2025 సెప్టెంబర్ నెలలో ప్రారంభమైన బిగ్‌బాస్ 9 తెలుగు సీజన్ ప్రారంభమైంది. మొత్తం 15 మంది కంటెస్టెంట్లతో మొదలైన ఈ సీజన్ దాదాపు చరమదశకు వచ్చేసింది. ఇటీవల సుమన్ శెట్టి, భరణి ఎలిమినేట్ అవ్వడంతో.. ఇప్పుడు కేవలం ఐదుమంది (కళ్యాణ్, తనూజ, డెమోన్ పవన్, ఇమ్యాన్యుయేల్, సంజన) మాత్రమే ఫైనల్ కంటెస్టెంట్స్ జాబితాలో నిలిచారు.
రూ.50 లక్షల ప్రైజ్ మనీ
ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. బహుశా ఇంకో వారం రోజుల్లో బిగ్‌బాస్ 9 తెలుగు సీజన్ ముగుస్తుందని తెలుస్తోంది. అయితే ఇప్పటికే విన్నర్ ప్రైజ్ మనీ రివీల్ చేశారు. సీజన్ విన్నర్‌కు రూ. 50 లక్షల ప్రైజ్ మనీతో పాటు.. మారుతి సుజుకి కంపెనీకి చెందిన విక్టోరిస్ కారును గిఫ్ట్ ఇవ్వనున్నాయి. ఈ విషయాన్ని హోస్ట్ నాగార్జున స్వయంగా వెల్లడించారు.
ప్రైజ్ మనీ గురించి దాదాపు అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ.. విన్నర్‌కు ఇచ్చే కారు గురించి తెలుసుకోవడానికి చాలామంది నెట్టింట్లో సెర్చ్ చేస్తున్నారు. మారుతి సుజుకి విక్టోరిస్ ఎప్పుడు లాంచ్ అయింది?, దాని ధర ఎంత? వంటి అనేవి విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఆ వివరాలు ఈ కథనంలో..
మారుతి విక్టోరిస్
సెప్టెంబర్ 2025లో మారుతి సుజుకి తన విక్టోరిస్ కారును లాంచ్ చేసింది. మొత్తం ఆరు వేరియంట్లలో లభించే ఈ కారు ధరలు రూ. 10.5 లక్షల నుంచి రూ. 19.99 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. అయితే బిగ్‌బాస్ 9 తెలుగు సీజన్ విన్నర్ ఏ వేరియంట్ కారును పొందనున్నారనే విషయం వెల్లడి కాలేదు.
విక్టోరిస్ కారులో ఎల్ఈడీ హెడ్‌లైట్స్, ఫాగ్ లైట్స్, టెయిల్ లైట్స్ వంటివి ఉంటాయి. 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కలిగిన ఈ కారులో పనోరమిక్ సన్‌రూఫ్ కూడా ఉంటుంది. అంతే కాకుండా.. 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్, 1025 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, 8 స్పీకర్లు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్లెస్ ఛార్జింగ్, యాంబియంట్ లైటింగ్ వంటివన్నీ కూడా ఈ కారులో ఉన్నాయి.
మంచి డిజైన్, అత్యాధునిక ఫీచర్స్ మాత్రమే కాకుండా.. ప్రయాణికుల భద్రతకు కూడా కంపెనీ పెద్దపీట వేసింది. ఈ కారు క్రాష్ టెస్టులో కూడా 5 స్టార్ రేటింగ్ సాధించి.. సురక్షితమైన కార్ల జాబితాలో ఒకటిగా చేరింది. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టంఎం ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్, లెవెల్ 2 ఏడీఏఎస్ ఫీచర్స్ మొదలైనవన్నీ ఉన్నాయి.
మారుతి సుజుకి విక్టోరిస్ కారు.. మొత్తం మూడు ఇంజిన్ ఎంపికలతో లభిస్తుంది. అవి 1.5 లీటర్ మైల్డ్ పెట్రోల్ (103 హార్స్ పవర్), 1.5 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ (116 హార్స్ పవర్), 1.5 లీటర్ సీఎన్జీ (89 హార్స్ పవర్). పనితీరు కూడా ఉత్తమంగా ఉంటుందని సమాచారం. మైలేజ్ కూడా గొప్పగా ఉంటుంది. ఈ కారు ఇండియన్ మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, ఎంజీ ఆస్టర్, హోండా ఎలివేట్ వంటి కార్లకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. అయినప్పటికీ.. అమ్మకాల్లో మంచి ఆదరణ పొందుతుంది. ఇప్పుడు బిగ్‌బాస్ విన్నర్‌ను వరించనుంది.