Urvashi Rautela New Rolls Royce Cullinan: ప్రపంచంలో అత్యంత ఖరీదైన కారు ఏది అంటే.. రోల్స్ రాయిస్ (Rolls Royce) అని టక్కున చెప్పేస్తారు. ఖరీదు ఎక్కువ కావడం చేతనే.. ఈ కార్లను సాధారణ ప్రజలు కొనుగోలు చేయలేరు. ధనవంతులు లేదా సంపన్నులు మాత్రమే వీటిని కొనుగోలు చేస్తారు. ఇటీవల ప్రముఖ నటి ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) ఈ బ్రాండ్ కారును కొనుగోలు చేసినట్లు సమాచారం.
ఊర్వశి రౌతేలా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు.. ఇటీవల నందమూరి బాలకృష్ణ సరసన డాకు మహారాజ్ సినిమాలో కనిపించింది. ఇప్పుడు ఖరీదైన రోల్స్ రాయిస్ కలినన్ (Rolls Royce Cullinan) కారును కొనుగోలు చేసింది. ఈ కారు ధర రూ. 12 కోట్లు అని తెలుస్తోంది.
ఖరీదైన కారును కొనుగోలు చేయడంతో.. ఊర్వశి ఇప్పుడు ప్రతిష్టాత్మక ఇన్‌స్టాగ్రామ్ ఫోర్బ్స్ రిచ్ లిస్ట్‌లో స్తానం సంపాదించుకుంది. రోల్స్ రాయిస్ కారులో నుంచి బయటకు వస్తున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఇది నెట్టింట్లో ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
రోల్స్ రాయిస్ కలినన్
రోల్స్ రాయిస్ బ్రాండ్ యొక్క అధిక ప్రజాదరణ పొందిన లేదా ఎక్కువమంది ధనవంతులు ఇష్టపడి కొనుగోలు చేసిన కార్లలో కలినన్ ఒకటి. విలాసవంతమైన ఈ కారు.. చాలా సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా, అధునాతన ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇప్పటి వరకు భారతదేశంలో ఏ హీరోయిన్ కూడా ఈ కారును కొనుగోలు చేయలేదని సమాచారం. కాబట్టి ఈ కారును కొనుగోలు చేసిన మొదటి సెలబ్రిటీగా ఊర్వశి నిలిచింది.
అద్భుతమైన డిజైన్, వాహన వినియోగదారులకు అవసరమైన ఫీచర్స్ కలిగిన ఈ కారు 6.7 లీటర్ వీ12 ఇంజిన్ ద్వారా 5000 rpm వద్ద 563 Bhp పవర్ మరియు 1600 rpm వద్ద 850 Nm టార్క్ అందిస్తుంది. పనితీరు చాలా ఉత్తమంగా ఉంటుంది. ఈ కారణంగానే పలువురు రోల్స్ రాయిస్ కలినన్ కార్లను ఇష్టపడి కొనుగోలు చేస్తుంటారు.
Also Read: వరుస బ్లాక్‌బస్టర్స్.. కొత్త కారు కొనేసిన రష్మిక: ధర ఎంతో తెలుసా?
రోల్స్ రాయిస్ కలినన్ కార్లను కలిగిన ఇతరులు
నిజానికి భారతదేశంలో రోల్స్ రాయిస్ కార్లు ఎక్కువగా కలిగి ఉన్న వారు అంబానీ ఫ్యామిలీ. వీరు సుమారు 9 రోల్స్ రాయిస్ కార్లను కలిగి ఉన్నట్లు సమాచారం. ఇందులో కలినన్ మోడల్స్ కూడా ఉన్నాయి. అంబానీ ఫ్యామిలీ కాకుండా.. షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, వివేక్ ఒబెరాయ్, అల్లు అర్జున్ మరియు అమితాబ్ బచ్చన్ మొదలైనవారు ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే సెలబ్రిటీలలో కూడా ఈ కార్లను కొనుగోలు చేసినవారి సంఖ్య తక్కువే అని స్పష్టమవుతోంది.
ఊర్వశి రౌతేలా కార్ల ప్రపంచం
సాధారణంగా ఊర్వశి రౌతేలాకు కార్లంటే చాలా ఇష్టం. ఈ కారణంగానే ఎప్పటికప్పుడు ఖరీదైన కార్లను కొనుగోలు చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఈమె గ్యారేజిలో మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ (రూ. 2.2 కోట్లు), రేంజ్ రోవర్ ఎవోక్ (రూ. 62 లక్షలు), మెర్సిడెస్ బీ-క్లాస్ (రూ. 35 లక్షలు), బీఎండబ్ల్యూ 520డీ (రూ. 66 లక్షలు) మరియు ఫెరారీ 458 స్పైడర్ (రూ. 4.9 కోట్లు) ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఈ జాబితాలోకి రోల్స్ రాయిస్ కారు చేరింది.