రమ్యకృష్ణ ఏడ్చేశారు.. నాకు ఇప్పటికీ గుర్తుంది: ఎస్.వి. కృష్ణారెడ్డి

ప్రతి వ్యక్తి జీవితం ఒక సినిమానే అన్నారు కొందరు మహానుభావులు. అలాంటి జీవితాలకు సినిమాల గురించి తెలియకుండా ఉంటుందా? చెప్పండి. అయితే సినిమాలు అంటే చాలామందికి ఇప్పటికీ గుర్తొచ్చే డైరెక్టర్ ఎస్.వి. కృష్ణారెడ్డి. 90లలో ఈయన తీసిన సినిమాలకు తెలుగు ప్రేక్షకులంతా ఫిదా అయ్యేవారు అంటే.. ఏ మాత్రం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.

కొబ్బరి బొండా సినిమాతో..

పశ్చిమ గోదావరి జిల్లా.. ఆరవల్లి గ్రామంలో పుట్టిన ఎస్.వి. కృష్ణారెడ్డి (సత్తి వెంకట కృష్ణారెడ్డి).. కేవలం డైరెక్టర్ మాత్రమే కాదు. రైటర్, మ్యూజిక్ డైరెక్టర్, నటుడు కూడా. విభిన్న కళలలో ప్రవేశం ఉన్న ఈయనకు చిన్నప్పటినుంచే సినిమాలంటే చాలా ఇష్టం. ఈ ఇష్టంతోనే డిగ్రీ పూర్త అవ్వగానే.. సినిమాలలో అవకాశాల కోసం మద్రాస్ వెళ్లారు. ఆ తరువాత చాలా ప్రయత్నాలు చేశారు. కొన్నాళ్ల తరువాత పగడాల పడవ అనే సినిమాలో ఈయనకు ఒక పాత్ర లభించింది. అయితే ఆ సినిమా విడుదలే కాలేదు.

కాగా 1991లో కొబ్బరి బొండా అనే సినిమాతో వెలుగులోకి వచ్చారు. ఆ తరువాత రాజేంద్రుడు – గజేంద్రుడు, మాయలోడు, యమలీల, శుభలగ్నం, మావి చిగురు, ఆహ్వానం మొదలైన ఎన్నో సినిమాలు తెరకెక్కించారు. కృష్ణారెడ్డి సినిమాలు అంటేనే.. కుటుంబ కథాచిత్రాలు అని ముద్ర పడింది. సినిమా రంగంలో త్వరగానే సక్సెస్ అందుకున్నారు కృష్ణారెడ్డి. ఈయన ఉగాది, అభిషేకం వంటి సినిమాల్లో హీరోగా కూడా నటించారు. అంతే కాకుండా.. తన సినిమాలకు తనే మ్యూజిక్ అందించారు.

కథలను మలుపుతిప్పగల దిట్ట

ఒకవైపు కామెడీ, మరోవైపు సెంటిమెంట్ సన్నివేసాలను పండించే.. ఎస్.వి. కృష్ణారెడ్డి హీరోయిన్ పాత్రలకు కూడా చాలా ప్రత్యేకత ఇచ్చేవారు. ఈయన సినిమాలు సక్సెస్ కావడానికి ఇది కూడా కారణమే. హీరోయిన్లతో కథను మలుపు తిప్పగల దిట్ట.. కృష్ణారెడ్డి. సినిమాల్లో హీరోయిన్లకు ఎంత మర్యాద ఇచ్చేవారో.. నిత్యజీవితంలో కూడా అంతే గౌరవం ఇచ్చేవారు. ఈయన మర్యాద చూసి ఒకసారి నటి రమ్యకృష్ణ కన్నీళ్లు పెట్టుకున్నట్లు కృష్ణారెడ్డి ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

కన్నీళ్లు పెట్టుకున్న రమ్యకృష్ణ

శ్రీకాంత్.. రమ్యకృష్ణ జంటగా 1997లో నటించిన ఆహ్వానం సినిమా అప్పట్లో ఒక సంచలనం సృష్టించింది. ఈ సినిమా రిలీజ్ అయిన తరువాత రమ్యకృష్ణకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ మరింత పెరిగిపోయింది. సినిమాలో ఈమె పోషించిన పాత్రకు అనేక ప్రశంసలు లభించాయి. ఈ సినిమా షూటింగ్ పూర్తయిపోయిన తరువాత.. రమ్యకృష్ణ వెళ్లిపోతున్న సమయంలో.. వెండి పళ్లెంలో పట్టుబట్టలు, రూ. 10వేలు నగదు, బొట్టుపెట్టి మరీ సంప్రదాయబద్ధంగా ఆమెను సాగనంపాను. ఈ సన్నివేశంతో రమ్యకృష్ణ కన్నీళ్లు పెట్టుకున్నారు. యూనిట్‌లో ఉన్న అందరూ కూడా భావోద్వేగానికి గురయ్యారు. ఆ సంఘటన ఇప్పటికీ మర్చిపోలేను అని కృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం హీరోయిన్లను చిన్నచూపు చూసే సినిమా ఇండస్ట్రీవారు.. తప్పకుండా ఎస్.వి. కృష్ణారెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలి.

ఎస్.వి. కృష్ణారెడ్డి సినిమాలు

1991 నుంచి 2023 వరకు సుమారు ఐదు పదులకంటే ఎక్కువ సినిమాలను తెరకెక్కించిన ఘనత ఎస్.వి. కృష్ణారెడ్డికే దక్కుతుంది. బడ్జెట్ బద్మనాభం, పెళ్ళాం ఊరెళితే, యమలీల 2, ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు వంటి ఈయన సినిమాలు అత్యంత ప్రజాదరణ పొందాయి. అయితే ప్రస్తుతం వేదవ్యాస్ అనే సినిమాతో రానున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయం అధికారికంగా వెల్లడించలేదు.