Tuesday, January 27, 2026

ఆధునిక కాలంలో కొత్త ప్రయోగం.. మాటల్లేని సినిమా గురించి తెలుసా?

భారతదేశ చలన చిత్ర రంగంలో నటులుగా అరుదైన ప్రతిభా ఘనత కలిగిన వాళ్లలో అరవింద్ స్వామి మరియు విజయ్ సేతుపతి ఇద్దరు కూడా ఉంటారు. ఇరువురు వారివారి శైలిలో సహజమైన హావభావాలతో ఒక ప్రత్యేకమైన గుర్తింపును కలిగి ఉన్నారు. అటువంటి వాళ్లు ఒక్కరు వెండితెరపైన కనిపిస్తే చాలు ప్రేక్షకులకు పండగే. అలాంటిది ఇద్దరు ఒకేసారి ఒకే చిత్రంలో కనిపిస్తున్నారు అంటే ఇంక చూడటానికి రెండు కళ్లు చాలవు అనే చెప్పాలి. ప్రస్తుతం అరవింద్, విజయ్ సేతుపతిల ద్వయం గాంధీ టాక్స్ అనే ఒక మూకీ సినిమాతో కనిపించనున్నారు. ఈ మూవీ 2026 జనవరి 30వ తేదిన మన ముందుకు రాబోతున్నారు.

ఛానళ్ల తరువాత మూకీ సినిమా

ఈ మూకీ మూవీ 2022లోనే రిలీజ్ అయినప్పటికీ థియేటర్లలోకి ఇప్పటి వరకు రాలేదు. అయితే 2023 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమై విమర్శకుల ప్రశంసలు అందుకునింది. ఇన్నేళ్ల తరువాత ఇప్పుడు.. 2026లో విడుదలకు సిద్ధం అయ్యింది. మూకీ సినిమాలు అనేటివి ఎప్పుడో స్వాతంత్య్ర దినోత్సవమునకు ముందే ఆగిపోయాయి.

1913లో సత్య హరిశ్చంద్ర చిత్రంతో భారతదేశంలో ఈ మూకీ చిత్రాలు ప్రారంభం కావడం జరిగింది. తరువాత వచ్చిన సాంకేతికత కారణంగా 1934తో మూకీ స్థానంలో.. టాకీ చిత్రాలు రావటంతో మూకీ సినిమాలు మరుగున పడిపోయాయి. ఆ తరువాత సుమారు 50 సంవత్సరాల తరువాత 1987లో పుష్పవిమానం అనే చిత్రంతో దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు, కమల్ హాసన్ కలిసి ఒక ప్రయోగాన్ని చేశారు. అందులో వారు సఫలీకృతం అయ్యారు. మళ్లీ 39 ఏళ్లు గాడిచాక ఇప్పుడు “గాంధీ టాక్స్” సినిమా మూకీగా మన ముందుకు వస్తోంది.

మాటల్లేవ్!

ఇందులో అసలు ఏ మాత్రం మాటలు అనేవే ఉండవు, కేవలం నాటీనటుల యాక్టింగ్, నేపథ్య సంగీతం, కెమెరా పనితనం మాత్రమే చిత్రాన్ని ముందుకు నడిపిస్తాయి. ఒకప్పుడు పరిస్థితి వేరు అప్పుడు మూకీ సినిమాలు విజయం సాధించి ఉండవచ్చు, కానీ ఇప్పుడు ఉన్న తరానికి మూకీ చిత్రాల గురించి తెలియదు. టాకి సినిమాకి అలవాటు పడిన ప్రేక్షకులకు మూకీ ఏమేరకు అర్థం అవుతుంది అనేది ఇప్పుడు పెద్ద సవాల్. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్‌లో మాత్రం విజయ్, అరవింద్, అధితిలు నటనతో కట్టిపడేసారు. ఏ.ఆర్. రెహమాన్ సంగీతమే ఈ సినిమాను నడిపిస్తుందని టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. మ్యూజిక్ అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది.

సమాజాన్ని డబ్బు నడిపిస్తోందా?

కరెన్సీ నోటు మీద ఉన్న గాంధీకి, అసలైన గాంధీ ఆలోచనలకు మధ్య వ్యాత్యాసాన్ని డైరెక్టర్ స్పష్టంగా చూపించారు. ఇక్కడ సమాజాన్ని అంతా కూడా డబ్బే నడిపిస్తుంది. దానికి కోసం ఎంతైనా తెగిస్తారు అనేది వీడియోలో కనిపిస్తోంది. వీడియో మొదటిలోనే వందరూపాయల నోటు మీద గాంధీ బొమ్మని చింపి అందులోంచి కన్నుపెట్టి చూడటంతో మనకు అనిపిస్తుంది అక్కడ ఉన్న బొమ్మ కన్నా ఆ కాగితంకి విలువ ఎక్కువ ఇస్తారు జనాలు అని. అదే విధంగా చివరిలో న్యూస్ పేపర్ మీద గాంధీ గురించి ఉన్న ఆర్టికల్ మురికి కాలువలో కొట్టుకుపోవడాన్ని మనుషులు యొక్క మానసిక స్థితిని తెలియజేస్తుంది.

రిలీజ్ ఎప్పుడంటే?

గాంధీ టాక్స్ చిత్రాన్ని జీ స్టూడియోస్, క్యూరియస్ & మావిమిల్ నిర్మాణ సంస్థలు కలిసి నిర్మించారు. కిషోర్ పాండురంగ్ దర్శకత్వం వహించారు. ఏ. ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం సమాకూర్చారు. విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అదితి రావ్ హైదరి, సిద్దార్థ్ జాదవ్ లాంటి వారు ఇందులో నటించారు. 2026 జనవరి 30వ తేదీన గాంధీ వర్ధంతికి సినిమా థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం అయ్యింది. ఇప్పటికే విడుదల అయిన పాటలు, టీజర్ సినిమాకి మంచికి హైప్ క్రియేట్ చేశాయి.

Giribabu
Giribabu
డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు. ప్రముఖ విశ్వ విద్యాలయం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో MA తెలుగు చేశారు. తాజా సినిమా, పాలిటిక్స్, నేషనల్, స్పోర్ట్స్‌కు సంబంధించిన వార్తలతో పాటు ప్రత్యేకమైన కథనాలు రాస్తారు. డిజిటల్ కంటెంట్ రైటర్‌గా సంవత్సరం అనుభవం కలిగి ఉన్నారు. ఈయనకు పాటలు, కవితలు, షార్ట్ ఫిలిమ్స్ వంటివాటికి మాటలు రాసే అలవాటు ఉంది. సహజంగా జానపద, సినిమా పాటలు గాయకుడు.

Related Articles