కుంభమేళా మోనాలిసా తెలుగు సినిమా: పూజా కార్యక్రమంలో సందడి

కుంభమేళా మోనాలిసా అలియాస్ మోనాలిసా భోస్లే సినీరంగంలో అడుగుపెడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే మొదట బాలీవుడ్ సినిమాతో తెరమీద కనిపించనున్నట్లు కొన్ని వార్తలు వచ్చాయి. కానీ అంతకంటే ముందు.. ఈమె తెలుగు చిత్ర పరిశ్రమ ద్వారా తెరమీద కనిపించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ప్రస్తుత పరిస్థితులు చెప్పకనే చెబుతున్నాయి. దీనికి కారణం ఈ రోజు (నవంబర్ 5) హైదరాబాద్‌లో జరిగిన మూవీ లాంచ్ కార్యక్రమంలో మోనాలిసా సందడి చేయడమే. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పూజా కార్యక్రమంలో సందడి

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో గమనిస్తే.. పూజా కార్యక్రమంలో దేవునికి పువ్వులు సమర్పించడం, కొబ్బరి కాయ కొట్టడం, చిత్ర బృందంతో కలిసి ఉండటం వంటివి కనిపిస్తాయి. వెంగమాంబ మూవీ ప్రొడక్షన్ వారు ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి సినిమా పేరును అధికారికంగా వెల్లడించలేదు. కానీ ఇందులో మోనాలిసా మాత్రమే కాకుండా.. సాయిచరణ్ హీరోగా నటిస్తున్నారు. శ్రీను కొటుపాటి ఈ సినిమాకు డైరెక్షన్ చేస్తున్నారు. కాగా ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయడానికి సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. అంటే ఈ సినిమా వివిధ భాషల్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుందని అర్థమవుతోంది.

ఎవరీ మోనాలిసా?

నిజానికి మోనాలిసా గురించి ప్రత్యేకంగా పరిచయమే అవకాశం లేదు. ఒక్క రోజులోనే సెలబ్రిటీలైన అతి తక్కువ మందిలో మోనాలిసా ఒకరు. ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళాలో పూసలు అమ్మడుకోవడానికి వచ్చిన ఒక సాధారణ యువతిని.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ బాగా పాపులర్ చేసేసారు. దీనికి కారణం ఆమె కళ్ళు. గోధుమరంగులో ఉన్న ఈమె కళ్ళు చాలామందిని ఆకట్టుకున్నాయి. దీంతో మోనాలిసా.. కుంభమేళా మోనాలిసా అయింది. సాధారణ యువతి కాస్త.. సెలబ్రిటీ అయిపోయింది.

మహాకుంభమేళా సమయంలో ఈమెతో ఫొటోలు దిగడానికి, వీడియోలు తీసుకోవడానికి చాలామంది ఎగబడ్డారు. దీంతో ఆమె కుంభమేళాను వదిలి స్వగ్రామానికి చేరింది. దీన్ని బట్టి చూస్తే.. ఈమె ఎంత పాపులర్ అయిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈమె పాపులారిటీ చూసి.. మోనాలిసాతో సినిమా తీయడానికి బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా సిద్ధమయ్యారు.

బాలీవుడ్ సినిమాలో..

మోనాలిసాతో బాలీవుడ్ సినిమా తీయడానికి సనోజ్ మిశ్రా కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగానే ఆయన ది మణిపూర్ డైరీస్ అనే సినిమా ప్రారంభించారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల.. సనోజ్ మిశ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ది మణిపూర్ డైరీస్ రిలీజ్ వాయిదా పడింది. అయితే ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయాన్ని.. ప్రస్తుతానికి ఎవరూ అధికారికంఘా వెల్లడించలేదు.

ది మణిపూర్ డైరీస్ సినిమా వాయిదా పడటంతో.. మోనాలిసా తెలుగు సినిమాల్లో నటించడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే.. ఈ రోజు (బుధవారం) హైదరాబాద్‌లో నిర్వహించిన మూవీ లాంచ్ కార్యక్రమంలో కనిపించింది. ప్రస్తుతం సినిమాల్లో నటించడానికి కావలసిన అన్ని విషయాలను నేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే మోనాలిసా నటించనున్న తెలుగు సినిమా ఎప్పుడు లాంచ్ అవుతుంది, షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.