Anand Mahindra Drive Kalki 2898 AD Bujji: భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచంలోని చాలా దేశాల్లోని ప్రభాస్ ఫ్యాన్స్ త్వరలో విడుదలకానున్న కల్కి 2898 ఏడీ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. అయితే చిత్ర బృందం ఈ సినిమాను విడుదల చేయడానికి ముందే మూవీలో ఉపయోగించి ఓ ప్రత్యేకమైన వాహనం ‘బుజ్జి’ని పరిచయం చేశారు. ఇది చూడటానికి చాలా వింతగా.. ఓ అడ్వెంచర్ మూవీలో వాడే వాహనం మాదిరిగా ఉంది. ఇప్పటికే ఈ బుజ్జి వెహికల్స్ గురించి తెలుసుకున్నాం..
ఆనంద్ మహీంద్రాను కలిసిన బుజ్జి
గత కొన్ని రోజులకు ముందు ప్రభాస్.. బుజ్జి వాహనాన్ని స్వయంగా డ్రైవ్ చేస్తూ అభిమానులను ఎంతగానో అలరించారు. ఆ తరువాత అక్కినేని నాగ చైతన్య కూడా ఈ బుజ్జి వెహికల్ డ్రైవ్ చేశారు. అయితే ఇప్పుడు ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం మరియు వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా బుజ్జిని డ్రైవ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో గమనిస్తే.. ఆనంద్ మహీంద్రా రావడం, బుజ్జి వాహనంలో కూర్చోవడం మాత్రమే కాకుండా ముందుకు వెళ్లడం కూడా చూడవచ్చు. ఆ తరువాత బుజ్జి నుంచి బయటకు వచ్చిన ఆనంద్ మహీంద్రా.. మహీంద్రా కారు మరియు బుజ్జి వాహనం మధ్యలో నిలబడి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ వీడియోను కల్కి టీమ్ తమ ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేసారు. ఇందులో బుజ్జి మీట్స్.. ఆనంద్ మహీంద్రా అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో ఆనంద్ మహీంద్రా అభిమానులను మాత్రమే కాకుండా.. ప్రభాస్ అభిమానులను కూడా ఫిదా చేస్తోంది.
కల్కి 2898 ఏడీ
ప్రభాస్ ప్రధాన పాత్రలో కనిపించే కల్కి 2898 ఏడీ సినిమాలో.. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ మరియు దీపికా పదుకొనే, దిశా పఠాని వంటి వారు కూడా నటిస్తున్నారు. ఈ సినిమా తెలుగు భాషలో మాత్రమే కాకుండా.. కన్నడ, తమిళ్, మలయాళం, ఇంగ్లీష్ వంటి పలు భాషల్లో విడుదలకానుంది.
డార్లింగ్ ప్రభాస్ నటించిన ఈ సినిమా కోసం అభిమానులు ఎంతకాలంగానే వేచి చూస్తున్నారు. అయితే ఈ నెల 27 (జూన్ 27) ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదలకానుంది. అంతకంటే ముందు ఈ సినిమాలో కనిపించిన బుజ్జి కారును అభిమానులకు పరిచయం చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే ఆనంద్ మహీంద్రా చెంతకు చేరింది.
బుజ్జి ఎక్కడ తయారైందంటే?
కల్కి 2898 ఏడీ సినిమాలో కనిపించే బుజ్జి సాధారణ వాహనాల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. కాబట్టి ఇది విదేశాల్లో తయారై ఉంటుందేమో అనుకుంటే.. పొరపాటు పడ్డట్లే. ఎందుకంటే ఈ వెహికల్ చెన్నై సమీపంలోని మహీంద్రా రీసర్చ్ వ్యాలీలో తయారైంది. వెనుక గుండ్రంగా కనిపించే ఒక చక్రం, ముందు భాగంలో రెండు చక్రాలతో ఈ వాహనం అమర్చబడి ఉంటుంది. ఇది చూడగానే ఓ సైన్స్ ఫిక్షన్ సినిమాలో కనిపించే వెహికల్ మాదిరిగా ఉందనే భావన కలుగుతుంది.
చూడటానికి విచిత్రంగా కనిపించే ఈ కారు పరిమాణం పరంగా భారీగా ఉన్నట్లు చూడవచ్చు. ఈ వాహనం పొడవు 6075 మిమీ, వెడల్పు 3380 మిమీ మరియు ఎత్తు 2186 మిమీ వరకు ఉంటుంది. దీని బరువు ఏకంగా ఆరు టన్నుల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఈ వాహనంలో 47 కిలోవాట్ బ్యాటరీని ఉపయోగించారు. దీని టాప్ స్పీడ్ గంటకు 45 కిమీ/గం కావడం గమనించదగ్గ విషయం.
Don’t Miss: 1933 రోల్స్ రాయిస్‌లో కనిపించిన మహారాష్ట్ర సీఎం.. ఈ కారు గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు!
బుజ్జి వాహనంలో ఒక క్లోజింగ్ గ్లాస్ వంటి పరికరం ఉంది. ఇది చాలా దృఢంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులోని కస్టమ్ బిల్ట్ టైర్లు ఆఫ్ రోడింగ్ చేయడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ వెహికల్ పవర్ మరియు టార్క్ కూడా అద్భుతంగా ఉండటం వల్ల పనితీరు కూడా చాలా అద్భుతంగా ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ వీడియోల్లో బుజ్జి ఎలా పనిచేస్తుందో చూడవచ్చు.
ఇక ప్రభాస్ విషయానికి వస్తే.. ఇప్పటికే బాహుబలి, బాహుబలి 2 మరియు సలార్ సినిమాలతో పాన్ ఇండియా స్టార్ అయ్యారు. ఇప్పుడు ఈయన కల్కి 2898 డీ సినిమాతో మరోసారి అభిమానులను అలరించబోతున్నారు. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని సాధిస్తుందని భావిస్తున్నాము.