ఆంధ్రప్రదేశ్.. కూటమి సర్కార్ సారథ్యంలో అభివృద్ధి మార్గం వైపు నడుస్తోంది. ఒకవైపు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమదైన రీతిలో పరిపాలన చేస్తుంటే.. ఐటీ మినిస్టర్ ‘నారా లోకేష్’ కూడా కేంద్రమంత్రులను కలుసుకోవడం.. ప్రజల క్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం కావాల్సిన ఏర్పాట్లు చేయాలనీ, కావలసిన నిధులను విడుదల చేసి.. రాష్ట్రాభివృద్ధిలో మాకు తోడుగా ఉండాలని చెబుతున్నారు. ప్రజాపాలనలో పాలు పంచుకుంటున్న నారా లోకేష్‌ను తాజాగా ఓ అరుదైన గౌరవం దక్కింది.
ఆస్ట్రేలియా నుంచి ఆహ్వానం
విద్యారంగంలో కొత్త సంస్కరణలు ప్రవేశపెట్టి.. ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ ప్రారంభించిన హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్ (హెచ్ఆర్డీ) అండ్ ఐటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) మంత్రి నారా లోకేష్.. ఆస్ట్రేలియా ప్రభుత్వం నుంచి ‘స్పెషల్ విజిట్ ప్రోగ్రామ్’ (SVP)లో పాల్గొనడానికి ప్రత్యేక ఆహ్వానం అందుకున్నారు. ఈ మేరకు ఢిల్లీలోని ఆస్ట్రేలియన్ హైకమీషన్ ఫిలిప్ గ్రీన్.. మంత్రికి ఆహ్వాన లేఖను అధికారికంగా పంపించారు.
ఆంధ్రప్రదేశ్.. మానవ వనరులు, టెక్నాలజీ & ఆర్థిక రంగాలలో అభివృద్ధి సాధిస్తోందని.. దీనిని ఆస్ట్రేలియా ప్రభుత్వం అభినందిస్తూ.. అక్కడి జరగబోయే ఓ కార్యక్రమానికి లోకేష్ హాజరు కావాలని కోరింది. ఆస్ట్రేలియాలో జరిగే ఈ కార్యక్రమానికి గత 20 సంవత్సరాలుగా.. అనేకమంది భారతదేశంలోని రాజకీయ నాయకులు హాజరయ్యారు. 2001లో భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఆస్ట్రేలియాలో జరగనున్న ఈ కార్యక్రమానికి.. ప్రపంచంలోని చాలామంది రాజకీయ నాయకులు, వ్యాపార దిగ్గజాలు, విద్యా నిపుణులు హాజరవుతారు. కాబట్టి నారా లోకేష్ వీరందరిని కలుసుకోవడానికి సాధ్యమవుతుంది. ఈ పర్యటన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. పెట్టుబడులు.. ఇతర మౌలిక సదుపాయాల రంగాలకు సంబంధించిన చర్చలు కూడా సులభతరం అవుతాయని తెలుస్తోంది.
ఇప్పటికే లోకేష్ పాల్గొన్న విదేశీ కార్యక్రమాలు
నిజానికి నారా లోకేష్ ఇప్పటికే చాలా విదేశీ కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. 2018లో చైనాలో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలోని ఎంటర్‌ప్రెన్యూర్ సమ్మిట్ కార్యక్రమంలో భారత ప్రతినిధిగా ఆహ్వానం పొందారు. 2024 అక్టోబర్ 25 నుంచి.. సుమారు ఒక వారం రోజులు అమెరికాలో పర్యటించి.. మైక్రోసాఫ్ట్, టెస్లా, అమెజాన్, యాపిల్, గూగుల్ మొదలైన కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. 2025 జనవరిలో డావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్ధిక సంస్థల సమావేశంలో కూడా పాల్గొన్నారు. ఇప్పుడు తాజాగా ఆస్ట్రేలియాలో జరగబోయే కార్యక్రమానికి హాజరవుతారు.
నారా లోకేష్ రాజకీయ ప్రస్థానం ఇలా..
స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో మాస్టర్ డిగ్రీ (ఎంబీఏ) పూర్తి చేసిన నారా లోకేష్.. 2009 తరువాత తెలుగుదేశం పార్టీలో చురుగ్గా పాల్గొంటున్నారు. డిజిటల్ మీడియా, సోషల్ మీడియా వ్యూహాలను రూపొందించి.. యువతను ఆకట్టుకున్న ఈయన 2013లో పార్టీ రాజకీయ వ్యవహారాల సమన్వయ కర్తగా బాధ్యతలు స్వీకరించారు. 2017లో ఎంఎల్సీగా నియమితులయ్యారు. అదే ఏడాదిలో ఏపీ ఐటీ మంత్రిగా కేకల బాధ్యతలు చేపట్టారు. 2019 ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో ఓటమిపాలైనప్పటికీ.. 2024 ఎన్నికల్లో అదే నియోజకవర్గంలో గెలుపొందారు. ప్రస్తుతం మంత్రిగా కూడా బాధ్యతలు స్వీకరించి.. రాష్ట్రాభివృద్ధికి తనదైన రీతిలో కృషి చేస్తూనే ముందుకు సాగుతున్నారు.