భారత్‌లో సరికొత్త సిట్రోయెన్ బసాల్ట్ లాంచ్.. ధర ఎంతో తెలుసా?

Citroen Basalt Launched in India: భారతదేశంలో అతి తక్కువ కాలంలోనే అత్యధిక ప్రజాదరణ పొందిన ప్రముఖ ఫ్రెచ్ కార బ్రాండ్ ‘సిట్రోయెన్’ (Citroen) ఎట్టకేలకు దేశీయ మార్కెట్లో తన కొత్త కూపే ఎస్‌యూవీ ‘బసాల్ట్’ (Basalt) లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కారు దాని మునుపటి మోడల్స్ కంటే కూడా కొంత హుందాగా ఉంది.

ధర, బుకింగ్స్ & డెలివరీలు

ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త సిట్రోయెన్ బసాల్ట్ ప్రారంభ ధర రూ. 7.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). అక్టోబర్ 31 వరకు బసాల్ట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ ధర వర్తిస్తుంది. ఆ తరువాత బుక్ చేసుకున్న వారికి కొత్త ధరలు వర్తిస్తాయని సమాచారం. ఈ ధరలు ఎంత అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ ఎస్‌యూవీ డెలివరీలు సెప్టెంబర్ 2024లో మొదలయ్యే అవకాశం ఉంది.

డిజైన్

చూడటానికి ఆకర్షణీయంగా ఉన్న ‘బసాల్ట్’ యొక్క ఫ్రంట్ ఎండ్ సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్‌కు సమానంగా ఉంటుంది. కాబట్టి అదే స్టైల్ డీఆర్ఎల్, హెడ్‌ల్యాంప్ క్లస్టర్, గ్రిల్ మరియు ఫ్రంట్ ఎయిర్ ఇన్‌టేక్‌ల ప్లేస్‌మెంట్ కూడా ఉండటం గమనించవచ్చు. కూపే మాదిరిగా ఉండే ఒక రూఫ్‌లైన్ ఇందులో గమనించవచ్చు. సైడ్ ప్రొఫైల్ 16 ఇంచెస్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. రియర్ ఫ్రొఫైల్ డ్యూయెల్ టోన్ రియర్ బంపర్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ కలిగి ఉంటుంది.

ఫీచర్స్

కొత్త సిట్రోయెన్ బసాల్ట్ లోపల 10.25 ఇంచెస్ సెంట్రల్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, 7.0 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ ఏసీ వెంట్స్, 15 వాట్స్ వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే, కార్ కనెక్టెడ్ టెక్నాలజీ వంటి అనేక ఆధునిక ఫీచర్స్ ఉన్నాయి.

కలర్ ఆప్షన్స్

సిట్రోయెన్ బసాల్ట్ మొత్తం ఐదు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి పోలార్ వైట్, స్టీల్ గ్రే, ప్లాటినం గ్రే, గార్నెట్ రెడ్ మరియు కాస్మో బ్లాక్ కలర్స్. ఇందులో వైట్, రెడ్ కలర్ కార్లు బ్లాక్ రూప్ పొందుతాయి. కాబట్టి ఇవి చూడటానికి ఆకర్షణీయంగా ఉంటాయి.

పవర్‌ట్రెయిన్

ఇక సిట్రోయెన్ బసాల్ట్ యొక్క పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే.. ఇది రెండు పెట్రోల్ ఇంజన్‌లతో లభిస్తుంది. ఒకటి న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్. ఇది 81 బ్రేక్ హార్స్ పవర్ (BHP) మరియు 115 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో అందుబాటులో ఉంటుంది.

రెండో ఇంజిన్.. 1.2 లీటర్ టర్బో పెట్రోల్. ఇది 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలను పొందుతుంది. ఈ రెండు ట్రాన్స్‌మిషన్స్ 108 బీహెచ్‌పీ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. కానీ టార్క్ వేరుగా ఉంటుంది. అంటే మాన్యువల్ వెర్షన్‌లో తారక్ 195 న్యూటన్ మీటర్స్, ఆటోమాటిక్ వెర్షన్‌లో టార్క్ 210 న్యూటన్ మీటర్. కాబట్టి టార్క్ అనేది ఎంచుకునే గేర్‌బాక్స్ ఆప్షన్ మీద ఆధారపడి ఉంటుంది.

సేఫ్టీ ఫీచర్స్

ఆధునిక కాలంలో ధర, ఫీచర్స్ మాత్రమే కాకుండా సేఫ్టీ ఫీచర్స్ ఎక్కువగా ఉన్న కార్లను కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని సిట్రోయెన్ తన బసాల్ట్ కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, రియర్ పార్కింగ్ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం వంటి సేఫ్టీ ఫీచర్స్ అందించింది.

Don’t Miss: మనసు దోచేస్తున్న టీవీఎస్ ఎన్‌టార్క్ 125 కొత్త కలర్స్ – ధర ఎంతంటే?

ప్రత్యర్థులు

భారతదేశంలో లెక్కకు మించిన కార్లు విక్రయానికి ఉన్నాయి. కాబట్టి కొత్తగా లాంచ్ అయ్యే ఏ వాహనాలైనా అమ్మకాల పరంగా గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి సిట్రోయెన్ బసాల్ట్ దేశీయ విఫణిలో టాటా మోటార్స్ ఇటీవలే లాంచ్ చేసిన ‘కర్వ్’కు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. అయితే ధరల పరంగా.. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, హోండా ఎలివేట్, మారుతి గ్రాండ్ విటారా, స్కోడా కుషాక్, ఎంజీ ఆస్టర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. అయితే బసాల్ట్ ధర పైన చెప్పుకున్న అన్ని కార్ల ధరలకంటే తక్కువ.