సినిమా రంగం అనేది పాము నిచ్చెన ఆట లాంటిది. జాగ్రత్తగా నడుచుకుంటే సక్సెస్ వరిస్తుంది, లేకుంటే.. లేనిపోని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుతం టాప్ హీరోయిన్ దీపికా పదుకొనే పరిస్థితి ఇలా అయిందేమో అనిపిస్తుంది. దీనికి కారణాలేమిటో.. ఈ కథనంలో తెలుసుకుందాం.
కల్కి 2 సినిమాకు దీపికా పదుకొనే దూరం
దీపికా పదుకొనే.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే పాన్ ఇండియా సినిమాల్లో నటించి ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. కాగా ఇప్పుడు కల్కి 2 సినిమాలో కనిపించకుండా పోయింది. కల్కి 2898 ఏడీ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు. అలాంటి సినిమా సీక్వెల్ కల్కి 2లో ఇప్పుడు దీపికా పదుకొనే లేకపోవడం కొంత విచారకరమే అయినప్పటికీ.. ఈమెను తప్పనిసరి పరిస్థితుల్లో చిత్ర బృందమే వదులుకుంది. దీనికి సంబంధించిన వైజయంతి మూవీస్ అధికారికంగా ట్వీట్ చేసింది.
నటి దీపికా పదుకొనే కల్కి 2898 ఏడీ సీక్వెల్‌లో ఉండదు. అన్ని విషయాలను జాగ్రత్తగా పరిశీలించి, ఆలోచించిన తరువాతనే ఈ నిర్ణయం తీసుకున్నాము. కల్కి 2898 ఏడీ సినిమా చేయడానికి మాతో సుదీర్ఘ ప్రయాణం చేసినప్పటికీ.. భాగస్వామ్యం కుదరలేదు. కల్కి వంటి సినిమాకు నిబద్దత చాలా అవసరం. కాగా దీపికా పదుకొనే భవిష్యత్తులో మరెన్నో సినిమాలు చేయాలనీ ఆశిస్తున్నట్లు వైజయంతీ మూవీస్ తన ఎక్స్ ఖాతాలో స్పష్టం చేసింది.
అసలు కారణాలు!
దీపికా పదుకొనేను తీసుకోకపోవడానికి అసలు కారణం రెమ్యునరేషన్ కాదు. ఎందుకంటే కల్కి 2898 ఏడీ భారీ విజయం సాధించి.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 1000 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టింది. కాబట్టి కల్కి పార్ట్ 2లో నటించడానికి దీపికా పదుకొనే ఎంత అడిగినా చిత్ర బృందం ఇవ్వడానికి తప్పకుండా సిద్ధంగా ఉంటుంది. ఇది ప్రధాన కారణం కాదని తెలుస్తోంది.
కల్కి 2 సినిమాలో తాను రోజుకి ఎనిమిది గంటలే పనిచేస్తానని చెప్పినట్లు సమాచారం. నిజానికి కల్కి వంటి సినిమా తీయడానికి చాలా రోజులు సమయం పడుతుంది. సమయాన్ని చూసుకుంటే జరిగేపని కాదు. కాబట్టి కల్కి 2 సినిమాకు దీపికా దూరమవ్వడానికి ప్రధాన కారణం ఇదే అని తెలుస్తోంది. కొన్ని ఇబ్బందికరమైన సీన్స్ చేయనని కూడా దీపికా పాడుకొనే కండిషన్స్ పెట్టినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈమె పెట్టిన కండిషన్స్ ఆమెను సినిమాలో లేకుండా చేశాయని స్పష్టమవుతోంది.
ఇలాంటి కండిషన్స్ కారణంగానే స్పిరిట్ సినిమాలో కూడా సందీప్ రెడ్డి వంగా.. దీపికా పదుకొనేను తీసుకోలేదని తెలుస్తోంది. కాగా ఇప్పుడు కల్కి సీక్వెల్ చేజారిపోయింది. లెక్కలేనన్ని బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి.. ఎంతోమంది ప్రేక్షకులను మెప్పించిన దీపికా పదుకొనే ప్రస్తుతం గొప్ప సినిమాల్లో నటించే అవకాశాన్ని చేజేతులా దూరం చేసుకుంటింది. ఇది ఇలాగే కొనసాగితే.. ముందు ముందు భారీ ప్రాజెక్టులలో దీపికా పదుకొనే నటించే అవకాశం బహుశా కోల్పోయే అవకాశం ఉందనిపిస్తోంది. ఎందుకంటే భారీ ప్రాజెక్ట్ సినిమాల కోసం నిర్మాతలు భారీగా ఖర్చు చేస్తుంటారు. అలాంటప్పుడు లేనిపోని కండిషన్స్ పెట్టడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. వీటిని దృష్టిలో ఉంచుకునే.. వారికి అనువైనవారిని ఎంచుకుంటారు.