కొణిదెల నాగబాబు వారసుడు.. వరుణ్ తేజ్ & లావణ్య త్రిపాఠి దంపతులకు సెప్టెంబర్ 10న కుమారుడు పుట్టిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ బాబుకు విజయదశమి సందర్భంగా బారసాల చేసి, నామకరణం కూడా చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు.
లావణ్య & వరుణ్ తేజ్ కుమారుడి పేరు
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల కుమారుడి పేరును వాయువ్ తేజ్ కొణిదెలగా నామకరణం చేసారు. హనుమాన్ ఆశీర్వాదంతో పుట్టాడని, అందుకే ఆ ఆంజనేయుని పేరు వచ్చేలా.. తమ కుమారుడి పేరు పెట్టుకున్నట్లు సమాచారం. వాయువ్ అనే హనుమంతుని పేర్లలో ఒకటి. ఇక తేజ్ అనేది వరుణ్ తేజ్ పేరులో ఉన్నదే. ఇక చివరి ఇంటిపేరు చేర్చి.. వాయువ్ తేజ్ కొణిదెలగా పేరుపెట్టుకున్నారు. పేరు పెట్టిన సందర్భంగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇద్దరూ తమ కొడుకు దగ్గర ఉన్న ఫోటోలు షేర్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వాయువ్ తేజ్ కొణిదెలను నెటిజన్లు ఆశీర్వదిస్తున్నారు.
హనుమంతుని పేర్లు ఎందుకంటే?
నిజానికి కొనేదెలా కుటుంబంలో చాలామంది పేర్లు హనుమంతుని పేరుతో ముడిపడి ఉన్నాయి. చిరంజీవి (చిరకాలం జీవించి ఉండేవాడు – హనుమంతుడు), పవన్ కళ్యాణ్ (పవన్ అంటే వాయుదేవుడు – వాయుదేవుని కుమారుడు ఆంజనేయుడు), రామ్ చరణ్ (రాముని చరణాల దగ్గర ఉండేవాడు – అంజనీ సుతుడు), ఇప్పుడు వరుణ్ తేజ్ కుమారుడు వాయువ్ తేజ్ (వాయువ్ అనే కూడా ఆంజనేయ స్వామితో ముడిపడి ఉంది).
చిరంజీవి తండ్రి స్వయంగా ఆంజనేయ స్వామి భక్తుడని చాలా సందర్భాల్లో మెగాస్టార్ చెప్పుకొచ్చారు. ఈ కారణంగానే తమ్ముడికి పవన్ కళ్యాణ్ అని పేరు పెట్టినట్లు చెప్పారు. తాను కూడా ఆంజనేయస్వామి భక్తుడు కావడం చేత.. రామ్ చరణ్ అని పేరు పెట్టినట్లు వెల్లడించారు. ఇప్పుడు దీనినే వారసత్వంగా తీసుకుని వరుణ్ తేజ్ కూడా తన బిడ్డకు వాయువ్ అని పేరు పెట్టినట్లు అర్థమవుతోంది.
వరుణ్ తేజ్ & లావణ్య త్రిపాఠిల గురించి
నిజానికి వీరిరువురు నటీ నటులు. వరుణ్ తేజ్ ముకుంద, కంచె, లోఫర్, మిస్టర్, ఫిదా, తొలి ప్రేమ మొదలైన సినిమాల్లో హీరోగా నటించాడు. లావణ్య త్రిపాఠి విషయానికి వస్తే.. అందాల రాక్షసి సినిమాతో తెలుగు సినిమా అరంగేట్రం చేసిన ఈమె.. ఆ తరువాత దూసుకెళ్తా, భలేభలే మగాడివోయ్, శ్రీరస్తు శుభమస్తు, సోగ్గాడే చిన్నినాయన, రాధ, ఉన్నది ఒకటే జిందగీ మొదలైన సినిమాల్లో నటించింది.
మిస్టర్ సినిమా షూటింగ్ సమయంలో ఏర్పడిన పరిచయమే.. లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ మధ్య ప్రేమగా మారింది. ఆ తరువాత వీరు ఇరువురి ఇళ్లలో ఒప్పించి.. పెద్దల సమక్షంలో 2013లో ఇటలీలో పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత హైదరాబాద్ వచ్చిన తరువాత కూడా రిసెప్షన్ పెట్టుకున్నారు. ఈ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. కాగా ఇప్పుడు ఈ జంటకు కొడుకు పుట్టాడు. ఈ జంట ప్రస్తుతం అన్యోన్యంగా తమ దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తున్నారు.