ఘీంకరించిన ఏనుగు: దేశంలోనే అతిపెద్ద బీఎస్పీ ర్యాలీ!

రేపు అక్టోబర్ తొమ్మిదో తేదీన బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) వ్యవస్థాపకులు మాన్యవర్ కాన్షిరామ్ వర్ధంతిని పురష్కరించుకుని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు మాయవతి అతిపెద్ద ర్యాలీకి పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోలో కాన్షిరామ్ స్మారక వనంలో ఈ కార్యక్రమం జరగనుంది.

ఇప్పటికే ఈ వార్తను బీఎస్పీ పార్టీ శ్రేణులు భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు దావానలంలా వ్యాపింపచేశారు. ఇందుకు యూపీలోని డెబ్భై ఐదు జిల్లాల్లో.. ఒక్కో జిల్లా నుంచి దాదాపు నలభైకి పైగా బస్సులు, వంద పైన కార్లు రానున్నట్టుగా సమాచారం. దేశం నలుమూలల నుంచి పది లక్షల జనాభాకి పైనే ఈ ర్యాలీలో పాల్గొంటారని అంచనా. ఇప్పటికే అనేక మంది నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున లక్నోకి తరలివెళ్తున్నారు. బీఎస్పీ ర్యాలీతో ఎటువంటి రాజకీయ పరిణామాలు ఏర్పడుతాయో.. అని దేశం అంతా ఇప్పుడు ఎంతో ఆసక్తిగా లక్నో వైపు చూస్తోంది.

ర్యాలీ ఉద్దేశ్యం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏకంగా నాలుగు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత బహుజన్ సమాజ్ పార్టీకి ఉంది. మూడు సార్లు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడగా, 2007లో ఎవరు ఊహించని విధంగా 206 సీట్లు సాధించి అత్యధిక మెజారిటీతో ఎవరి మద్దతులేకుండానే ప్రభుత్వాన్ని నడిపారు. అటువంటి పార్టీకి ఇప్పుడు ఆశించినంత ఫలితాలు ఎక్కడా కనిపించడంలేదు. దేశంలో కోట్లమంది కార్యకర్తలు, అభిమానులు ఉన్న అతిపెద్ద జాతీయ పార్టీకి ఇప్పుడు సరైన దిశానిర్దేశం అవసరం. ఈ ర్యాలీ.. చెల్లచెదురుగా, నిరాశలో ఉన్న బహుజనులకు ఒక నూతన ఉత్తేజాన్ని రగిలించునుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రజలందరిని ఏకతాటిపైకి తీసుకొచ్చి బీఎస్పీకి పూర్వవైభవాన్ని కల్పించాలనే మాయావతి ఒక సంకల్పాన్ని తలపెట్టారు. ఇది కేవలం పార్టీ మీటింగో.. లేకుంటే కాన్షిరామ్ వర్ధంతి సభో కాదు, అణగారిన.. అణచివేయబడిన 85% బహుజన వర్గాల రాజకీయ జీవితాలను మార్చివేసే ప్రక్రియగా చెబుతున్నారు.

ర్యాలీకి ఆటంకాలు

బీఎస్పీ మీటింగ్ వల్ల.. మిగిలిన రాజకీయ పార్టీలను కంగారు పెడుతున్నట్టు సమాచారం. ఎందుకంటే ఉత్తరప్రదేశ్‌లోని అనేక రైళ్లను రద్దు చేయడం, మిగిలిన ట్రైన్స్ రాకపోకల సమయాల్లో మార్పలు చేయడంలాంటివి అందుకు నిదర్శనమని.. పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీఎస్పీ తిరిగి పుంజుకుంటే యూపీలోనే కాదు ఇండియాలో.. అనేక చోట్ల బీజేపీ, కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ లాంటి పార్టీలకు పెద్ద సవాల్‌గా మారుతుంది. ఆ పార్టీల కోటలు బీటలుపారే అవకాశం లేకపోలేదు. ఈ పరిస్థితుల్లో ర్యాలీకి అన్ని రకాల ఆటంకాలు, ఇబ్బందులు కలిగిస్తున్నట్టు బీఎస్పీ శ్రేణులు చెబుతున్నాయి. అక్టోబర్ తొమ్మిదిన జరిగే మీటింగ్‌పైన మిగిలిన పార్టీల భవితవ్యం ఆధారపడి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు, నిపుణులు చెబుతున్నారు.

కాన్షిరాంకు ఘన నివాళి

2027 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్‌లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు ఇది ఆరంభం అని కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియా మొత్తం బీఎస్పీ పోస్టర్లు, వీడియోలు, పాటలతో ఒక ఊపు ఊపేస్తున్నారు. హ్యాష్‌ట్యాగ్ 09 ఛలో లక్నో పేరిట ట్రెండింగ్ చేస్తున్నారు. ”జై భీమ్, జై పూలే, ఓట్లు మావి.. సీట్లు మీవా ఇకపై చెల్లదు ఇకపై చెల్లదు, మేమెంతో మాకంత, జాతీ చోడో సమాజ్ జోడో” లాంటి శక్తివంతమైన స్లోగన్లతో కార్యకర్తలు ప్రచార కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటూ.. ప్రజల్లో ర్యాలీ ఆతృతను, ఆసక్తిని పెంచుతున్నారు. ఈ భారీ ర్యాలీని విజయవంతం చేసి కాన్షిరాంకు ఘనంగా బహుజన నివాళులు అర్పించదలుచుకున్నారు. బహుజన్ సమాజ్ పార్టీ ర్యాలీ ప్రభావం ఏ విధంగా ఉందో తెలియాలంటే 2027 ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే. ఈ మీటింగ్ గురించి మీరు ఏమనుకుంటున్నారో అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.