సెలబ్రిటీలు తమకు నచ్చిన కార్లను ఎప్పటికప్పుడు కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే నటి మృణాళిని రవి.. ఇటీవల మహీంద్రా కంపెనీకి చెందిన లిమిటెడ్ ఎడిషన్ కొనేసింది. దీనికి సంబంధించిన ఫోటోలను, వీడియోస్ అన్నీ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. కారు కొన్న శుభ సందర్భంగా.. నటికి అభిమానులు, సన్నిహితులు శుభాకాంక్షలు చెబుతున్నారు.
మహీంద్రా స్పెషల్ ఎడిషన్
మృణాళిని రవి కొనుగోలు చేసిన మహీంద్రా కారు.. బీఈ6 బ్యాట్‌మెన్ ఎడిషన్. ఈ కారును కంపెనీ 2025 ఆగస్టులో మార్కెట్లో లాంచ్ చేసి.. కేవలం 300 యూనిట్లకు మాత్రమే పరిమితం చేసింది. కానీ దీనికి డిమాండ్ విపరీతంగా పెరగడంతో సంస్థ.. ఈ కారును 999 మందికి విక్రయించాలని నిర్ణయించుకుంది. అంతే 999 యూనిట్లను విక్రయిస్తుందన్నమాట. ఇది లిమిటెడ్ ఎడిషన్ కాబట్టి దీని ధర రూ. 27.79 లక్షలు (ఎక్స్ షోరూమ్).
చూడటానికి సాధారణ మహీంద్రా బీఈ6 మాదిరిగా కనిపించినప్పటికీ.. ఇది కాస్మొటిక్ అప్డేట్స్ పొందుతుంది. పేరుకు తగినట్లుగానే.. బ్యాట్‌మెన్ చిత్రాలను అక్కడక్కడా చూడవచ్చు. ఇది ప్రత్యేకమైన శాటిన్ బ్లాక్ కలర్ ఎంపికలో లభిస్తుంది. కాబట్టి ఇది సాదరణ మోడల్ కంటే కూడా భిన్నంగా ఉంటుంది.
ప్రత్యేకతలు
మహీంద్రా బ్యాట్‌మ్యాన్ బీఈ6 కారులో స్టీరింగ్ వీల్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, కీ ఫోబ్ వంటి ప్రదేశాల్లో ఆల్కెమీ గోల్డ్ యాక్సెంట్లతో కూడిన డార్క్ థీమ్ క్యాబిన్ ఉంటుంది. కారు లోపలి కార్నర్ భాగం.. బ్రష్డ్ గోల్డ్‌లో పూర్తి చేయబడి ఉండటం చూడవచ్చు. సీట్లు చార్‌కోల్ లెదర్, కాంట్రాస్ట్ స్టిచ్చింగ్ పొందుతాయి. లోపల కూడా బ్యాట్ లోగోలు ఉన్నాయి. రూఫ్‌లో కూడా సిగ్నేచర్ డార్క్ నైట్ ఎంబ్లెమ్ ఉంటుంది. పుడిల్ లాంప్స్ బ్యాట్ లోగోను ప్రాజెక్ట్ చేస్తాయి. మొత్తం మీద ఇది సాధారణ బీఈ6 కంటే కూడా హుందాగా ఉంటుంది.
ఇక ఫీచర్స్ విషయానికి వస్తే.. బీఈ6 టాప్ స్పెక్ వేరియంట్ ఏ ఫీచర్స్ పొందుతుందో.. బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ కూడా దాదాపు అదే ఫీచర్స్ పొందుతుంది. కాబట్టి ఇందులో 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఇంటిగ్రేటెడ్ లైటింగ్ ఎలిమెంట్స్‌తో.. ఫిక్స్‌డ్ పనోరమిక్ రూఫ్, 16 స్పీకర్ హర్మాన్ కార్డాన్ ఆడియో, లెవెల్ 2 ఏడీఏఎస్ ఫీచర్స్, 360 డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మొదలైన ఫీచర్స్ ఎన్నో ఉన్నాయి.
బ్యాటరీ వివరాలు & పరిధి (రేంజ్)
మహీంద్రా బీఈ6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్.. 76 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది ఒక పూర్తి ఛార్జితో 682 కిమీ దూరం ప్రయాణిస్తుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటారు 286 హార్స్ పవర్, 380 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. కాగా ఇది 6.7 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇది డీఫాల్ట్, రేంజ్, ఎవ్‌రిడే, రేస్ అనే నాలుగు డ్రైవింగ్ మోడ్స్ పొందుతుంది. కాబట్టి డ్రైవింగ్ చేయడానికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.
మృణాళిని రవి గురించి..
నిజానికి ఒకప్పుడు డబ్‌స్మాష్, రీల్స్, వీడియోలు చేస్తూ ఉండే మృణాళిని రవికి డైరెక్టర్ త్యాగరాజన్ కుమార్ మొదటిసారి సినిమాల్లో నటించే అవకాశం ఇచ్చారు. అలా 2019లో సూపర్ డీలక్స్ సినిమాలో.. అరంగేట్రం చేసిన మృణాళిని, ఆ తరువాత గడ్డలకొండ గణేష్, ఛాంపియన్, ఎనిమీ, కోబ్రా వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందింది. అయితే ఇప్పుడు మహీంద్రా బీఈ6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ కొనుగోలు చేసిన మొదటి నటిగా రికార్డ్ క్రియేట్ చేసింది.