుందని చాలామంది భావిస్తున్నారు. కానీ 9ఎస్ ఫ్యామిలీ భిన్నంగా ఉంటుందని కంపెనీ వెల్లడించింది. పరిమాణం పరంగా ఎక్స్‌యూవీ700 కారుకు దగ్గరగా ఉంటుంది. కానీ మెకానికల్స్ పరంగా భిన్నంగా ఉంటుంది. పరిమాణం పరంగా ఎక్స్ఈవీ 9ఎస్ పెద్దదిగా ఉండటం వల్ల.. ఫ్యామిలీ కారుగా.. ఫ్యామిలీ ట్రిప్ కోసం ఇది చాలాబాగా ఉపయోగపడుతుంది.

ఫీచర్స్ ఎలా ఉంటాయంటే?

ఎక్స్ఈవీ 9ఎస్ కారులో ఎలాంటి ఫీచర్స్ ఉంటాయనే విషయాన్ని మహీంద్రా అధికారికంగా వెల్లడించలేదు. కానీ ఇప్పటికే ఐఎన్‌జీఎల్‌ఓ ఆర్కిటెక్చర్ మీద నిర్మితమైన కార్లలో ఉన్న.. దాదాపు అన్ని ఫీచర్స్ ఉంటాయని సమాచారం. కాబట్టి 9ఎస్ కారులోని రెండో వరుసలో స్లైడింగ్ సీట్లు, ట్రిపుల్ స్క్రీన్ లేఅవుట్, హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టం, పనోరమిక్ గ్లాస్ రూఫ్, ఆటోపార్క్, లెవల్ 2 ఏడీఏఎస్ ఫీచర్స్ అన్నీ కూడా ఉంటాయని తెలుస్తోంది.

బ్యాటరీ & రేంజ్ వివరాలు

మహీంద్రా కంపెనీ బీఈ 6, ఎక్స్ఈవీ 9ఈ ఎలక్ట్రిక్ కార్లలో ఉపయోగించిన బ్యాటరీ ప్యాక్‌లనే.. ఎక్స్ఈవీ 9ఎస్ కారులో కూడా అందించే అవకాశం ఉంది. కాబట్టి 9ఎస్.. 59 కిలోవాట్, 79 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ పొందుతుంది. అయితే రేంజ్ విషయంలో కొంత వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రిక్ కారు 400 కిమీ నుంచి 600 కిమీ రేంజ్ అందించే అవకాశం ఉంటుందని సమాచారం. అయితే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడవ్వాల్సి ఉంది.