Discontinued Cars in India 2024: మీకు తెలుసా?.. ఈ ఏడాది (2024) కనుమరుగైన కార్లు ఇవే!

Discontinued Cars in India 2024: 2024 ముగియడానికి.. 2025 మొదలవ్వడానికి ఇంకెన్నో రోజులు లేదు. ఈ ఏడాది మార్కెట్లో లెక్కకు మించిన వాహనాలు (పెట్రోల్, ఎలక్ట్రిక్, సీఎన్‌జీ) లాంచ్ అయ్యాయి. కాగా.. ఈ ఏడాది కనుమరుగైన కార్లు కూడా చాలానే ఉన్నాయి. ఈ జాబితాలో ప్రధానంగా మహీంద్రా మరాజో, మినీ కూపర్ ఎస్ఈ & కంట్రీమ్యాన్, జాగ్వార్ ఐ-పేస్ మరియు హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ ఉన్నాయి.

మహీంద్రా మరాజో (Mahindra Marazzo)

2018లో ప్రారంభమైన మహీంద్రా మరాజో 2024లో అధికారిక వెబ్‌సైట్ నుంచే కనుమరుగైంది. ఈ కారుకు మార్కెట్లో ప్రజాదరణ లేకపోవడంతో.. నవంబర్ నెలలో కేవలం తొమ్మిది యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. మల్టిపుల్ వేరియంట్లలో అమ్ముడైన ఈ కారు 7 సీటర్ విభాగంలో ఒకప్పుడు.. ఓ మెరుపు మెరిసింది. దీని ప్రారంభ ధర రూ. 14.83 లక్షలు (ఎక్స్ షోరూమ్).

విశాలమైన డిజైన్ కలిగిన మహీంద్రా మరాజో.. 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 3500 rpm వద్ద 121 Bhp పవర్, 1750 – 2500 rpm వద్ద 300 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది. కాబట్టి ఇది అత్యుత్తమ పనితీరును అందిస్తుంది.

హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ (Hyindai Kona Electric)

ఒకప్పుడు ఎలక్ట్రిక్ వాహన విభాగంలో మంచి అమ్మకాలు పొందిన హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్.. 2019లో మార్కెట్లో అడుగుపెట్టింది. అప్పట్లో మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ కార్లలో ఒకటిగా నిలిచింది. అయితే ప్రస్తుతం ఈ కారు అమ్మకానికి అందుబాటులో లేదు.

ఆకర్షణీయమైన డిజైన్, ఆధునిక ఫీచర్స్ కలిగిన హ్యుందాయ్ కోనా ప్రారంభ ధర మార్కెట్లో రూ. 23.84 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది 39.2 కిలోవా బ్యాటరీ ద్వారా 452 కిమీ రేంజ్ అందించేది. ఇందులోని మోటార్ 134 Bhp, 395 Nm టార్క్ అందింస్తుంది. ప్రస్తుతం ఈ కారు భారతీయ మార్కెట్లో అమ్మకానికి లేకపోయినప్పటికీ.. ప్రపంచ మార్కెట్లో అమ్మకానికి ఉంది. కాగా కంపెనీ జనవరి 2025లో తన క్రెటా కారును ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ చేయనున్నట్లు సమాచారం.

జాగ్వార్ ఐ-ఫేస్ (Jaguar i-Pace)

ఈ ఏడాది మార్కెట్లో నిలిచిపోయిన కార్లలో జాగ్వార్ కంపెనీకి చెందిన ఐ-ఫేస్ కూడా ఒకటి. దీని ధర రూ. 1.06 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఈ ఎలక్ట్రిక్ కారు 90 కిలోవాట్ బ్యాటరీ మరియు ట్విన్ ఎలక్ట్రిక్ మోటార్లను పొందుతుంది. ఇది 394 Bhp పవర్ మరియు 695 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

జాగ్వార్ ఐ-ఫేస్ ఈవీ కేవలం 4.8 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ / గం వరకు వేగవంతం అవుతుంది. ఈ కారు టాప్ స్పీడ్ 200 కిమీ/గం కావడం గమనార్హం. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా ఉత్తమంగా ఉన్న ఈ కారు అత్యుత్తమ పనితీరును అందిస్తుంది. అయినప్పటికీ మార్కెట్లో ఈ కారు గొప్ప అమ్మకాలను పొందలేకపోయింది. ఈ కారణంగానే.. ఈ కారు అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయాయి.

Also Read: కొత్త ఏడాది.. సరికొత్త బైక్ కొనాలనుకుంటున్నారా? ఇది చూడండి

మినీ కూపర్ ఎస్ఈ మరియు కంట్రీమ్యాన్ (Mini Cooper SE and Countryman)

2024లో నిలిచిపోయిన కార్ల జాబితాలో మినీ కూపర్ ఎస్ఈ మరియు కంట్రీమ్యాన్ రెండూ ఉన్నాయి. ఎస్ఈ ఎలక్ట్రిక్ కారు 32.6 కిలోవాట్ బ్యాటరీ పొందుతుంది. ఇందులోని మోటారు 181 బీహెచ్‌పీ మరియు 270 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 7.3 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వరకు వేగవంతం అవుతుంది.

ఇక మినీ కంట్రీమ్యాన్ విషయానికి వస్తే.. 175 బీహెచ్‌పీ, 280 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కూడా కేవలం 7.5 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వరకు వేగవంతం అవుతుంది. ఇది 7 స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడుతుంది. తద్వారా మంచి పనితీరును అందిస్తుంది. మొత్తం మీద ఈ రెండు కార్ల ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. అయితే వచ్చే ఏడాది (2025)లో భారతీయ మార్కెట్లో లాంచ్ కావడానికి లెక్కకు మించిన కార్లు సిద్ధమవుతున్నాయి.

Leave a Comment