అభిషేక్ శర్మకు గిఫ్ట్‌గా హవల్ హెచ్9: ఈ కారు గురించి తెలుసా?

2025 ఆసియా కప్‌లో.. తన అద్భుతమైన ప్రదర్శనతో అభిషేక్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు గెలుచుకున్నారు. మ్యాచ్‌లో గొప్ప ప్రదర్శన కనపరిచినందుకు గాను.. ఇతనికి హవల్ హెచ్9 కారు గిఫ్ట్‌గా లభించింది. ఈ కారు చూడటానికి చాలా అద్భుతంగా ఉండటంతో.. ఆటోమొబైల్ ఔత్సాహికులు దీని గురించి తెలుసుకోవడానికి తెగ ఆసక్తి చూపుతున్నారు. ఈ కథనంలో ఆ వివరాలను తెలుసుకుందాం.

హవల్ హెచ్9 ధర

అభిషేక్ శర్మ గిఫ్ట్‌గా పొందిన.. హవల్ హెచ్9 ధర సౌదీ అరేబియా వెబ్‌సైట్ ప్రకారం 142199.8 సౌదీ రియాల్స్. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 33 లక్షల కంటే ఎక్కువ అని తెలుస్తోంది. ఈ కారు భారతదేశంలో చాలా తక్కువమంది దగ్గర మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది.

హవల్ అనేది చైనీస్ ఆటోమొబైల్ కంపెనీ గ్రేట్ వాల్ మోటార్ (జీడబ్ల్యుఎమ్) యాజమాన్యంలోని ఒక ఆటోమోటివ్ బ్రాండ్. ఈ కంపెనీ ప్రపంచంలోని చాలా దేశాల్లో కార్లను లాంచ్ చేసి.. అధిక ఆదరణ పొందుతోంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. ధర కూడా కొంత ఎక్కువే కావడం గమనార్హం.

డిజైన్ & ఫీచర్స్

చూడగానే ఆకట్టుకునే డిజైన్ కలిగిన.. హవల్ హెచ్9 కారు కఠినమైన రూపం పొందుతుంది. లైటింగ్ సెటప్ కూడా అద్భుతంగా ఉంది. ఫ్రంట్ ప్రొఫైల్, సైడ్ ప్రొఫైల్, రియర్ ప్రొఫైల్ అన్నీ కూడా దృఢంగా ఉండటం గమనించవచ్చు. ఈ కారు పనోరమిక్ సన్‌రూఫ్, ఎలక్ట్రిక్ సైడ్‌స్టెప్‌లు పొందుతుంది. ఇది 256/55 ఆర్18 టైర్స్ పొందుతుంది.

ఇంటీరియర్ ఫీచర్స్ విషయానికి వస్తే.. హవల్ హెచ్9 కారులో 14.6 ఇంచెస్ పెద్ద టచ్‌స్క్రీన్, 10 స్పీకర్స్ సౌండ్ సిస్టం, వైర్‌లెస్ ఛార్జర్, డ్రైవర్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన లెదర్ మెమరీ సీట్లు, సీట్ వెంటిలేషన్, రిఫ్రెషింగ్ డ్రైవింగ్ అనుభవం కోసం మసాజ్ ఫీచర్ కూడా ఉన్నాయి.

4950 మిమీ పొడవు, 1976 మిమీ వెడల్పు ఉన్న ఈ హవల్ హెచ్9 కారు ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగులు, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ట్రాఫిక్ జామ్ అసిస్ట్, 360 డిగ్రీ కెమెరా, మల్టిపుల్ డ్రైవింగ్ మోడ్స్ వంటివి ఉన్నాయి. యావన్నీ రైడర్లకు మంచి సేఫ్టీ అందిస్తాయి.

ఇంజిన్ వివరాలు

హవల్ హెచ్9 కారు 2.0 లీటర్ టర్బోఛార్జ్డ్ 4 సిలిండర్ గ్యాసోలిన్ ఇంజిన్ పొందుతుంది. ఇది 380 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్‌కు జతచేయబడి ఉత్తమ పనితీరును అందిస్తుంది. ఇది నగర ప్రయాణాలకు మాత్రమే కాకుండా ఆఫ్ రోడింగ్ కెపాసిటీ కూడా పొందుతుంది. కాబట్టి ఇది ఆఫ్ రోడింగ్ ప్రియులకు చాలా అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది. కఠినమైన రోడ్లపై కూడా ఇది సజావుగా ముందుకు సాగుతుంది.

పాకిస్తాన్ & ఇండియా మ్యాచ్

సెప్టెంబర్ 28న పాకిస్తాన్, ఇండియా మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ చాలా రసవత్తరంగా సాగింది. టాస్ గెలిచి ఇండియా టీమ్ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ఆడిన పాకిస్తాన్ మొదట్లో మంచి స్కోర్ సాధించినప్పటికీ.. చివరికి 146 స్కోర్ దగ్గర నిలిచిపోయింది. రంగంలోకి దిగిన ఇండియా టీమ్ 150/5 స్కోర్ చేసి టైటిల్ గెలుచుకుంది.