ఆత్మగౌరవం, తెగింపే ఆయన సినిమాలు: ఇప్పుడు విక్రమ్ తనయునితో..

డైరెక్టర్ మారి సెల్వరాజ్ ఆత్మగౌరవ చిత్రాలకు పెటింది పేరు. అతని సినిమాలు అన్ని కూడా మనుషుల యొక్క నిజ జీవితాలకు చాలా దగ్గరగా ఉంటాయి. అంతేకాకుండా సమాజంలో నిత్యం జరిగే అన్యాయాలు, అవమానాలు, అణచివేతలే తన సినిమాలకు కేంద్ర బిందువుగా మారుతాయి. ఆయన తీసే చిత్రాల్లోని సన్నివేశాలు నిరాశావాదంలో కూరుకుపోయిన వారిలో జీవితం పట్ల ఆశావాదాన్ని రేకెత్తిస్తాయి. మారి సెల్వరాజ్‌కు చెందిన.. ఏ మూవీ చూసినగానీ ధీనత్వంలో ఉన్న బాధితులకు తెగింపుని, ధైర్యాన్ని నింపి, వారి వారి సమస్యలపై పోరాడే తత్వాన్ని నేర్పి వాళ్ల గుండెల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతుంది. తన నిత్య జీవిత సంఘటనల ఆధారంగా రాసే చిన్న చిన్న డైలాగ్స్ మనకు ప్రేరణ కలిగిస్తాయి. ప్రతి పాత్రలో మనల్ని మనం చూసుకున్నట్టే ఉంటుంది. మనకు ఎంతో ప్రేరణ కలిగించి, మనలో స్ఫూర్తిని నింపే సృజనాత్మక దర్శక, రచయిత గురించి మరి కొన్ని వివరాలు తెలుసుకుందాం..

మారి సెల్వరాజ్ సినిమా జీవిత ప్రస్థానం..

సెల్వరాజ్ మొదట నటుడు అవ్వాలి అని తమిళ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. కానీ తరువాత తాను డైరెక్టర్ రామ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. సహాయ దర్శకుడిగా కాట్రాదు తమిళ్, తంగ మీనకల్, తారామణి వంటి సినిమాలకు పని చేశాడు. 2018లో వచ్చిన పరియేరుమ్ పెరుమాళ్ సినిమాతో పూర్తిస్థాయి దర్శకుడిగా మారాడు.

తర్వాతి కాలంలో చిత్రీకరించిన ధనుష్ కర్ణన్ . ఉదయనిధి స్టాలిన్ నటించిన మామన్నన్. వాలై ఇందులో అందరిని కొత్త నటీనటులతో తీశారు. పై అన్నీ చిత్రాలు కూడా విజయవంతమై ప్రేక్షకాదరణ పొందాయి. ప్రస్తుతం చియాన్ విక్రమ్ కుమారుడు దృవ్ విక్రమ్‌తో చేస్తున్న సినిమా బైసన్ ఈ దీపావళి కి విడుదలకు సిద్ధంగా ఉంది. డైరెక్టర్‌గానే.. కాకుండా పాటల రచయితగా, స్క్రీన్ రైటర్‌గా, సీరియల్ రైటింగ్, పుస్తక రచయితగా కూడా గుర్తింపు పొందాడు.

మారి సినిమాల్లో ఏముంది?

పరియేరుమ్ పెరుమాళ్: ఇందులో సమాజంలోని కులవ్యవస్థ అందులోని వివక్ష పట్ల ఒక చదువుకున్న యువకుడు చేసే ఎదిరించి చేసే పోరాటం కనబడుతుంది. ఆ సినిమాతో ఎన్నో అవార్డులు, ప్రశంసలతో పాటు కీర్తిప్రతిష్టలు పొందాడు.

కర్ణన్: సినిమాలో ఒక సాధారణ పల్లెటూరి పిల్లగాడు తన చుట్టూ జరిగే సమస్యలు అన్యాయాల మీద ప్రతిఘటించే విధానం మనల్ని ఆకట్టుకుంటుంది. కథానాయకుడు బాహ్య ప్రపంచానికి, అంతర్గత ప్రపంచానికి మధ్య పడే సంఘర్షణ మనల్ని గుండెల్ని పిండేలా చేస్తుంది. చట్టం, వ్యవస్థ నిన్ను కాపాడలేనప్పుడు నువ్వే నీ వాళ్ళని రక్షించుకోవాలనే వీరత్వాన్ని నేర్పిస్తుంది.

మామన్నన్ (తెలుగులో నాయకుడు): ఈ చిత్రంలో రాజకీయంలోని అధికార అహంకారం, సొసైటీలో ఉన్న వ్యత్యాసం & బానిస మనస్తత్వం పట్ల తిరగబడి పోరాడే వ్యక్తి జీవితం అందరిని ఆలోచింపజేస్తుంది. మనం నిత్యం చుట్టుపక్కల జరిగే అంశాలే వాటిని బలంగా మన చెంపపై కొట్టినట్టు ఉంటుంది. మీ బానిసత్వాన్ని పోగొట్టుకుని మహారాజుల్లా జీవించమని ఈ మూవీ బోధిస్తుంది.

వాలై: దినసరి అరటి కూలీల జీవితాలు, బాధలు మధ్యలో ఒక తెలివైన స్కూల్ విద్యార్థి భవిష్యత్తు వీటన్నిటి మధ్య అనుకోని ఒక సంఘటన ఎలా బతుకులను మార్చివేసింది అనేది అద్భుతంగా చూపించారు. తన జీవిత వాస్తవ సంఘటనలు ఆధారంగా తెరకేక్కించిన అంశాలు ప్రేక్షకులకు కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తాయి.

బైసన్: ఈ నెల 17 న దీపావళి రోజున విడుదలకు సిద్దమైంది. కబడ్డీ ఆటగాడి చుట్టూ కథాంశం అల్లుకోబడి ఉన్నట్టుగా అర్థమవుతోంది.

వ్యక్తిగత జీవితం గురించి క్లుప్తంగా..

ఈయన పూర్తి పేరు మారి సెల్వమ్ సెల్వరాజ్. తమిళనాడు లోని తిరునల్వేళిలో 1984 మార్చి 7న జన్మించారు. దివ్య అనే ఆమెతో 2016లో వివాహం అయింది, వీరికి నవ్వి (కుమార్తె ), యువ్వాన్ (కుమారుడు) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. మారి అతి సాధారణ దిగువ మధ్యతరగతి నుంచి వచ్చినవాడు. ప్రస్తుతం తన వృత్తి దర్శకుడు, రచయిత, స్క్రీన్ రైటర్, పాటల రచయితగా కొనసాగుతున్నాడు