చిన్నారి పెళ్లికూతురు అనగానే అవికా గోర్ గుర్తొస్తుంది. అంతలా పాపులర్ అయిన ఈ అమ్మడు తాజాగా పెళ్లి చేసుకుంది. 2020 నుంచి ప్రేమించిన తన ప్రియుడు మిలింద్ చాంద్వానీతో ఏడడుగులు నడించింది. దీంతో అవికా గోర్ అభిమానులు మిలింద్ చాంద్వానీ ఎవరనే విషయం తెలుసుకోవడానికి నెట్టింట్లో సెర్చ్ చేస్తున్నారు.
ఎవరీ మిలింద్ చాంద్వానీ?
మిలింద్ చాంద్వానీ.. ఐఐఎం అహ్మదాబాద్ పూర్వ విద్యార్ధి. ఈయన బెంగళూరులోని దయానంద సాగర్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. కాగా ప్రస్తుతం కుకు ఎఫ్ఎమ్లో ప్రొడక్షన్ విభాగంలో అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. ఇతను గతంలో బైజూస్, ఓలా ఎలక్ట్రిక్ సంస్థల్లో కూడా పనిచేసినట్లు సమాచారం. అంతే కాకుండా ఈయన రియాలిటీ షో రోడీస్ రియల్ హీరోస్‌లో కూడా పాల్గొన్నాడు.
చదువు పూర్తయిన తరువాత సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా తన కెరియర్ ప్రారంభించిన మిలింద్.. క్యాంప్ డైరీస్ అనే ఎన్‌జీవో ఫౌండర్ కూడా. దీంతో ఇతడు సామజిక అభివృద్ధి కార్యక్రమాలపై కూడా దృష్టి సారిస్తూ.. వెనుకబడిన భారతీయ పిల్లలకు సాధికారతను కల్పిస్తున్నాడు. సోషల్ మీడియాలో కూడా బాగా ఫేమస్ అయిన మిలింద్ సోషల్ మీడియా ఫేమ్ కూడా. ఈయనకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా లక్ష కంటే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు. ఇవన్నీ చూస్తుంటే.. అవికా గోర్ భర్త ఇంత ట్యాలెంటెడ్డా అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
అవికా గోర్ లవ్‌స్టోరీ
2019లో ఒక కార్యక్రమంలో కలుసుకున్న మిలింద్.. అవికా గోర్ 2020లో డేటింగ్ ప్రారంభించారు. ఆ తరువాత ఈ ఏడాది జూన్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు. కాగా 2025 సెప్టెంబర్ 30 పెళ్లి చేసుకున్నారు. పెళ్ళికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు అన్నీ కూడా వీరిరువురూ తమ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. అభిమానులు ఈ జంటకు పెద్ద ఎత్తున శుభాకంక్షాలు చెబుతున్నారు.
అవికా గోర్ గురించి
చిన్నారి పెళ్లికూతురు సీరియల్ ద్వారా పాపులర్ అయిన.. అవికా గోర్ ఉయ్యాలా జంపాల సినిమాతో టాలీవుడ్ అరంగేట్రం చేసింది. ఆ తరువాత లక్ష్మి రావే మా ఇంటికి, సినిమా చూపిస్తా మావ, తను నేను, ఎక్కడికి పోతావు చిన్నవాడా, రాజుగారి గది 3, నెట్, బ్రో, ఉమాపతి వంటి సినిమాల్లో నటించింది. ఈమె తెలుగులో మాత్రమే కాకుండా.. కన్నడ, హిందీ సినిమాల్లో కూడా నటించింది. కాగా ఈమె మూడు ఇండియన్ అకాడమీ అవార్డులను, ఒక సైమా అవార్డును అందుకుంది.
1997 జూన్ 30న ముంబైలోని ఒక గుజరాతీ కుటుంబంలో జన్మించిన అవికా గోర్.. ముంబైలోని ములుండ్ శివారులోని షారన్ ఇంగ్లీష్ హైస్కూల్‌లో చదివింది. కాగా 2007లో హిందీ సీరియల్స్ ద్వారా టెలివిజన్ రంగానికి పరిచయమై.. ఆ తరువాత వరుస సినిమాల్లో నటిస్తూ.. తనదైన రీతిలో అభిమానులను సంపాదించుకుంది. ఇటీవల చిన్నారి పెళ్లి కూతురు నిజంగానే పెళ్లి కూతురై.. మిలింద్ చాంద్వానీని పెళ్లి చేసుకుని.. సోషల్ మీడియా ఖాతాల్లో ఫోటోలు షేర్ చేసింది. దీంతో అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతూ.. ఆశీర్వదిస్తున్నారు.