శిరీషతో.. నారా రోహిత్ పెళ్లి: ఈమె బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?

నారావారి ఇంట పెళ్లి సందడి మొదలైపోయింది. నటుడు నారా రోహిత్.. తన ప్రేయసి శిరీష లెల్లను వచ్చే గురువారం (2025 అక్టోబర్ 30) రోజు పెళ్లిచేసుకోబోతున్నారు. ఇందులో భాగంగానే పసుపు దంచడం, హల్దీ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి నందమూరి కుటుంబం, నారా చంద్రబాబు కుటుంబం కూడా హాజరైంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కాగా కొందరు మాత్రమే ఎవరీ శిరీష?, ఆమె బ్యాగ్రౌండ్ ఏమిటనే విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.

ఎవరీ శిరీష లెల్ల?

ప్రతినిధి 2 సినిమాలో హీరోయిన్‌గా నటించిన శిరీష లెల్ల.. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలోని ఫురజాల మండలం.. దైడపాలెం అనే గ్రామానికి చెందినవారు. అయితే కొంతకాలం తరువాత ఈమె కుటుంబం రెంటచింతల ప్రాంతానికి వెళ్ళింది. మోడలింగ్ మీద ఆసక్తి ఉన్నపటికీ.. హైదరాబాద్‌లో చదువుకుని, ఆ తరువాత ఆస్ట్రేలియాలో పీజీ పూర్తిచేశారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తరువాత అక్కడే కొంతకాలం ఉద్యోగం చేసినట్లు కూడా సమాచారం. సినిమాల్లో నటించాలనే ఆసక్తి ఉండటంతో.. డైరెక్టర్ దేవగుప్త మూర్తి ఆడిషన్స్‌కు వెళ్ళింది.. ఇలా ప్రతినిధి 2 సినిమాలో నటించే అవకాశం వచ్చింది.

ప్రతినిధి 2 సినిమాలో నారా రోహిత్, శిరీష లెల్ల కలిసి నటించారు. ఆ సమయంలో వీరి మధ్య ఏర్పడిన పరిచయమే ప్రేమగా మారింది. ఆ ప్రేమ పెళ్ళికి దారి తీసింది. వీరిరువురు పెద్దలను ఒప్పించి 2024 అక్టోబర్ 14న హైదరాబాద్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు. కాగా ఆ సమయంలో పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేశారు. చెప్పినట్లుగానే త్వరలోనే మూడుముళ్ల బంధంతో ఒక్కటికానున్నారు.

రోహిత్ & శిరీష పెళ్లివేడుక

ఇప్పటికే పసుపు దంచడం, హల్దీ ఫంక్షన్ పూర్తయ్యాయి. కాగా అక్టోబర్ 28న మెహందీ, 29న సంగీత్ ఫంక్షన్ జరగనున్నాయి. అక్టోబర్ 30న మూడుముళ్లతో.. వేదమంత్రాలతో ఒక్కటి కానున్నారు. వీరి పెళ్ళికి రాజకీయ ప్రముఖులు, సినీ పరిశ్రమకు చెందిన పెద్దలు, ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.

నటుడు నారా రోహిత్ పెళ్లి వేడుకల్లో.. నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి పాల్గొన్నారు. ఇంకా నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ.. ఆయన భార్య వసుంధర మొదలైనవారు కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పెళ్ళికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా హాజరయ్యే అవకాశం ఉంది.

నారా రోహిత్ గురించి

చంద్రగిరి నియోజకవరం మాజీ శాసనసభ సభ్యులు నారా రామ్మూర్తి నాయుడు కుమారుడే.. నారా రోహిత్. చంద్రబాబు నాయుడు ఇతనికి (నారా రోహిత్) పెదనాన్న. 2009లో బాణం సినిమాతో సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నారా రోహిత్.. ఆ తరువాత సోలో సినిమాతో బాగా పాపులర్ అయ్యారు.

ఆ తరువాత ప్రతినిధి, రౌడీఫెలో, అసుర, బాలకృష్ణుడు మొదలైన సినిమాల్లో నటించారు. కాగా 2025 ఆగష్టు 27న సుందరకాండ సినిమా రిలీజ్ అయింది. నారా రోహిత్ కేవలం నటుడు మాత్రమే కాదు. ఈయన 2014లో విడుదలైన నల దమయంతి అనే సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. స్వామిరారా సినిమాకు వ్యాఖ్యాతగా కూడా పనిచేశారు. నారా రోహిత్ న్యూయార్క్ ఫిలిం అకాడమీ పూర్వ విద్యార్ధి. అంతే కాకుండా ఆరన్ మీడియా వర్క్స్ సంస్థకు అధినేత కూడా.