నారా లోకేష్‌కు తిలక్ వర్మ స్పెషల్ గిఫ్ట్: ఎదురు చూస్తున్నా.. అన్న ఐటీ మినిష్టర్!

భారత్ – పాకిస్తాన్ ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్‌లో.. చివరి వరకు పోరాడి జట్టును విజయ తీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి తిలక్ వర్మ. పాకిస్తాన్ బౌలింగ్ దాటికి ఇండియా టీమ్ టాప్ ఆటగాళ్లంతా.. క్రికెట్ అభిమానుల కళ్ళలో నిరాశలు నింపి, ఒక్కొక్కరుగా మైదానం నుంచి నిష్క్రమిస్తున్న వేళ పాకిస్తాన్ బౌలర్లు నన్నేమీ చెయ్యలేరు అన్నట్టు ఫోర్లు, సిక్సులతో వీర బాదుడు బాదాడు. సంజు శ్యాంసన్, శివమ్ దుబేతో కలిసి మంచి పార్టనర్షిప్ స్కోర్ చేస్తూ 53 బంతుల్లో మూడు ఫోర్లు, నాలుగు సిక్సులతో 69 స్కోర్ చేశాడు. అభిషేక్ శర్మ, శుభమన్ గిల్, సూర్య కుమార్ యాదవ్ ఇలా వరుసగా అందరూ విఫలమైన అతి క్లిష్టమైన సమయంలో మ్యాచ్‌ను ఆపద్దబాంధవుడిలా ఆదుకున్నాడు. మొత్తంగా భారత్‌కు విజయాన్ని అందించాడు.

తిలక్ వర్మ స్పెషల్ గిఫ్ట్

ఈ గెలుపు సంబరాల అనంతరం తిలక్ వర్మ భారత్ – పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్‌లో.. తాను వాడినటువంటి హెడ్ క్యాప్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుమారుడు.. రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ & ఐటీ మంత్రివర్యులు నారా లోకేష్‌కు బహుమతిగా ఇచ్చారు.

ఆ క్యాప్‌పైన తిలక్ వర్మ ఈ క్రింది విధంగా రాసుకొచ్చాడు. “ప్రియమైన లోకేష్ అన్నా.. చాలా ప్రేమతో.. ఈ క్యాప్ మీ కోసమే” అని తన మసులోని భావాలను, తనలోని విజయానందాన్ని మంత్రి లోకేష్ మీద ఉన్న అభిమానాన్ని ఆ క్యాప్‌పై రాశాడు. తను రాస్తున్న ఆ దృశ్యాన్ని మొబైల్ ఫోన్‌లో వీడియో రూపంలో చిత్రీకరించారు, ఆ సమయంలో తను రాసేటప్పుడు చెప్పలేనంత హ్యాపీగా కనిపించాడు. వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసి నారా లోకేష్ పట్ల తన ప్రేమను ఈ రకంగా అందరితో పంచుకున్నాడు. ఆ గిఫ్ట్‌ను తిలక్ వరకు స్వయంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు అందిఇవ్వనున్నారు.

ఐటీ మినిష్టర్ నారా లోకేష్ స్పందన ఇలా..

తిలక్ వర్మ పోస్ట్ చేసిన ఆ వీడియోకి మంత్రి నారా లోకేష్ కూడా.. అంతే సోదర భావంతో ప్రతిస్పందించారు. నా జీవితంలో నాకు ఇది చాలా ప్రత్యేకమైన, గొప్పదైన రోజుగా మారిపోయిందని, నువ్వు ఇండియాకి తిరిగి వచ్చినప్పుడు ఆ బహుమతిని నీ చేతుల మీదుగా నేను తీసుకుంటాను అని ఆయన ట్వీట్ చేశారు. అంతే కాకుండా నువ్వు ఆ గిఫ్ట్‌ను నేరుగా నాకు ఇచ్చేటప్పుడు దాన్ని నేను తీసుకోవడానికి, ఎంతో ఉత్సహంతో ఎదురుచూస్తూ ఉంటానని చెప్పుకొచ్చారు. నారా లోకేష్ ట్వీట్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

మన తెలుగు వాడైన తిలక్ వర్మ భారత్‌ను గెలుపు బాట పట్టించినందుకు తెలుగు వాళ్లంతా కూడా గర్వంగా భావిస్తున్నారు. ఇంకా తన జీవితంలో ఎన్నో గొప్ప గొప్ప అద్భుతాలు సృష్టించాలని, మరిన్ని విజయాలను తన క్రికెట్ కెరియర్‌లో సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా నారా లోకేష్, తిలక్ వర్మల ట్వీట్స్.. వారి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని, సోదరభావాన్ని, సత్సంబందాన్ని తెలియజేస్తున్నాయి.