ఒక్క నెలలో లక్షల మందిని ఆకట్టుకున్న బ్రాండ్.. అమ్మకాల్లో ‘హీరో’

భారతదేశంలో వాహనాల అమ్మకాలు కొన్ని సందర్భాల్లో మాత్రమే కొంత డీలా పడతాయి. పండుగ సీజన్ వచ్చిందంటే సేల్స్ తారాజువ్వలా పైకి లేస్తాయి. దసరా, దీపావళి ముందు ఉన్నాయి. ఈ సమయంలో వెహికల్స్ సేల్స్ ఊపందుకునే అవకాశం ఉంది. కాగా 2025 ఆగస్టు నెలలో టూ వీలర్ సేల్స్ ఎలా ఉన్నాయి. ఏ కంపెనీ జాబితాలో అగ్రస్థానంలో ఉందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

హీరో మోటోకార్ప్

2025 ఆగస్టు నెలలో హీరో మోటోకార్ప్ 5,19,139 యూనిట్ల అమ్మకాలను పొందింది. దీంతో ఇది జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తూనే.. కంపెనీ మంచి అమ్మకాలను పొందగలిగింది. ఈ సేల్స్ 2025 జులై(4,12,397 యూనిట్లు)తో పోలిస్తే 25.90 శాతం ఎక్కువ కావడం గమనించదగ్గ విషయం. 2024 ఆగస్టు నెలలో కంపెనీ 4,92,263 యూనిట్లను విక్రయించగలిగింది. అమ్మకాలు పెరగడానికి హీరో గ్లామర్ వంటి బైకులు ఎక్కువగా దోహదపడినట్లు తెలుస్తోంది. కాగా కంపెనీ కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఈ నెలలో మరికొన్ని కొత్త బైకులను లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది.

హోండా మోటార్‌సైకిల్

గత నెలలో (2025 ఆగస్టు) హోండా మోటార్‌సైకిల కంపెనీ అమ్మకాలు 4,81,021 యూనిట్లు. ఈ అమ్మకాలు 2025 జులై(4,66,331 యూనిట్లు)తో పోలిస్తే 3.15 శాతం ఎక్కువ. గత ఏడాది ఇదే నెలలో (2024 ఆగస్టు) కంపెనీ సేల్స్ ఏకంగా 4,91,678 యూనిట్లు. దీన్ని బట్టి చూస్తే ఈ ఏడాది ఆగస్టులో అమ్మకాలు 2.17 శాతం తగ్గినట్లు తెలుస్తోంది. కంపెనీ అమ్మకాలు పెరగడానికి షైన్ 100 డీఎక్స్, కొత్త సీబీ125 హార్నెట్ వంటివి దోహదపడ్డాయని తెలుస్తోంది.

టీవీఎస్ మోటార్

జాబితాలో మూడో స్థానంలో టీవీఎస్ మోటార్ స్థానం ఆక్రమించుకుంది. ఈ కంపెనీ 2025 ఆగస్టులో 3,68,862 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. 2025 జులైలో ఈ సేల్స్ 3,08,720 యూనిట్లు. అంటే జులై కంటే ఆగస్టులో విక్రయాలు 19.48 శాతం పెరిగాయి. 2024 ఆగస్టు (2,89,073 యూనిట్లు) అమ్మకాలతో పోలిస్తే.. ఈ ఏడాది ఆగస్టులో అమ్మకాలు 27.60 శాతం పెరిగాయని స్పష్టమవుతోంది.

టీవీఎస్ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ సేల్స్ విషయానికి వస్తే.. ఐక్యూబ్ దేశంలో గత ఐదు నెలలుగా అమ్మకాల్లో అగ్రగామిగా ఉంది. గత నెలలో దీని అమ్మకాలు 24,000 యూనిట్ల కంటే ఎక్కువని తెలుస్తోంది. ఇటీవల కంపెనీ ఆర్బిటర్ పేరుతో సరసమైన టూ వీలర్ లాంచ్ చేసింది. ఇది కూడా మంచి అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నాము.

బజాజ్ ఆటో

దేశీయ మార్కెట్లో అధిక ప్రజాదరణ పొందిన బజాజ్ ఆటో 2025 ఆగస్టులో 1,84,109 యూనిట్ల అమ్మకాలను పొందగలిగింది. బజాజ్ జులై 2025 అమ్మకాలు 1,39,279 యూనిట్లు. దీన్ని బట్టి చూస్తే కంపెనీ అమ్మకాలు జులై కంటే ఆగస్టులో 32.19 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. 2024 ఆగస్టులో కంపెనీ అమ్మకాలు 2,08,621 యూనిట్లతో పోలిస్తే.. 2025 ఆగస్టు అమ్మకాలు 11.75 శాతం తక్కువ. కంపెనీ మొత్తం విక్రయాలలో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఉంది. ఇది ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో మంచి అమ్మకాలు పొందుతున్న స్కూటర్ల జాబితాలో ఒకటిగా ఉంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్

అమ్మకాల్లో అగ్రగాములుగా ఉన్న టూ వీలర్ బ్రాండ్స్ జాబితాలో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఒకటి. ఈ కంపెనీ 2025 ఆగస్టు నెలలో 1,02,876 యూనిట్ల అమ్మకాలను కైవసం చేసుకుంది. 2025 జులైలో ఈ సేల్స్ 76254 యూనిట్లు. అంటే కంపెనీ సేల్స్ ఒక్కసారిగా 34.91 శాతం పెరిగాయి. 2024 ఆగస్టు నెలలో దీని విక్రయాలు 65624 యూనిట్లు మాత్రమే. ఈ లెక్కన గత ఆగస్టులో సేల్స్ 56.77 శాతం పెరిగినట్లు అవగతం అవుతోంది.

Leave a Comment