ఉద్యోగం చేసే దాదాపు అందరికీ ఈపీఎఫ్ అకౌంట్ ఉంటుంది. ఈ ఖాతా నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకోవడానికి ఒకప్పుడు చాలా కష్టపడాల్సి ఉండేది. ఫారమ్ ఫిల్ చేసి.. సబ్మిట్ చేసి, కొన్ని రోజులు వేచి చూడాల్సి వచ్చేది. కానీ క్రమంగా ఈపీఎఫ్ విత్‌డ్రా చాలా సులభతరమైపోయింది. ఇప్పుడు కేవలం వారం రోజుల వ్యవధిలోనే పీఎఫ్ బ్యాలెన్స్.. బ్యాంక్ ఖాతాలోకి జమ అయిపోతోంది. దీనిని మరింత సులభతరం చేయడానికి ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) ఓ కొత్త విధానం తీసుకురాబోతోంది.
ఈపీఎఫ్ఓ ఖాతాలోని డబ్బును కొత్త విధానం ద్వారా.. యూపీఐకు బదిలీ చేసుకోవచ్చు. ఆ తరువాత మీకు కావాలనుకునే ఏటీఎం నుంచి విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ విధానం ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చాలా వేగంగా జరుగుతున్నట్లు కూడా పేర్కొన్నారు.
పీఎఫ్ యూపీఐ విత్‌డ్రా
చందాదారులు తమ సీడెడ్ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయడంతో పీఎఫ్ బ్యాలెన్స్ చూడవచ్చు. మీ యూపీఐకు కూడా పిన్ నెంబర్ ఉపయోగించి లావాదేవీలు పూర్తి చేసుకోవచ్చు. ఇది మొత్తం సురక్షితమైన ప్రక్రియ. ఇలా బదిలీ చేసుకున్న తరువాత.. సదరు వ్యక్తి లేదా పీఎఫ్ ఖాతాదారు ఏటీఎం నుంచి డెబిట్ కార్డులను ఉపయోగించి విత్‌డ్రా చేసుకోవచ్చు.
ఎనిమిది కోట్ల మందికి ప్రయోజనం
ప్రస్తుతం ఈ విధానం సజావుగా జరిగేలా చూడటానికి ఈపీఎఫ్ఓ.. సాఫ్ట్‌వేర్ సంబంధిత సమస్యలను పరిష్కరిస్తుంది. ఇది ఒకసారి అమలులోకి వస్తే.. ఏకంగా ఎనిమిది కోట్ల మంది చందాదారులకు ప్రయోజనం చేకూరుతుందని నిపుణులు భావిస్తున్నారు. దీనివల్ల చందారులు ప్రత్యేకంగా క్లెయిమ్స్ దాఖలు చేయాల్సిన అవసరం లేదు. సమయం కూడా ఆదా అవుతుంది.
కొత్త విధానం అమలులోకి వచ్చిన తరువాత.. మాన్యువల్ జోక్యం ఉండదు. అంతే కాకుండా పరిమితిని కూడా లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల వరకు పెంచారు. ఇందులో హెల్త్, ఎడ్యుకేషన్, వివరం, గృహ నిర్మాణం వంటి వాటికోసం పీఎఫ్ ఉపసంహరించుకోవచ్చు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. చందాదారులు మొత్తం విత్‌డ్రా చేసుకోవడానికి అవకాశం లేదు.
సురక్షితమైన ప్రక్రియ
చందాదారులు ఖాతాలో 25 శాతం బ్యాలెన్స్ ఉంచాలి. దీనివల్ల 8.25 శాతం వడ్డీ రేటును పొందవచ్చు. ఇది పదవీ విరమణ తరువాత భవిష్యనిధిని పెంచుకోవడంలో సహాయపడుతుంది. కాగా.. కొత్త విధానానికి సంబంధించిన నోటిఫికేషన్ అధికారికంగా వెల్లడి కాదు. అయితే కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ ఆమోదించిన తరువాత.. నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ మునుపటి కంటే వేగంగా, సురక్షితంగా ఉంటుందని చెబుతున్నారు.
ఈపీఎఫ్ఓ గురించి
ఒక ఉద్యోగి జీతం నుంచి ప్రతి నెలా కొంత మొత్తం డబ్బును పొదుపు కోసం ఈపీఎఫ్ఓ జమ చేస్తుంది. ఈ డబ్బు సదరు వ్యక్తి లేదా ఉద్యోగి రిటైర్మెంట్ తరువాత లేదా ఏదైనా అవసరమైన సందర్భాల్లో తీసుకోవచ్చు. ఇలా అవసరమైన సందర్భాల్లో.. డబ్బు విత్‌డ్రా చేసుకోవడానికి ఉద్యోగి ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోకూడదు అనే ఉద్దేశంతో.. ఈపీఎఫ్ఓ ఇప్పుడు యూపీఐ నుంచి పీఎఫ్ విత్‌డ్రా విధానానికి శ్రీకారం చుట్టింది. ఇది అందుబాటులోకి వచ్చిన తరువాత చాలామందికి ఉపయోగకరంగా ఉంటుంది.
హిమాన్షు కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, సినీ రంగాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలను అందిస్తున్నారు. గతంలో ఆయన ఏపీ, తెలంగాణకు సంబంధించిన ఆసక్తికర వార్తలు, రాజకీయాలు, క్రికెట్ వార్తలు రాశారు. హైపర్ లోకల్ న్యూస్ రైటింగ్‌లో అనుభవం కలిగిన ఆయన వీడియో టీమ్‌తో కూడా పని చేసిన అనుభవం కలిగి ఉన్నారు. జర్నలిజం రంగంలో 14 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆయన ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయాలు, క్రీడలు, సినిమా రంగాలకు సంబంధించిన ఆర్టికల్స్ రాశారు.






