కొత్త కలర్ ‘బుల్లెట్ 350’ బైక్: ఫిదా అవుతున్న ఫ్యాన్స్

Battalion Black Royal Enfield Bullet 350 Bike Launched: ఇండియన్ మార్కెట్లో తిరుగులేని అమ్మకాలను పొందుతూ.. యువకుల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరికి ఆకర్శించిన బైక్ బ్రాండ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield). ఈ కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త బైకులను లాంచ్ చేస్తూ బైక్ ప్రేమికులను ఆకర్షిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఇటీవల సంస్థ ఆధునిక హంగులతో కొత్త ‘బుల్లెట్ 350’ బైకును లాంచ్ చేసింది.

2024 రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 (2024 Royal Enfield Bullet 350)

ఐకానిక్ సిల్హౌట్, పెద్ద బ్యాడ్జ్, బెంజ్ సీటు, గోల్డ్ పిన్‌స్ట్రైప్ కలిగిన రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 ఇప్పడు ‘బెటాలియన్ బ్లాక్’ కలర్ స్కీమ్ పొందుతుంది. దేశీయ విఫణిలో అడుగుపెట్టిన కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 బైక్ జే సిరీస్ ఇంజిన్ కలిగి కొత్త కలర్ స్కీమ్ పొందుతుంది. ఈ బైక్ ధర రూ. 1.75 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) కావడం గమనార్హం.

అప్డేట్స్ ఏమిటంటే? (New Updates)

కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 బైక్ కలర్ ఆప్షన్ మాత్రమే కాకుండా.. స్పోక్ వీల్స్‌తో కూడిన క్రోమ్ రిమ్స్ పొందుతుంది. సైడ్ ప్యానెల్స్‌పైన పెద్దగా కనిపించే బ్రాండ్ బ్యాడ్జ్‌లు చూడవచ్చు. అయితే వెనుక భాగంలో ఉన్న టెయిల్ లాంప్ మాత్రం స్టాండర్డ్ బైకులో ఉన్నట్లుగానే కనిపిస్తుంది.

ఇంజిన్ (Engine)

బుల్లెట్ 350 కొత్త హంగులను పొందినప్పటికీ.. అదే 349 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 6100 ఆర్‌పీఎమ్ వద్ద 20.2 హార్స్ పవర్, 4000 ఆర్‌పీఎమ్ వద్ద 27 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ అదే 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

కొత్త బుల్లెట్ 350 బెటాలియన్ బ్లాక్ వేరియంట్ సింగిల్ ఛానల్ ఏబీఎస్ కలిగి 300 మిమీ ఫ్రంట్ డిస్క్ బ్రేక్, 153 మిమీ రియర్ డ్రమ్ బ్రేక్ పొందుతుంది. ఇవన్నీ రైడింగ్ సమయంలో చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. మంచి రైడింగ్ అనుభూతిని పొందవచ్చు. ఈ లేటెస్ట్ బైక్ మార్కెట్లో హోండా సీబీ350, జావా 350 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. ఎంతమంది ప్రత్యర్థులున్నా.. బుల్లెట్ 350కు మార్కెట్లో మంచి క్రేజు ఉంది. కాబట్టి ఇది తప్పకుండా మార్కెట్లో గొప్ప అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నాము.

రాయల్ ఎన్‌ఫీల్డ్ చరిత్ర (Royal Enfield History)

ప్రస్తుతం భారతదేశంలో గణనీయమైన అమ్మకాలు పొందుతూ దూసుకెళ్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈ రోజు మైదలైంది కాదు. నవంబర్ 1891లో ప్రారంభమైన ఈ బ్రాండ్ క్రమంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. 1914లో మొదటి సారి 2 స్ట్రోక్ బైక్ ఉత్పత్తి చేసింది. ఆ తరువాత 1925లో 18 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రెడ్దిచ్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.

1932లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బులెట్ మోటార్ సైకిల్ పుట్టింది. ఇది లండన్‌లోని ఒలంపియా మోటార్‌సైకిల షోలో ప్రదర్శనకు వచ్చింది. ఆ తరువాత ఇందులో మూడు వెర్షన్లు అవతరించాయి. 1936లో 4 వాల్వ్ సిలిండర్ వచ్చింది.

ఆ తరువాత 1939 నుంచి 1945 వరకు రెండవ ప్రపంచ యుద్ధ సమాయుకంలో సైనికులకు మోటార్ సైకిల్స్, జనరేటలు, యాంట్ ఎయిర్‌క్రాఫ్ట్ గన్ ప్రిడిక్టర్లను ఉత్పత్తి చేసి అందించింది. అప్పట్లో అందుబాటులోకి వచ్చిన ప్రసిద్ద మోడల్ 125 సీసీ ఎయిర్‌బోర్న్. 2009లో 500 సీసీ ఇంజిన్ పుట్టుకొచ్చింది. 2021 నాటికి కంపెనీ ఏకంగా 120 ఏళ్ళు పూర్తి చేసుకుంది.

Don’t Miss: నెంబర్ ప్లేట్ కోసం రూ.7.85 లక్షలు చెల్లించిన మహిళ: ఎవరో తెలుసా?

మార్కెట్లో ప్రస్తుతం విక్రయానికి ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులు (Royal Enfield Bikes in India)

ప్రస్తుతం భారతీయ మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ 10 కంటే ఎక్కువ బైకులను విక్రయిస్తోంది. ఇందులో బుల్లెట్, క్లాసిక్, షాట్‌గన్, హిమాలయన్, కాంటినెంటల్ జీటీ, మీటియోర్, ఇంటర్‌సెప్టర్, సూపర్ మీటియోర్, స్క్రామ్ 411 మరియు హంటర్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా మార్కెట్లో అత్యుత్తమ అమ్మకాలను పొందతూ ముందుకు సాగుతున్నాయి. కంపెనీ రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త బైకులను లాంచ్ చేసే దిశగా అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు రాబోయే రోజుల్లో అధికారికంగా విడుదలవుతాయి.