సీబీఎస్ఈ 2026 ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్!: 45 లక్షల మంది హాజరయ్యే అవకాశం

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ).. 2026లో జరగనున్న 10వ తరగతి, 12వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. ఈ ఏడాది పరీక్షల షెడ్యూల్ ఐదు నెలల ముందుగానే ప్రకటించింది. ఇది విద్యార్థులు పరీక్షలకు మరింత గట్టిగా సన్నద్ధం కావడానికి సహకరిస్తుంది.

పరీక్షల షెడ్యూల్

సీబీఎస్ఈ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. సెకండరీ స్కూల్ పరీక్ష (10వ తరగతి) 2026 ఫిబ్రవరి 17న ప్రారంభమై, 2026 మార్చి 18 వరకు జరుగుతుంది. కాగా సీనియర్ స్కూల్ సర్టిఫికేట్ పరీక్ష (12వ తరగతి) 2026 ఫిబ్రవరి 17న మొదలై.. 2026 ఏప్రిల్ 4తో ముగుస్తుంది.

10వ తరగతి, 12వ తరగతులలో సుమారు 45 లక్షల మంది విద్యార్థులు మొత్తం 204 సబ్జెక్టుల పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉందని సీబీఎస్ఈ వెల్లడించింది. ఇందులో భారతదేశం అంతటా మాత్రమే కాకుండా.. విదేశాలలో ఉన్న సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలల్లో చదువుతున్న 26 దేశాలకు చెందిన విద్యార్థులు కూడా హాజరవుతారని సీబీఎస్ఈ వెల్లడించింది.

పదిరోజుల తరువాత పేపర్ కరెక్షన్!

ఇప్పటికి విడుదలైన సమాచారం ప్రకారం.. పరీక్ష పూర్తయిన 10 రోజుల తరువాత పేపర్ కరెక్షన్ మొదలవుతుంది. ఇది 12 రోజుల్లో పూర్తవుతుందని సమాచారం. అంటే 12వ తరగతి భౌతికశాస్త్రం పరీక్ష 2026 ఫిబ్రవరి 20న జరిగితే.. కరెక్షన్ మార్చి 3న ప్రారంభమై.. మార్చి 15 నాటికి ముగుస్తుంది.

సీబీఎస్ఈ బోర్డు.. 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలను ఉదయం 10:30 గంటలకు ప్రారంభించనుంది. పరీక్షలు ఒకే షిఫ్ట్‌లో నిర్వహించనున్నట్లు కూడా సమాచారం. అయితే ప్రస్తుతం విడుదలైన షెడ్యూల్ తాత్కాలికమైనది మాత్రమే అనే సీబీఎస్ఈ వెల్లడించింది. అంటే ఈ షెడ్యూల్ తేదీలు బహుశా మళ్ళీ మారే అవకాశం ఉందని తెలుస్తోంది.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ గురించి

సీబీఎస్ఈ అనేది విద్యార్థులకు సెకండరీ, సీనియర్ సెకండరీ స్థాయి విద్యను అందించడమే లక్ష్యంగా చేసుకుని ఏర్పాటైన ఒక నేషనల్ ఎడ్యుకేషన్ బోర్డ్. ఇది 1929లో స్థాపించబడింది. దీనిని మొదట్లో బోర్డ్ ఆఫ్ హైస్కూల్ అండ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ పేరుతో పిలిచేవారు. ఆ తరువాత ‘సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్’గా మారింది.

భారతదేశంలో అందరికీ సమానమైన విద్యను అందించడం, నాణ్యమైన విద్యను ప్రోత్సహించడం మాత్రమే కాకుండా.. నైతిక విలువలను పెంపొందించడం, జాతీయత, విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించడానికి సీబీఎస్ఈ పుట్టుకొచ్చింది. విద్యారులకు అభ్యాసపరంగా.. అన్వేషణాత్మకంగా నేర్చుకునే విధానం కూడా ఇక్కడ అలవాటు అవుతుంది.

మన దేశంలో మొత్తం 27,000 కంటే ఎక్కువ స్కూల్స్ సీబీఎస్ఈకి అనుబంధంగా ఉన్నాయి. భారతదేశంలో వెలుపల అంటే.. సౌదీ అరేబియా, సింగపూర్, యూఏఈ, నేపాల్ మొదలైన దేశాల్లో కూడా సీబీఎస్ఈ కింద ఉన్న స్కూల్స్ సంఖ్య చాలానే ఉంది. కాబట్టి మొత్తం 45 లక్షలమంది 2026లో సీబీఎస్ఈ పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తే లేదా మంచి ర్యాంక్ తెచ్చుకుంటే.. మంచి కాలేజీలలో లేదా యూనివర్సిటీలలో సీటు సులభంగా వస్తుంది. తద్వారా మీ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. కాబట్టి దీనిని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు ఈ పరీక్షల కోసం గట్టిగా సిద్ధం కావాల్సి ఉంది.