Celebrities Who Contested 2024 Lok Sabha Elections: భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యాయి, ఫలితాలు కూడా వచ్చేసాయి. జరిగిన ఎన్నికల్లో కేవలం రాజకీయ అనుభవం ఉన్న ఉద్దండులు మాత్రమే కాకుండా.. పలువురు సినీ, టీవీ నేపథ్యమున్న ఎందరో.. ఎన్నికల బరిలో నిలిచారు. ఇందులో కొంత పొలిటికల్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వారు.. మొదటి సారి అదృష్టాన్ని పరిక్షిచుకోవడానికి రంగంలోకి దిగినవారు కూడా ఉన్నారు. సినీ ప్రముఖులతో పాటు క్రికెటర్లు, వ్యాపారవేత్తలు కూడా ఎన్నికల్లో నిలబడి.. మేము సైతం అంటూ చురుగ్గా ప్రచారం చేశారు. ఈ కథనంలో 2024 ఎన్నికల్లో పోటీ చేసిన సినీ నటులు, క్రికెటర్లు, వ్యాపారవేత్తలు, వారి రాజకీయ ప్రస్థానం గురించి వివరంగా తెలుసుకుందాం..
ఎన్నికల్లో నిలబడిన సినీ ప్రముఖులు
కంగనా రనౌత్ – చిత్ర సీమలో ప్రముఖ నటిగా గుర్తింపు పొందిన ‘కంగనా రనౌత్’ మొదటిసారి రాజకీయ అరంగేట్రం చేశారు. ప్రధాని మోదీకి మద్దతుగా హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి మొదటి ప్రయత్నంలోనే గెలుపును తన ఖాతాలో వేసుకున్నారు. ఈ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో నిలబడిన విక్రమాదిత్య సింగ్ ఓడిపోయారు.
అరుణ్ గోవిల్ – ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ లోక్‌సభ స్థానం నుంచి టీవీ రాముడిగా ప్రజాదరణ పొందిన ‘అరుణ్ గోవిల్’ బీజేపీ తరపున పోటీ చేశారు. ప్రత్యర్థుల కంటే ఎక్కువ ఓట్లను పొంది విజయం సాధించారు. ప్రత్యర్థులుగా ఇదే నియోజక వర్గం నుంచి బహుజన్ సమాజ్ పార్టీ నుంచి దేవవ్రత్ త్యాగి, సమాజ్ వాదీ పార్టీ నుంచి నిలబడిన సునీత వర్మ ఓటమిని చవి చూడక తప్పలేదు.
రవి కిషన్ శుక్లా – రేసుగుర్రం సినిమాలో మద్దాలి శివారెడ్డి పేరుతో బాగా ఫేమస్ అయిన నటుడు ‘రవి కిషన్’ ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ నుచి పోటీ చేసి మరోసారి గెలుపు గుర్రాలను అధిరోహించారు. ఇప్పటికే ఈయన అక్కడ సిట్టింగ్ ఎంపీ కూడా. రవికిషన్ 585834 ఓట్లను సాధించారు. ఈ ఎన్నికల్లో ప్రత్యర్థులైన కాజల్ నిషాద్ (సమాజ్ వాదీ పార్టీ), జావేద్ అష్రాఫ్ (బహుజన్ సమాజ్ పార్టీ) మొదలైనవారు ఓటమిపాలయ్యారు.
రాధిక శరత్ కుమార్ – తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ‘రాధిక’ 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరపున తమిళనాడులోని విరుధ్‌నగర్ బరిలో నిలిచి.. సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నేత మాణిక్యం టాగూర్ చేతిలో ఓడిపోయారు. ఈమెకు దివంగత నటుడు విజయకాంత్ కుమారుడు విజయ ప్రభాకర్ మద్దతు కూడా ఇచ్చారు.
నవనీత్ కౌర్ – గత ఎన్నికల్లో మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం పొందిన సినీ నటి ‘నవనీత్ కౌర్’ మళ్ళీ రెండోసారి అదే నియోజక వర్గం నుంచి పోటీ చేశారు. వాక్చాతుర్యం పట్ల సీనియర్ సభ్యులను సైతం అబ్బుర పరిచిన ఈమె.. 506540 ఓట్లను సాధించింది. కానీ తన ప్రత్యర్థి బల్వంత్ బస్వంత్ వాంఖడే చేతిలో ఓడిపోయింది.
రచనా బెనర్జీ – నటి ‘రచనా బెనర్జీ’ 2024 లోక్‌సభ ఎన్నికల్లో.. పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ నియోజక వర్గంలో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి అఖండ విజయం సాధించారు. ఇదే నియోజక వర్గం నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న లాకెట్ ఛటర్జీ సుమారు లక్ష ఓట్ల తేడాతో బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు.
హేమ మాలిని – సినీనటి హేమమాలిని మరోసారి ఉత్తర ప్రదేశ్‌లోని మథుర నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి భారీ విజయం సొంతం చేసుకున్నారు. 2014లో ఎంపీగా గెలుపొందిన ఈమె ఈసారి సుమారు 3 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచింది. సమీప ప్రత్యర్థులు కాంగ్రెస్, బహుజన్ సమాజ్ పార్టీ నేతలు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
స్మృతి ఇరానీ – కేంద్ర మంత్రి, మాజీ నటి స్మృతి ఇరానీ ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ లోక్‌సభ నియోజకవర్గం మరోసారి ఎన్నికల బరిలో నిలిచారు. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని ఓడించి స్మృతి ఇరానీ ఈ సీటును గెలుచుకున్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి కిషోర్ లాల్ చేతిలో ఓడిపోయారు.
పవన్‌సింగ్ – ప్రముఖ నటుడు, సిట్టింగ్ ఎంపీ శత్రుజ్ఞ సిన్హా.. రెండోసారి పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్ నియోజక వర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేశారు. ఈ నియోజక వర్గంలో మొదటిసారి భోజ్‌పురి గాయకుడు, నటుడు పవన్‌సింగ్ బీజేపీ తరపున పోటీ చేశారు.
మనోజ్ తివారీ – నార్త్ ఈస్ట్ ఢిల్లీ నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారీ మూడోసారి గెలుపును తన ఖాతాలో వేసుకున్నారు. పార్టీ ఏడు మంది సిట్టింగ్ ఎంపీలలో ఆరుమందిని మార్చినా.. మనోజ్ తివారీని మాత్రం కొనసాగించింది. ఈయన ఇప్పటికే 2019, 2014లో గెలిచిన మనోజ్ దాదాపు రెండు లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు.
దినేష్‌లాల్ యాదవ్ – భోజ్‌పురి సూపర్ స్టార్ ‘దినేష్‌లాల్ యాదవ్’ ఉత్తరప్రదేశ్ ఆజంఘడ్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరపున పోటీ చేశారు. 2019లో అఖిలేష్ యాదవ్ మీద పోటీ చేసి ఓడిపోయిన ఈయన 2022లో జరిగిన ఉప ఎన్నికల్లో ఎస్పీ అభ్యర్థి ధర్మేంద్ర యాదవ్ మీద గెలుపొందారు. ఇప్పుడు మళ్ళీ సమాజ్ వాదీ పార్టీ నేత ధర్మేంద్ర యాదవ్ చేతిలో పరాజయం పాలయ్యారు.
Don’t Miss: రూ.23 లక్షల కంటే ఎక్కువ ధరకు అమ్ముడైన పక్షి ఈక – ఎందుకింత స్పెషల్ తెలుసా?
విజయ్ వసంత్ – తమిళనాడులోని కన్యాకుమారి లోక్‌సభ నియోజక వర్గం నుంచి.. కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ, తమిళ నటుడు ‘విజయ్ వసంత్’ పోటీ చేశారు. ఇక్కడ సీనియర్ అభ్యర్థి 2014లో బీజేపీ తరపున గెలిచిన రాధాకృష్ణన్ కూడా పోటీ చేస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో విజయ్ వసంత్ 5.4 లక్షల కంటే ఎక్కువ ఓట్లను పొంది భారీ విజయం సొంతం చేసుకున్నారు.
వీరు మాత్రమే కాకుండా.. దీపక్ అధికారి (టీఎంసీ సిట్టింగ్ ఎంపీ), సురేష్ గోపి (కేరళ త్రిస్సూర్), మనోజ్ మిశ్రా (ఒడిశా బోలంగీర్ ), తంగర్ బచన్ (కడలూరు), కరంజీత్ అనుమోల్ (పంజాబ్‌లోని ఫరీద్‌కోట్) వంటి సెలబ్రిటీలు మాత్రమే కాకుండా.. ప్రముఖ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ (పశ్చిమ బెంగాల్‌లోని బరంపూర్), వ్యాపారవేత్తలైన నవీన్ జిందాల్ (కురుక్షేత్ర), పల్లవి డెంపో (గోవా సౌత్), ప్రవీణ్ ఖండేల్వాల్ (ఢిల్లీ చాందినీ చౌక్) వంటి వారు కూడా ఎన్నికల్లో పోటీ చేశారు.