మహీంద్రా అండ్ మహీంద్రా.. భారతదేశంలో మరో కొత్త కారు(ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ)ను లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఇప్పటికే ఈ కారుకు సంబంధించిన టీజర్స్, చిత్రాలు అన్ని కూడా సోషల్ మీడియా ద్వారా వెల్లడయ్యాయి. కాగా కంపెనీ ఈ కారు కోసం రేపటి (డిసెంబర్ 15) నుంచే బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించనుంది. ఈ లేటెస్ట్ కారుకు సంబంధించిన మరిన్ని ఆసక్తికర వివరాలను ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
లాంచ్ ఎప్పుడంటే?
2026 జనవరి 5న లాంచ్ కానున్న కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ.. కారు, ఇప్పటికే మార్కెట్లో అమ్ముడవుతున్న ఎక్స్‌యూవీ700 పునరుద్దరించబడిన మోడల్. అయితే ఇది.. అప్డేటెడ్ డిజైన్, కొత్త క్యాబిన్ వంటివి కనిపిస్తాయి. కాగా కంపెనీ ఈ కారు ధరలను (ప్రారంభ ధర రూ. 15 లక్షలు ఉంటుందని అంచనా), డెలివరీ వివరాలను త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది. ఈ కారును బుక్ చేసుకోవడానికి రూ. 21వేలు టోకెన్ మొత్తం చెల్లించాల్సి ఉంటుందని సమాచారం.
కొత్త డిజైన్
మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ కారు కొత్త డ్యూయెల్ పాడ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ పొందుతుంది. ఇన్వర్టెడ్ ఎల్ షేప్ ఎల్ఈడీ డీఆర్ఎల్ కనిపిస్తుంది. వెనుకవైపు.. ఎల్ఈడీ టెయిల్ లైట్ ఉంటుంది. కాగా సిల్వర్ స్లాట్‌లతో.. బ్లాక్ అవుట్ రేడియేటర్ గ్రిల్, అప్డేటెడ్ అల్లాయ్ వీల్స్ కూడా ఈ కారులో చూడవచ్చు. దీన్నిబట్టి చూస్తే.. డిజైన్ చాలావరకు అప్డేట్ పొందినట్లు స్పష్టమవుతోంది.
ఇంటీరియర్
కొత్త ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ కారు.. చాలావరకు పునఃరూపకల్పన చేయబడిన క్యాబిన్ పొందుతుంది. ట్రిపుల్ స్క్రీన్ సెటప్ ఇందులో ఉంది. అంతే కాకుండా.. డాష్‌బోర్డ్‌పై సాఫ్ట్ టచ్ ఎలిమెంట్స్, డ్యూయెల్ స్పోక్ స్టీరింగ్ వీల్, వెంటిలేషన్ ఫంక్షన్‌తో కూడిన స్లైడింగ్ సెకండ్ రో సీట్లు, అడ్జస్టబుల్ హెడ్‌రెస్ట్‌లు ఈ కొత్త కారులో కనిపించనున్నాయి. ఏడీఎస్ఎస్ ఫీచర్లతో పాటు.. ఇందులో అనేక అప్డేటెడ్ ఫీచర్స్ కూడా ఉంటాయని తెలుస్తోంది.
పవర్‌ట్రెయిన్ గురించి
ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ కారులో.. సాధారణ ఎక్స్‌యూవీ700 కారులోని అదే ఇంజిన్స్ ఉండనున్నట్లు సమాచారం. కాబట్టి ఇద్న్హులో 2.0 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్, 2.2 లీటర్ డీజిల్ ఇంజన్‌లు ఉండనున్నాయి. పెట్రోల్ ఇంజిన్ 200 హార్స్ పవర్, 380 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తే.. డీజిల్ వేరియంట్ 182 హార్స్ పవర్, 450 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ & టార్క్ కన్వర్టర్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో లభిస్తుంది. డీజిల్ వెర్షన్ ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ పొందుతుందని తెలుస్తోంది.
మన దేశంలో మహీంద్రా కార్లకు డిమాండ్ ఇలా..
దేశీయ వాహన తయారీ దిగ్గజం.. మహీంద్రా అండ్ మహీంద్రా కార్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఇప్పటికే కంపెనీ ఎక్స్‌యూవీ700, స్కార్పియో, బొలెరో, థార్ వంటి కార్లతో పాటు.. బీఈ6, ఎక్స్‌యూవీ400, ఎక్స్ఈవీ 9ఎస్ వంటి ఎలక్ట్రిక్ కార్లను కూడా విక్రయిస్తోంది. ఇప్పుడు తాజాగా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ లాంచ్ కావడానికి సిద్ధమైంది. ఇది మంచి అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నాము. అయితే ఎలాంటి అమ్మకాలు పొందుతుందో తెలుసుకోవడానికి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.