దేవర భామ ‘జాన్వీ కపూర్’ కొత్త కారు ఇదే!.. ధర తెలిస్తే షాకవుతారు

Janhvi Kapoor Buys New Lexus Car: ప్రముఖ నటి ‘జాన్వీ కపూర్’ (Janhvi Kapoor) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె తెలుగు సినిమాల్లో ఇప్పటివరకూ నటించకపోయినా.. ఒక సెలబ్రిటీగా మాత్రమే కాకుండా.. అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా అందరికి తెలుసు. అయితే ఇప్పుడు ఈమె (జాన్వీ) దేవర (Devara) సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటిస్తోంది. ఈ సినిమా సెప్టెంబర్ 27న తెరమీదకు రానున్నట్లు సమాచారం.

ఇక అసలు విషయానికి వస్తే.. జాన్వీ కపూర్ ఇతర సెలబ్రిటీల మాదిరిగానే ఖరీదైన కార్లను ఉపయోగించడానికి ఆసక్తి చూపుతుంది. ఈ క్రమంలోనే ఇటీవల తాజాగా జపాన్ బ్రాండ్ అయిన ‘లెక్సస్’ (Lexus) కంపెనీకి చెందిన ‘ఎల్ఎమ్ 350హెచ్’ (LM 350h) కారును కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో గమనిస్తే.. సోనిక్ అగేట్ షేడ్‌లో మెరిసిపోతున్న ఓ లెక్సస్ ఎల్ఎమ్ 350హెచ్ కారు కనిపిస్తుంది. ఇది నటి జాన్వీ కపూర్‌కు చెందినదని తెలుస్తోంది. వీడియోలో కారు వెళ్లడం మాత్రమే కనిపిస్తుంది. కానీ కారులో నుంచి జాన్వీ కపూర్ కిందికి దిగటం లేదా కారులోకి ఎక్కడం వంటి సన్నివేశాలు కనించలేదు.

లెక్సస్ ఎల్ఎమ్ 350హెచ్ (Lexus LM 350h)

చాలామంది సెలబ్రిటీలకు (బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ మొదలైన) నచ్చిన కార్ల జాబితాలో ఈ లెక్సస్ ఎల్ఎమ్ 350హెచ్ కూడా ఒకటి. ఇప్పటికే రణబీర్ కపూర్, అలియా భట్ ఈ కారును కొనుగోలు చేశారు. కాగా ఇప్పుడు శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కూడా ఈ కారుకు ఓనర్ అయిపోయింది.

లెక్సస్ ఎల్ఎమ్ 350హెచ్ అనేది నిజానికి భారతీయ మార్కెట్లో అమ్ముడవుతున్న టయోటా వెల్‌ఫైర్ యొక్క లగ్జరీ వెర్షన్. దేశీయ విఫణిలో అత్యంత ఖరీదైన కార్ల జాబితాలో ఇది కూడా ఒకటి కావడం గమనించదగ్గ విషయం. దీని ధర రూ. 2 కోట్ల నుంచి రూ. 2.5 కోట్ల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుంది.

డిజైన్ & ఫీచర్స్

లెక్సస్ ఎల్ఎమ్ 350హెచ్ యొక్క డిజైన్ చాలా హుందాగా ఉంటుంది. ఈ కారు హెక్సాగోనల్ నమూనాతో పెద్ద ఫ్రంట్ గ్రిల్ పొందుతుంది. ఇందులో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, బంపర్ మీద నిలువుగా కనిపించే ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్, ఎల్ఈడీ డీఆర్ఎల్ వంటి వాటితో పాటు.. వెనుక వైపు బ్రాండ్ లోగో మరియు టెయిల్ గేట్ దిగువన ఎల్ఎమ్ 350హెచ్ బ్యాడ్జ్ వంటివి ఉన్నాయి. రియర్ ప్రొఫైల్ మొత్తం వెడల్పు అంతటా టెయిల్ లాంప్ ఉంటుంది.

ఫీచర్స్ విషయానికి వస్తే.. ధరకు తగిన విధంగానే ఈ కారు లగ్జరీ ఫీచర్స్ పొందుతుంది. ఇది 4 సీటర్ మరియు 7 సీటర్ కాన్ఫిగరేషన్‌లలో లభిస్తుంది. అయితే జాన్వీ 4 సీటర్ మోడల్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే 7 సీటర్ కంటే కూడా 4 సీటర్ లెక్సస్ ఎల్ఎమ్ 350హెచ్ చాలా విలాసవంతంగా ఉంటుంది. ముందు మరియు వెనుక సీట్ల మధ్య గ్యాప్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది.

లెక్సస్ ఎల్ఎమ్ 350హెచ్ కారు 48 ఇంచెస్ టీవీ, ఎయిర్‌లైనన్ స్టైల్ రిక్లైనింగ్ సీట్లు, ప్రీమియం సౌండ్ ఎక్స్‌పీరియన్స్ కోసం 23 స్పీకర్స్ పొందుతుంది. అంతే కాకుండా ఫోల్డ్ అవుట్ టేబుల్స్, హీటెడ్ ఆర్మ్‌రెస్ట్‌లు, ఒట్టోమన్‌లు, వైర్‌లెస్ మొబైల్ ఛార్జర్, ఫ్రిజ్, రియర్ గ్లోవ్ బాక్సులు, డిజిటల్ రియర్ వ్యూ మిర్రర్ మొదలైనవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ప్రయాణికులకు అత్యుత్తమ ప్రయాణ అనుభూతిని అందిస్తాయి.

Don’t Miss: సమంత ఎలాంటి కార్లు ఉపయోగిస్తుందో తెలుసా?.. ఒక్కక్కటి ఇంత రేటా..

ఇంజిన్

లెక్సస్ ఎల్ఎమ్ 350హెచ్ కారు 2.5 లీటర్ 4 సిలిండర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 250 పీఎస్ పవర్ మరియు 239 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ ఈ-సీవీటీ గేర్‌బాక్స్‌తో జతచేయబడి అత్యుత్తమ పనితీరును అందిస్తుంది. ఇందులో ‘అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్ట్ సిస్టం’ (ADAS) టెక్నాలజీ కూడా ఉంటుంది. ఇది ప్రయాణికుల భద్రతకు పెద్ద పీట వేస్తుంది.