సినీతారలు, రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు ఎప్పటిపైకప్పుడు తమకు ఇష్టమైన వాహనాలను (కార్లు & బైకులు) కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే టీమీడియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ.. తాజాగా అమెరికన్ బ్రాండ్ అయిన టెస్లా కంపెనీకి చెందిన మోడల్ వై కారును కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో వంటివి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రోహిత్ శర్మ కొత్త కారు
స్వయంగా ఆటోమొబైల్ ఔత్సాహికుడు అయిన రోహిత్ శర్మ ఇప్పటికే.. ఖరీదైన లంబోర్ఘిని ఉరుస్ ఎస్ఈ కారును ఉపయోగిస్తున్నారు. కాగా ఇప్పుడు తాజాగా టెస్లా మోడల్ వై ఎలక్ట్రిక్ కారును తన గ్యారేజిలో చేర్చారు. ఇటీవలే టెస్లా ఇండియా.. మోడల్ వై డెలివరీలను ప్రారంభించింది. దీన్నిబట్టి చూస్తే టెస్లా మోడల్ వై కొనుగోలు చేసిన ప్రముఖుల జాబితాలో రోహిత్ శర్మ ఒకరుగా నిలిచారని తెలుస్తోంది.
ప్రత్యేకమైన నెంబర్ ప్లేట్
రోహిత్ శర్మ కొనుగోలు చేసిన టెస్లా మోడల్ వై ఎలక్ట్రిక్ కారు.. క్విక్ సిల్వర్ రంగులో ఉంది. అయితే ఈ కారు డైమండ్ బ్లాక్, పెర్ల్ వైట్, అల్ట్రా రెడ్, డీప్ బ్లూ మెటాలిక్, స్టీల్త్ గ్రే వంటి రంగుల్లో కూడా లభిస్తుంది. ఇక్కడ రోహిత్ శర్మ కొనుగోలు చేసిన కారు గురించి తెలుసుకోవలసిన మరో అంశం ఏమిటంటే.. 3015 అనే రిజిస్ట్రేషన్ ప్లేట్ లేట్ నెంబర్ ప్లేట్. ఇది తన పిల్లల పుట్టిన తేదీలను సూచిస్తుంది. ”డిసెంబర్ 30వ తేదీ తన కుమార్తె పుట్టిన రోజు, నవంబర్ 15 కుమారుడి పుట్టిన రోజు”. ఈ రెండు రోజుల గుర్తుగా 3015 నెంబర్ సెలెక్ట్ చేసుకున్నారు.
టెస్లా మోడల్ వై గురించి
అమెరికా కంపెనీ అయిన టెస్లా.. ఇండియన్ మార్కెట్లో మోడల్ వై కారును లాంచ్ చేసింది. కంపెనీ దీనిని చైనా నుంచి దిగుమతి చేసి, భారతీయ విఫణిలో విక్రయిస్తుంది. ఈ కారు ప్రారంభ ధర రూ. 59.89 లక్షలు. కాగా లాంగ్ రేంజ్ వేరియంట్ ధర రూ. 67.89 లక్షలు (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్).
టెస్లా మోడల్ వై ఎలక్ట్రిక్ కారు.. రియర్ వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్ పొందుతుంది. ఇందులో సింగిల్ ఎలక్ట్రిక్ మోటారు 299 హార్స్ పవర్, 420 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. స్టాండర్డ్ వేరియంట్ లేదా బేస్ వేరియంట్ మోడల్ వై 60.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది ఒక ఫుల్ ఛార్జితో 500 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ కావు కేవలం 5.9 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం (యాక్సలరేషన్) అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 201 కిమీ కావడం గమనార్హం.
ఇక టాప్ వేరియంట్ లేదా లాంగ్ రేంజ్ రియర్ వీల్ డ్రైవ్ మోడల్ వై కారు 75 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది ఒక సింగిల్ ఛార్జితో 622 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ వేరియంట్లోని ఎలక్ట్రిక్ మోటారు 340 హార్స్ పవర్, 450 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. కాగా ఇది 5.6 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని గరిష్ట వేగం 201 కిమీ/గం. దీని బట్టి చూస్తే.. వేగంలో రెండు వేరియంట్లు సమానంగా ఉన్నాయని అర్థమవుతోంది.