భారతదేశంలో అత్యంత ఖరీదైన బైకుల జాబితాలో.. బీఎండబ్ల్యూ మోటోరాడ్ కంపెనీకి చెందిన బైకులు ఉన్నాయి. అయితే ఒక ప్రముఖ వ్యక్తి చేసిన ఒకే ఒక్క సంతకం.. ఈ బ్రాండుకు సంబంధించిన ఒక బైకు రేటును అమాంతం పెంచేసింది. ఇంతకీ ఆ ప్రముఖ వ్యక్తి ఎవరు?, ఆ బైక్ సాధారణ ధర ఎంత అనే వివరాలు క్షుణ్ణంగా.. ఈ కథనంలో చూసేద్దాం.
పోప్ లియో XIV సంతకం
క్రైస్తవ మత గురువు.. రోమన్ క్యాథలిక్ చర్చ్ అధినేత పోప్ లియో XIV.. 2025 సెప్టెంబర్‌లో బీఎండబ్ల్యూ మోటోరాడ్ ఆర్18 ట్రాన్స్ కాంటినెంటల్ మోటార్‌సైకిల్‌పై సంతకం చేశారు. ఈ సంతకం చేసిన బైకును జర్మనీలోని మ్యూనిచ్‌లో ఆర్ఎమ్ సోథెబీస్ నిర్వహించిన వేలంలో ఏకంగా 130000 యూరోలకు విక్రయించారు. భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 1.32 కోట్లు అన్నమాట. బైకు అమ్మడం ద్వారా వచ్చిన డబ్బును.. మడగాస్కర్‌లోని పిల్లల సహాయ ప్రాజెక్టులకు విరాళంగా ఇవ్వనున్నారు.
వేలంలో భారీ ధరకు విక్రయించిన.. బీఎండబ్ల్యూ ఆర్18 ట్రాన్స్ కాంటినెంటల్ బైకును ప్రత్యేకంగా కస్టమైజ్ చేశారు. దీనిని పోప్ లియో XIV సంతకం చేయించడం కోసం కంపెనీ అధినేత మైఖేల్ సోమర్ అందించారు. ఈ బైక్ ఫ్యూయెల్ ట్యాంక్ మీద ఆయన సంతకం చేశారు. ఈ కార్యక్రమానికి సెప్టెంబర్‌లో భారీ ఎత్తున ప్రజలు, అభిమానులు హాజరయ్యారు.
బీఎండబ్ల్యూ ఆర్18 ట్రాన్స్ కాంటినెంటల్
ఇండియన్ మార్కెట్లో బీఎండబ్ల్యూ ఆర్18 ట్రాన్స్ కాంటినెంటల్ బైక్ ప్రారంభ ధర రూ. 34.72 లక్షలు (ఎక్స్ షోరూమ్). కాగా పోప్ లియో XIV సంతకం చేసిన ఈ మోడల్ బైక్ ఏకంగా రూ. 1.32 కోట్లకు అమ్ముడైంది. అంటే.. సాధారణ ధరకంటే సుమారు కోటి రూపాయలు ఎక్కువన్నమాట.
ఇంజిన్ డీటెయిల్స్
బీఎండబ్ల్యూ ఆర్18 ట్రాన్స్ కాంటినెంటల్ 1802 సీసీ ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ బాక్సర్ ట్విన్ ఇంజిన్ ద్వారా.. 91 హార్స్ పవర్, 158 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ ట్రాన్స్‌మిషన్ పొందుతుంది. ఈ బైకులో.. బ్లూటూత్ కనెక్టివిటీ మరియు న్యావిగేషన్ వంటి వాటితో కూడిన 10.25 ఇంచెస్ టీఎఫ్‌టీ కలర్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది బైక్ స్పీడ్, ఫ్యూయెల్ స్టేటస్ వంటి వాటిని ప్రదర్శిస్తుంది.
ఆర్18 ట్రాన్స్ కాంటినెంటల్ బైకులో.. బీఎండబ్ల్యూ మోటోరాడ్ డైనమిక్ క్రూయిజ్ కంట్రోల్, కార్నరింగ్ హెడ్‌లైట్స్, కీలెస్ ఇగ్నిషన్, స్టెబిలిటీ కంట్రోల్ వంటి వాటితో పాటు రాక్, రోల్ అనే రైడింగ్ మోడ్స్ కూడా అందిస్తుంది. దీని టాప్ స్పీడ్ 180 కిమీ/గం అని తెలుస్తోంది. కాగా పనితీరు విషయంలో అత్యద్భుతంగా ఉంటుంది. సాధారణంగానే ఈ బైక్ ధర కొంత ఎక్కువ కాబట్టి.. ఈ బైక్ సేల్స్ కొంత తక్కువగానే ఉంటాయి.
ఇండియన్ మార్కెట్లోని బీఎండబ్ల్యూ బైకులు
భారతదేశంలో బీఎండబ్ల్యూ మోటోరాడ్ సుమారు 14 మోడల్ బైకులను విక్రయిస్తోంది. అవి బీఎండబ్ల్యూ జీ 310 ఆర్, జీ 310 జీఎస్, జీ 310 ఆర్ఆర్, ఎఫ్ 900 ఆర్, ఎఫ్ 900 ఎక్స్ఆర్, ఎఫ్ 900 జీఎస్, ఎఫ్ 900 జీఎస్ అడ్వెంచర్, ఎస్ 1000 ఆర్, ఎస్ 1000 ఆర్ఆర్, ఏం 1000 ఎక్స్ఆర్, ఆర్ 12, ఆర్ 1300 జీఎస్, ఆర్ 1300 జీఎస్ అడ్వెంచర్, సీఈ 04. వీటి ఎక్స్ షోరూమ్ ధరలు చాలా ఎక్కువ.