21.7 C
Hyderabad
Friday, April 4, 2025

ఈ కారు కొనాలంటే అదృష్టం కూడా ఉండాల్సిందే!.. ఎందుకో తెలుసా?

BMW XM Label Launched: లగ్జరీ కార్లంటే అందరికి గుర్తొచ్చేది మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి బ్రాండ్స్. ఈ కంపెనీలన్నీ కూడా ఇండియన్ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త కార్లను లాంచ్ చేస్తూ ఉన్నాయి. ఇందులో భాగంగానే బీఎండబ్ల్యూ మరో ఖరీదైన కారును భారతీయ విఫణిలో అధికారికంగా లాంచ్ చేసింది. దీని పేరు ‘బీఎండబ్ల్యూ ఎక్స్ఎమ్ లేబుల్’ (BMW XM Label). ఇది లిమిటెడ్ ఎడిషన్. ఈ కొత్త కారు గురించి పూర్తి వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

ధర

భారతీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త బీఎండబ్ల్యూ ఎక్స్ఎమ్ లేబుల్ కారు ధర రూ. 3.15 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఇది బ్రాండ్ యొక్క ఎమ్ విభాగంలో విడుదలైన అత్యంత శక్తివంతమైన కారు. ఈ కారు మెకానికల్ అప్డేట్స్ మాత్రమే కాకుండా లోపల మరియు వెలుపల రెడ్ ఎలిమెంట్ కలిగి చాలా ఆకర్షణీయంగా ఉంది. కాబట్టి ఇది స్టాండర్డ్ వేరియంట్ కంటే కూడా భిన్నంగా ఉంది.

లిమిటెడ్ ఎడిషన్

కొత్త బీఎండబ్ల్యూ ఎక్స్ఎమ్ లేబుల్ పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇది ప్రపంచ మార్కెట్లో కేవలం 500 యూనిట్లకు మాత్రమే పరిమితమైంది. అంటే ప్రపంచ మార్కెట్లో 500 మంది మాత్రమే ఈ కారును కొనుగోలు చేయగలరు. అయితే భారతదేశంలో దీనిని ఒక్కరు మాత్రమే కొనుగోలు చేయగలరు. అంటే ఇండియాకు కేవలం ఒక్క కారును మాత్రమే పరిమితం చేశారు. ఈ కారు ధర స్టాండర్డ్ మోడల్ కంటే కూడా రూ. 55 లక్షలు ఎక్కువ.

డిజైన్

బీఎండబ్ల్యూ ఎక్స్ఎమ్ లేబుల్ ఎక్కువ భాగం రెడ్ యాక్సెంట్స్ పొందుతాయి. కాబట్టి ఇది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కిడ్నీ గ్రిల్, విండో లైన్, అల్లాయ్ వీల్స్ మరియు రియర్ డిఫ్యూజర్ చుట్టూ రెడ్ కలర్ చూడవచ్చు. 22 ఇంచెస్ అల్లాయ్ వీల్స్‌తో పాటు బీఎండబ్ల్యూ ఇండివిజువల్ ప్రోజెన్ కార్బన్ బ్లాక్ పెయింట్ స్కీమ్ పొందుతుంది. హెడ్‌ల్యాంప్, టెయిల్ లాంప్ మరియు సైడ్ ప్రొఫైల్ అన్నీ కూడా సాధారణ కారులో ఉన్నట్లే ఉన్నాయి.

ఫీచర్స్

ఎక్స్ఎమ్ లేబుల్ కారు క్యాబిన్ కూడా చాలా విశాలంగా.. విలాసవంతంగా ఉంది. లోపల భాగం రెడ్ అండ్ బ్లాక్ థీమ్ పొందుతుంది. ఇందులో 14.9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, 12.3 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే మరియు హెడ్స్ అప్ డిస్‌ప్లే, మల్టీజోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి యాంబియంట్ లైటింగ్.. అడాప్టివ్ ఎమ్ సస్పెన్షన్, బెస్పోక్ సీట్ అపోల్స్ట్రే, 20 స్పీకర్ మ్యూజిక్ సిస్టం వంటివన్నీ ఉంటాయి.

ఇంజిన్ వివరాలు

బీఎండబ్ల్యూ ఎక్స్ఎమ్ లేబుల్ శక్తివంతమైన కారు. ఇది 8 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడిన 4.4 లీటర్ వీ8 ట్విన్ టర్బో హైబ్రిడ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 748 Bhp పవర్ మరియు 1000 Nm టార్క్ అందిస్తుంది. ఈ కారు గరిష్ట వేగం 250 కిమీ/గం కాగా.. గంటకు 0 నుంచి 100 కిమీ వేగవంతం (యాక్సలరేషన్) కావడానికి పట్టే సమయం 3.8 సెకన్లు మాత్రమే.

ఎందుకు బీఎండబ్ల్యూ కార్లకు అంత డిమాండ్..

నిజానికి బీఎండబ్ల్యూ కార్లకు మార్కెట్లో క్రేజు ఎక్కువ. ధర ఎక్కువగా ఉన్నప్పటికీ పారిశ్రామిక వేత్తలు, సినీ ప్రముఖులు ఎక్కువగా ఈ బ్రాండ్ బైకులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. భారతీయ కుబేరుడు ముకేశ్ అంబానీ గ్యారేజిలో కూడా బీఎండబ్ల్యూ కార్లు ఉన్నాయి, దీన్ని బట్టి చూస్తే ఈ కార్లకు ఎంత డిమాండ్ ఉందో స్పష్టంగా అర్థమవుతోంది.

Don’t Miss: కొత్త కలర్ ‘బుల్లెట్ 350’ బైక్: ఫిదా అవుతున్న ఫ్యాన్స్

మంచి డిజైన్, వాహన వినియోగదారులకు కావలసిన అన్ని ఫీచర్స్ కలిగి అద్భుతమైన పనితీరును అందిస్తుండం వల్లనే ఈ కార్లకు అధిక డిమాండ్ ఉందని తెలుస్తోంది. కంపెనీ మార్కెట్లో కొత్త కార్లను ప్రవేశపెడుతూ ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తూనే.. కొత్త కస్టమర్లను కూడా ఆకర్షిస్తోంది. అయితే ఇప్పటి వరకు లాంచ్ చేసిన కార్లు ఒక ఎత్తు అయితే.. బీఎండబ్ల్యూ యొక్క ఎక్స్ఎమ్ లేబుల్ మరో ఎత్తు. ఎందుకంటే కంపెనీ లాంచ్ చేసే కారునైనా ఎంతమందైనా కొనుగోలు చేయవచ్చు. కానీ దీనిని మాత్రం కేవలం ఒక్కరే కొనుగోలు చేయాల్సి ఉంది. అయితే ఈ కారు ఎవరికి దక్కుతుంది తెలుసుకోవాలంటే కొన్ని రోజులు వేచి చూడక తప్పదు.

admin
adminhttps://marthatelugu.com
I'm Sri, have 6 years experience as a Content Writer in all categories, I always try to give the breaking news to the Internet Users. I'm a certified Journalist and I Worked as a Journalist in one of the famous telugu channel.

సంబంధిత వార్తలు

తాజా వార్తలు