మిత్రమా భయమేల.. డుగ్ డుగ్ బండి ధరలు తగ్గాయ్ కదా!

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ జీఎస్టీ 2.0 ప్రకటించిన తరువాత.. భారతదేశంలో దాదాపు అన్ని వాహన తయారీ సంస్థలు తమ వాహనాల ధరలను తగ్గించాయి. ప్రారంభంలో బైక్ తయారీ దిగ్గజం రాయల్ ఎన్‌ఫీల్డ్ ధరలు తగ్గే అవకాశం లేదని కొన్ని వదంతులు వెల్లడయ్యాయి. కానీ ఇప్పుడు కంపెనీ తగ్గిన ధరలను ప్రకటించింది. ఇది డుగ్ డుగ్ బండి ప్రియులకు కొంత ఉపశమనం కలిగించింది.

రూ. 22,000 వరకు తగ్గిన ధరలు

జీఎస్టీ సంస్కరణల తరువాత తగ్గిన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ధరలు 2025 సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తాయి. నిజానికి 350 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న బైకుల ధరలు కూడా సవరించనున్నట్లు సంస్థ వెల్లడించింది. అయితే ప్రస్తుతానికి 350 సీసీ బైకుల ధరలు తగ్గాయి. ఇందులో క్లాసిక్ 350, హంటర్ 350, బుల్లెట్ 350, మీటియోర్ 350 మోడల్స్ ఉన్నాయి. ఎంపిక చేసిన మోడల్స్ మీద గరిష్టంగా రూ. 22,000 తగ్గుతుంది. కాగా భవిష్యత్తులో హిమాలయన్ 450, గెరిల్లా 450, 650 సీసీ విభాగంలోని బైకుల ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది. అయితే ఎంత ధర తగ్గుతుందనే విషయాన్ని కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు.

తగ్గిన ధరలను గురించి వ్యాఖ్యానిస్తూ.. ఐషర్ మోటార్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ సీఈఓ బీ గోవిందరాజన్ మాట్లాడుతూ.. భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేటెస్ట్ జీఎస్టీ సంస్కరణలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయి. మొదటిసారి బైక్ కొనుగోలుచేసే వారికి కొంత తగ్గింపు కూడా లభిస్తుంది. జీఎస్టీ ప్రయోజనాలను మా వినియోగదారులకు అందజేస్తున్నామని ప్రకటించడం మాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.

28 శాతం నుంచి 18 శాతానికి

2025 సెప్టెంబర్ 22 నుంచి 350 సీసీ సామర్థ్యం కలిగిన మోటారు సైకిళ్లపై జీఎస్టీ 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గుతుంది. దీనివల్ల బైక్ ధరలు ఓ మోస్తరుగా తగ్గుతాయి. కాగా 350 సీసీ కంటే ఎక్కువ కెపాసిటీ ఉన్న బైక్ ధరలు పెరుగుతాయని సమాచారం. ఎంత పెరుగుతాయి?, కొంచెమైనా తగ్గే అవకాశం ఉందా?, తగ్గితే ఏ కోణంలో తగ్గుతుంది అనే విషయాలు తెలియాల్సి ఉంది.

నిజానికి భారతదేశంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులకు ఓ ప్రత్యేకమైన ఆదరణ ఉంది. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ కంపెనీ బైకులు ఒకప్పటి నుంచి వయసుతో బేధం లేకుండా.. యువకులను, పెద్దవారిని సైతం ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం 350 సీసీ, 450 సీసీ, 650 సీసీ విభాగంలో కూడా కంపెనీ బైకులను లాంచ్ చేసి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. అలంటి ఈ కంపెనీ బైకులు పేరుతాయనే విషయం.. కొత్తగా రాయల్ ఎన్‌ఫీల్డ్ కొనాలనుకున్న వారిలో ఒకింత భయాన్ని, నిరాశను కలిగింది. కానీ ఇప్పుడు కంపెనీ తగ్గిన ధరలను ప్రకటించి వారికి కొంత ఉపశమనం కలిగించింది.

జాబితాలో ఇతర కంపెనీలు

రాయల్ ఎన్‌ఫీల్డ్ మాత్రమే కాకుండా.. ఇతర టూ వీలర్ తయారీ సంస్థలు కూడా ధరలను తగ్గిస్తూ అధికారిక ప్రకటనలు చేశాయి. ఇందులో బజాజ్ ఆటో ఎంపిక చేసిన బైకుల ధరలను రూ. 20,000 వరకు తగ్గించగా.. టీవీఎస్ మోటార్ కంపెనీ గరిష్టంగా రూ. 21,718 వరకు తగ్గింపులు ప్రకటించింది. బైక్ తయారీ దారులు మాత్రమే కాకుండా.. కార్ల తయారీదారులైన హ్యుందాయ్, టయోటా, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, మెర్సిడెస్ బెంజ్, ఆడి, మినీ కంపెనీలు కూడా తగ్గిన ధరలను ఈ మధ్యకాలంలో ప్రకటించాయి. తగ్గిన ధరల కారణంగా.. వస్తున్న పండుగల (దసరా, దీపావళి) సమయంలో వాహన అమ్మకాల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని పలువురు భావిస్తున్నారు.

Leave a Comment