మార్కెట్లో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్: ధర రూ.89999 మాత్రమే!

 

దేశీయ విఫణిలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న సమయంలో.. గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీకి చెందిన ఎలక్ట్రిక్ టూ వీలర్ బ్రాండ్ ఆంపియర్.. మాగ్నస్ గ్రాండ్ పేరుతో ఓ సరికొత్త స్కూటర్ లాంచ్ చేసింది. ఈ స్కూటర్ ధర, ఫీచర్స్, రేంజ్ వంటి వివరాలు క్షుణ్ణంగా ఇక్కడ తెలుసుకుందాం.

ధర

భారతదేశంలో లాంచ్ అయిన కొత్త ఆంపియర్ మాగ్నస్ గ్రాండ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర రూ. 89,999 (ఎక్స్ షోరూమ్). దీని ధర ఇప్పటికే అమ్మకానికి ఉన్న బ్రాండ్ ఇతర స్కూటర్ల కంటే కూడా రూ. 5000 ఎక్కువ కావడం గమనార్హం. అయితే ధరకు తగిన టెక్నాలజీ ఇందులో గమనించవచ్చు.

డిజైన్ & ఫీచర్స్

మాగ్నస్ గ్రాండ్ ఎలక్ట్రిక్ స్కూటర్ చూడటానికి.. ఇప్పటికే ఆంపియర్ ఫ్యామిలిలో ఇతర స్కూటర్స్ మాదిరిగా అనిపించినప్పటికీ కొన్ని కొత్త అప్డేట్స్ గమనించవచ్చు. కాగా ఇది రెండు కొత్త కలర్ ఆప్షన్స్ (మాచా గ్రీన్, ఓషన్ బ్లూ) పొందుతుంది. పైగా ప్రయాణికుల అదనపు సౌకర్యం కోసం ఇందులో గ్రాబ్ రైల్ ఉండటం చూడవచ్చు. 22 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ కలిగి ఉన్న ఈ స్కూటర్ గ్రౌండ్ క్లియరెన్స్ పొందుతుంది. ఎల్ఈడీ హెడ్‌లైట్, ఎల్ఈడీ ఇండికేటర్స్ ఇందులో గమనించవచ్చు. మొత్తం మీద డిజైన్ చూడచక్కగా ఉందని స్పష్టమవుతోంది.

లేటెస్ట్ బ్రేకింగ్ టెక్నాలజీ, విశాలమైన సీటు, అధిక పేలోడ్ కెపాసిటీ వంటివి మాగ్నస్ గ్రాండ్ ఎలక్ట్రిక్ స్కూటర్ పొందుతుంది. సీటు కొత్త బ్రౌన్ కలర్ క్విల్టెడ్ కవర్ పొందుతుంది. ఇందులో కొత్త డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉండటం చూడవచ్చు. ఎకో, సిటీ అనే రెండు రైడింగ్ మోడ్స్ కలిగి ఉన్న ఈ స్కూటర్ యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్ కూడా పొందుతుంది. మిగిలిన ఫీచర్స్ అన్నీ కూడా ఇతర మాగ్నస్ స్కూటర్లలో ఉన్న విధంగానే ఉంటాయి.

బ్యాటరీ & రేంజ్

ఎలక్ట్రిక్ వెహికల్ అనగానే ముందుగా చెప్పుకోవాల్సింది బ్యాటరీ, రేంజ్. ఆంపియర్ మాగ్నస్ గ్రాండ్ 2.3 కిలోవాట్ లిథియం ఫెర్రస్ ఫాస్ఫేట్ బ్యాటరీ పొందుతుంది. ఇది ఒక ఫుల్ ఛార్జితో 85 కిమీ నుంచి 90 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. దీని టాప్ స్పీడ్ గంటకు 65 కిమీ కావడం గమనార్హం. కంపెనీ ఈ బ్యాటరీపై 5 సంవత్సరాలు లేదా 75000 కిమీ వారంటీ అందిస్తుంది.

మాగ్నస్ గ్రాండ్ ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు చివర్లలో డ్రమ్ బ్రేక్‌లతో 12 ఇంచెస్ స్టీల్ వీల్స్ పొందుతుంది. అంతే కాకుండా.. ఇది మెరుగైన రైడింగ్ అందించడానికి డ్యూయెల్ రియర్ షాక్ అబ్జార్బర్‌లతో పాటు టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్ పొందుతుంది. మొత్తం మీద ఇది ఉత్తమ రైడింగ్ అనుభూతిని అందిస్తుందని మాత్రం స్పష్టమవుతోంది.

మార్కెట్లోని ఇతర ఆంపియర్ స్కూటర్స్

దేశీయ మార్కెట్లో మంచి ఆదరణ పొందిన ఎలక్ట్రిక్ స్కూటర్ల జాబితాలో ఆంపియర్ స్కూటర్లు కూడా ఉన్నాయి. కంపెనీ ప్రస్తుతం భారతీయ విఫణిలో ఆంపియర్ రియో 80 (రూ. 59,900 ఎక్స్-షోరూమ్), ఆంపియర్ నెక్సస్ (రూ. 1.15 లక్షల నుంచి రూ. 1.30 లక్షల మధ్య ఎక్స్ షోరూమ్), ఆంపియర్ రియో ఎల్ఐ ప్లస్ (రూ. 59,900 ఎక్స్ షోరూమ్) వంటి స్కూటర్లు విక్రయిస్తోంది. ఇప్పుడు మాగ్నస్ గ్రాండ్ పేరుతో ఇంకో స్కూటర్ జాబితాలోకి చేరింది.

Leave a Comment