300కిమీ మైలేజ్ ఇచ్చే బైకుపై రూ.10000 డిస్కౌంట్స్: ఇప్పుడు కొనేద్దాం పదండి

Bajaj Freedom 125 CNG Gets Rs 10000 Price Cut: ప్రముఖ వాహన తయారీ సంస్థ ‘బజాజ్ ఆటో’ (Bajaj Auto) దేశీయ మార్కెట్లో ఫ్రీడమ్ సీఎన్‌జీ (Freedom CNG) బైక్ లాంచ్ చేసిన విషయం తెలిసిందే. కంపెనీ ఈ బైకును మార్కెట్లో లాంచ్ చేసి ఇంకా ఏడాది కూడా పూర్తి కాలేదు. అప్పుడే అద్భుతమైన డిస్కౌంట్ ప్రకటించింది. ఇప్పుడు బజాజ్ సీఎన్‌జీ బైక్ కొంటే.. ఎంత డిస్కౌంట్ లభిస్తుంది? ఈ ఆఫర్ ఎన్ని రోజులు ఉంటుందనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

గరిష్టంగా రూ.10,000 డిస్కౌంట్

బజాజ్ కంపెనీ తన ఫ్రీడమ్ సీఎన్‌జీ ధరను గరిష్టంగా రూ. 10,000 తగ్గించింది. బేస్ వేరియంట్ డ్రమ్ వేరియంట్ కొనుగోలుపై రూ. 5,000, మిడ్ స్పెక్ వేరియంట్ కొనుగోలుపై రూ. 10,000 తగ్గింపు పొందవచ్చు. అయితే టాప్ వేరియంట్ కొనుగోలుపైన ఎటువంటి డిస్కౌంట్ అందుబాటులో లేదు. తప్పకుండా కొనుగోలుదారులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.

కొత్త ధరలు

కంపెనీ అందించే డిస్కౌంట్స్ తరువాత బజాజ్ సీఎన్‌జీ బైక్ యొక్క డ్రమ్ బ్రేక్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 89997, మిడ్ స్పెక్ వేరియంట్ ధర రూ. 95002 మరియు టాప్ వేరియంట్ లేదా డిస్క్ ఎల్ఈడీ వేరియంట్ ధర రూ. 1.10 లక్షలు (ఈ ధరలో ఎటువంటి మార్పు లేదు) అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, ఢిల్లీ.

బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ బైక్ అనేది ప్రపంచ మార్కెట్లోనే.. మొట్ట మెదటి సీఎన్‌జీ బైక్. ఈ బైక్ రాక ముందు సీఎన్‌జీతో నడిచే వాహనాలుగా ఆటోలు, కార్లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఈ జాబితాలోకి బజాజ్ బైక్ కూడా చేరింది. ఈ బైక్ పెట్రోల్ మరియు సీఎన్‌జీతో నడుస్తుంది. దీనికోసం ఇందులో రెండు ఫ్యూయెల్ ట్యాంక్స్ ఉంటాయి. ఒకటి సీఎన్‌జీ ట్యాంక్ (2 కేజీల సీఎన్‌జీ కెపాసిటీ), మరొకటి పెట్రోల్ ట్యాంక్ (2 లీటర్ల కెపాసిటీ).

ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ బైక్ రెండు లీటర్ల సీఎన్‌జీతో 200 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుంది. పెట్రోల్‌తో 100 కంటే ఎక్కువ కిమీ రేంజ్ అందిస్తుంది. అంటే మొత్తం మీద బజాజ్ సీఎన్‌జీ 300 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుంది. ఈ బైకులోని 125 సీసీ ఇంజిన్ 9.7 న్యూటన్ మీటర్ టార్క్ మరియు 9.4 Bhp పవర్ అందిస్తుంది.

చూడటానికి సింపుల్ డిజైన్ కలిగి ఉన్నప్పటికీ.. బజాజ్ సీఎన్‌జీ ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. ఇవన్నీ రైడర్లకు ఉత్తమ రైడింగ్ అనుభూతిని అందిస్తాయి. ఇది దేశీయ మార్కెట్లో ప్రస్తుతం వివిధ ప్రధాన నగరాల్లో విక్రయానికి అందుబాటులో ఉంది. అంతే కాకుండా ఈ బైక్ ఇప్పటికే ఇతర దేశాలకు కూడా ఎగుమతి అయింది.

రెండు నెలల్లో 5000 మంది కొన్నారు

బజాజ్ సీఎన్‌జీ బైక్ ఇప్పటికే మంచి అమ్మకాలను పొందింది. భారతదేశంలో ప్రారంభమైన కేవలం 2 నెలల్లో (60 రోజుల్లో) 5,000 కంటే ఎక్కువ మంది దీనిని కొనుగోలు చేశారు. ప్రారంభంలో మహారాష్ట్రలో మాత్రమే సేల్స్ మొదలయ్యాయి. ఆ తరువాత దేశంలోని ఇతర నగరాలకు కూడా విస్తరించింది.

నిజానికి బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ అనేది మార్కెట్లో సరికొత్త వాహనం. ఎందుకంటే అప్పటి వరకు పెట్రోల్ మరియు ఎలక్ట్రిక్ బైకులు మాత్రమే ఉండేవి. వీటిని ఉపయోగించడానికి ఎక్కువ ఆసక్తి చూపే ప్రజలు.. ఒక్కసారిగా ఈ సీఎన్‌జీ బైకుల కొనుగోలుకు తక్కువ ఆసక్తి కనపరుస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా దేశంలో పెట్రోల్ బంకులు ఉన్నంత ఎక్కువగా.. సీఎన్‌జీ స్టేషన్స్ లేదు. ఇది కూడా అమ్మకాలు తగ్గడానికి ప్రధాన కారణం.

సీఎన్‌జీ బైక్ సేల్స్ పెరగాలంటే..

ఇప్పటికి మార్కెట్లో కేవలం ఒక్క సీఎన్‌జీ బైక్ మాత్రమే అందుబాటులో ఉంది. అయితే టీవీఎస్ కంపెనీ కూడా సీఎన్‌జీ బైకును లాంచ్ చేయడానికి యోచిస్తున్నట్లు సమాచారం. ఎప్పుడు లాంచ్ అవుతుంది అనేదానికి సంబంధించిన అధికారిక సమాచారం అందుబాటులో లేదు. అంతే కాకూండా బజాజ్ ఆటో 2025లో సరసమైన మరో సీఎన్‌జీ బైక్ లాంచ్ చేసే అవకాశం ఉంది. ద్విచక్ర వాహన తయారీ సంస్థలన్నీ కూడా సీఎన్‌జీ బైకులను లాంచ్ చేయడం మొదలుపెడితే.. సీఎన్‌జీ స్టేషన్స్ సంఖ్య కూడా పెరుగుతుంది. దీంతో సీఎన్‌జీ బైక్ వినియోగించేవారి సంఖ్య కూడా పెరుగుతుంది.

Leave a Comment