సెలబ్రిటీలు లగ్జరీ కార్లు కొనుగోలు చేయడం సర్వసాధారణం అయిపోయింది. మొన్నబాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు రూ. 2 కోట్ల కంటే ఎక్కువ ఖరీదైన లెక్సస్ కారును కొనుగోలు చేశారు. ఇప్పుడు మలయాళీ నటి ఆహానా కృష్ణ జర్మన్ లగ్జరీ కారును కొనుగోలు చేసింది. ఈ కారు ధర రూ. 95 లక్షల నుంచి రూ. 1 కోటి మధ్యలో ఉందని సమాచారం.
ఆహానా కృష్ణ కొత్త కారు
మలయాళీ నటి అహానా కృష్ణ కొనుగోలు చేసిన కారు బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన ఎక్స్5. దీని ధర ఇండియన్ మార్కెట్లో రూ. 95 లక్షల నుంచి రూ. 1 కోటి (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుందని సమాచారం. ఆన్ రోడ్ ధర ఇంకా కొంచెం ఎక్కువగానే ఉంటుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా ఆమె ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేసింది.
అహానా ఇన్‌స్టా పోస్ట్
ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన కొత్త కారు ఫోటోలను షేర్ చేస్తూ.. 20 ఏళ్లు దాటి 30 ఏళ్లలోకి అడుగుపెడుతున్నాను. వయసు పెరుగుతుందని కొంత బాధగా ఉంది. అయితే పుట్టిన రోజు సందర్భంగా ఓ గిఫ్ట్ దొరికిందని అన్నారు. దీన్ని బట్టి చూస్తే ఈ కారును అహానా తన పుట్టిన రోజు (అక్టోబర్ 13) సందర్భంగా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
అంతే కాకుండా.. ఏమి చేయాలో, ఏమి చేయకూడదో ఎప్పుడూ చెబుతూ ఉండే నా తల్లిదండ్రులకు ధన్యవాదాలు. నా నిబంధనల ప్రకారం నా జీవితాన్ని అన్వేషించడానికి.. అనుభవించడానికి నన్ను అనుమతించినందుకు, స్వేచ్ఛగా జీవించడానికి అనుమతి ఇచ్చినందుకు.. ప్రతిదానికీ మీరే కారణం, అంటూ పోస్ట్ చేసింది. అయితే కారు కొనడానికంటే ముందు.. ఏ కారు కొనాలి అనే విషయంలో నటుడు దుల్కర్ సల్మాన్ సలహా ఇచ్చినట్లు, ఆ తరువాతనే అహానా ఈ బీఎండబ్ల్యూ ఎక్స్5 కారును కొనుగోలు చేసినట్లు సమాచారం.
గృహప్రవేశం అనే సీరియల్ ద్వారా బుల్లితెరపై కనిపించిన అహానా కృష్ణ.. 2014లో ఎన్‌జెన్ స్టీవ్ లోఫెజ్ అనే సినిమాతో వెండితెరపై కనిపించింది. 2025 నాన్సీ రాణి, లోక చాప్టర్-1 అనే సినిమాల్లో కనిపించింది. అయితే ప్రస్తుతం ఏ సినిమాల్లోనూ నటించడం లేదని తెలుస్తోంది. అయితే త్వరలోనే మళ్ళీ తెరమీద కనిపించే అవకాశం ఉంది.
బీఎండబ్ల్యూ ఎక్స్5 గురించి
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన బీఎండబ్ల్యూ కంపెనీ.. మార్కెట్లో సుమారు 20 నుంచి 24 మోడల్స్ విక్రయిస్తోంది. ఇందులో ఒకటి ఎక్స్5. దీని ఎక్స్-షోరూమ్ రేటు మనం ప్రారంభంలో చెప్పుకున్నట్లు సుమారు రూ. 1కోటి వరకు ఉంటుంది. ఆకట్టుకునే డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ కలిగిన ఈ కారు 3.0 లీటర్ సిక్స్ సిలిండర్ టర్బో డీజిల్, పెట్రోల్ ఇంజిన్ అనే ఎంపికలతో అందుబాటులో ఉంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ పొందుతుంది. ఇది ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం పొందుతుంది.
సుమారు 645 లీటర్ల బూట్ స్పేస్ కలిగిన బీఎండబ్ల్యూ ఎక్స్5 కారు 80 లీటర్ల ఇంధన సామర్థ్యం కలిగి ఉంటుంది. మైలేజ్ కూడా ఉత్తమాంగానే ఉంటుంది. అయితే ధర కొంత ఎక్కువగా ఉండటం చేత దీనిని ధనవంతులు మాత్రమే కొనుగోలు చేస్తుంటారు. ఈ మోడల్ కారు నటి సమంత, నటుడు ప్రభాస్ కూడా కలిగి ఉన్నట్లు సమాచారం.