పెట్రోల్ కార్లకంటే సీఎన్‌జీ కార్ల వినియోగం పెరగటానికి కారణం ఇదేనా! ఆసక్తికర విషయాలు!!

CNG Cars Are Safe As Petrol Engine Cars: భారతీయ మార్కెట్లో ప్రస్తుతం CNG వాహనాల వినియోగం విపరీతంగా పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణం అత్యధిక మైలేజ్ మాత్రమే కాకుండా.. సేఫ్టీకి పెద్ద పీట వేయడమే. ఈ CNG వాహనాలకు సంబంధించి దేశీయ దిగ్గజ సంస్థ టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ లిమిటెడ్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ ‘మోహన్ సావర్కర్’ (Mohan Savarkar) కొన్ని విషయాలను వెల్లడించాడు. దీనికి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

సేఫ్టీ ప్రధానం కాబట్టి సీఎన్‌జీ ట్యాంక్స్ పెట్రోల్ ట్యాంకుల కంటే చాలా పటిష్టంగా ఉంటాయి. ఈ మెరుగైన నిర్మాణమే ప్రమాదాల సమయంలో లీక్ వంటి ప్రమాదాలను తగ్గించి ప్రయాణికుల ప్రాణాలు కాపాడటంలో ఉపయోగపడుతుంది.

పెట్రోల్ లేదా డీజిల్‌తో పోలిస్తే సీఎన్‌జీ దహన ఉష్ణోగ్రతలో చాలా తేడా ఉంటుంది. కాబట్టి మంటలు లేదా జ్వలన సంభవించినప్పుడు, CNG మంటలను పట్టుకునే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో ప్రమాదం జరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

భద్రతకు ప్రాధాన్యం

సీఎన్‌జీ ఒక వాయువు కాబట్టి పెట్రోల్ వంటి ద్రవ ఇంధనాల మాదిరిగా కాకుండా లీక్ అయితే వాతావరణంలోకి త్వరగా వెదజల్లుతుంది. ఇది చెప్పుకోదగ్గ ఒక ముఖ్యమైన భద్రతా లక్షణం, ఎందుకంటే ఇది లీక్ అయినప్పుడు వెంటనే ప్రమాదానికి కారణం కాకుండా ఉంటుంది. తమ సీఎన్‌జీ వాహనాలు అత్యున్నత భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా టాటా మోటార్స్ తీసుకున్న భద్రతా చర్యలను లోతుగా పరిశీలిస్తూ, కంపెనీ భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తుందని సావర్కర్ వివరించారు.

ఏదైనా సమస్యలు గుర్తిస్తే ఆటోమేటిక్‌గా CNG సిస్టమ్‌ను మూసివేసే టెక్నాలజీని కూడా టాటా మోటార్స్ అమలులోకి తెచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఏదైనా సమస్య గుర్తిస్తే.. సంస్థ దానిని వెంటనే పరిష్కరిస్తుంది. తద్వారా ప్రమాదాలు జరిగే అవకాశం చాలా తక్కువవుతుంది.

టాటా వాహనాల్లో ఉపయోగించే సీఎన్‌జీ సిలిండర్లు కఠినమైన పరీక్షలకు గురవుతాయని.. ఇందులో భాగంగానే 240 బార్ మరియు 340 బార్‌ల తీవ్ర పీడనం వద్ద నీరు మరియు నైట్రోజన్ రెండింటితో పరీక్షించబడతాయి. ఇవి సాధారణ వినియోగంలో ఎదుర్కొనే ఒత్తిడి కంటే చాలా ఎక్కువ. ఈ కఠినమైన పరీక్ష CNG సిలిండర్ల సమగ్రతకు హామీ ఇస్తుందని సావర్కర్ పునరుద్ఘాటించారు.

గవర్నమెంట్ సపోర్ట్

భారతదేశంలో సీఎన్‌జీ సమృద్ధిగా అందుబాటులో ఉండడమే CNG వాహనాల యొక్క వినియోగానికి ప్రధాన కారణమని సావర్కర్ పేర్కొన్నాడు. అంతే కాకుండా పెట్రోల్ మరియు డీజిల్ కార్లతో పోలిస్తే సీఎన్‌జీ ధరలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. సీఎన్‌జీ కార్ల మైలేజ్ కూడా అధికంగా ఉండటం ఇక్కడ గమనించదలచిన విషయం.

సీఎన్‌జీ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ఆటో మేకర్లను ప్రోత్సహిస్తోంది. దీంతో సీఎన్‌జీ వాహనాల ఉత్పత్తి మరియు వినియోగం మునుపటికంటే ఎక్కువగా ఉంది. సిఎన్‌జి వాహనాల ఆర్థిక ప్రయోజనాల కూడా ఎక్కువగానే ఉంటాయని సావర్కర్ వెల్లడించాడు. అయితే బేస్ వేరియంట్‌లలో మాత్రమే సిఎన్‌జిని అందించే కొంతమంది తయారీదారులు, టాటా మోటార్స్ కస్టమర్లు తమ సిఎన్‌జి మోడల్‌లలో తమ పెట్రోల్ కౌంటర్‌పార్ట్‌ల మాదిరిగానే అదే ఫీచర్లను ఆస్వాదించడానికి అనుమతిస్తుంది అని సావర్కర్ పేర్కొన్నారు.

Don’t Miss: ఫిదా చేస్తున్న హోండా (Honda) కొత్త ఎలక్ట్రిక్ కార్లు – లాంచ్ ఎప్పుడో తెలుసా?

బూట్ స్పేస్ ఛాలెంజ్‌

ఇక చివరగా సీఎన్‌జీ కార్లలో ఎదుర్కోవాల్సిన ఓ చిన్న సమస్య బూట్ స్పేస్. పెట్రోల్, డీజిల్ కార్లతో పోలిస్తే సీఎన్‌జీ కార్లలో బూట్ స్పేస్ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే సీఎన్‌జీ ట్యాంక్ బూట్ స్పేస్‌లో అమర్చడం వల్ల బూట్ స్పేస్ తగ్గుతుంది. అయితే దీనిని పరిష్కరించడానికి కూడా కంపెనీ సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగానే సీఎన్‌జీ ట్యాంకుని కారు ఫ్రంట్ బంపర్‌లో ఫిక్స్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కావున రానున్న రోజుల్లో బూట్ స్పేస్ సమస్య కూడా ఉండదు.